గంగమ్మకే పెద్దమ్మ.. మన కృష్ణమ్మ!.. దేశంలోనే అగ్రగామిగా..

17 Feb, 2023 03:43 IST|Sakshi

రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యంలో దేశంలోనే అగ్రగామిగా కృష్ణానది

1,788.99 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ప్రథమ స్థానం    

రెండో స్థానంలో గంగా, ఆ తర్వాత గోదావరి 

కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) రికార్డులు వెల్లడి

సాక్షి, అమరావతి: దేశంలో నీటి నిల్వ సామర్థ్యం అత్యధికంగా ఉన్న జలాశయాలతో కృష్ణా నది అగ్రగామిగా అవతరించింది. అతి పెద్ద నది అయిన గంగా, రెండో అతి పెద్ద నది అయిన గోదావరి కన్నా నీటి నిల్వ సామర్థ్యం ఉన్న జలాశయాల్లో అగ్రగామిగా కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) రికార్డుల్లోకి ‘కృష్ణా నది చేరింది. దేశంలో హిమాలయ, ద్వీపకల్ప నదులతో పాటు అన్ని నదీ పరివాహక ప్రాంతాల(బేసిన్‌)లో నిర్మాణం పూర్తయిన జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం 9,105.92 టీఎంసీలు.

ఇందులో 1,788.99 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లతో కృష్ణా నది ప్రథమ స్థానంలో నిలిచింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం 589.67 టీఎంసీలు కావడం గమనార్హం. అంటే.. దేశంలో అన్ని బేసిన్‌లలోని రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం కృష్ణా బేసిన్‌ రిజర్వాయర్ల సామర్థ్యంలో 19.65 శాతమన్నమాట.   

అత్యంత దిగువన బ్రహ్మపుత్ర  
హిమాలయ పర్వతాల్లో హిమానీనదాల్లో జన్మించి దేశంలో ప్రవహించే గంగా నది అతి పెద్దది. గంగా బేసిన్‌లో ఉన్న జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం 1,718.91 టీఎంసీలు. పశ్చిమ కనుమల్లో నాసిక్‌ వద్ద జన్మించి ద్వీపకల్పంలో ప్రవహించే గోదావరి రెండో అతి పెద్ద నది. ఈ బేసిన్‌లో రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం 1,237.61 టీఎంసీలు. వీటిని పరిశీలిస్తే.. నీటి నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లలో గంగా, గోదావరి కంటే కృష్ణా నదే మిన్న అని స్పష్టమవుతోంది.

రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యంలో గంగా, గోదావరి రెండు, మూడు స్థానాల్లో నిలవగా.. దేశంలో పశ్చి­మం వైపు ప్రవహించే నర్మదా నది నాలుగో స్థానంలో నిలిచింది. ఇక దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే వర్షఛాయ ప్రాంతంలో పుట్టి, ప్రవహించే పెన్నా బేసిన్‌లో 239.59 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లున్నాయి. రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యంలో పెన్నా బేసిన్‌ దేశంలో తొమ్మిదో స్థానంలో నిలవ­డం గమనార్హం. హిమాలయ నది అయిన బ్రహ్మపుత్ర బేసిన్‌లో రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం 88.65 టీఎంసీలే కావడం గమనార్హం. 

మరిన్ని వార్తలు