అనంతపురం: నెరవేరిన నాలుగున్నర దశాబ్దాల కల

1 Jun, 2022 11:26 IST|Sakshi
శింగనమల చెరువు

శింగనమల చెరువుకు కృష్ణా జలాలు

ఒక టీఎంసీ కేటాయిస్తూ జీవో విడుదల

ఫలించిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కృషి

శింగనమల రంగరాయల చెరువు ఆయకట్టుదారుల కల నాలుగున్నర దశాబ్దాలకు సాకారమైంది. చెరువుకు ఒక టీఎంసీ   కృష్ణా జలాలు కేటాయిస్తూ మంగళవారం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. దీంతో ఈ ప్రాంతవాసుల కలతో పాటు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సంకల్పమూ నెరవేరినట్లయ్యింది. ఆరువేల ఎకరాల్లో సాగుకు సానుకూలమైంది. రైతులు, వ్యవసాయ కూలీలే కాదు.. మత్స్యకారుల మోముల్లోనూ సంతోషం వెల్లివిరిసింది.  

సాక్షి,శింగనమల(అనంతపురం): శింగనమలలోని రంగరాయల చెరువు జిల్లాలోనే అతిపెద్దది. శింగనమల, గోవిందరాయునిపేట, సోదనపల్లి, ఈస్ట్‌ నరసాపురం, పెద్దమట్ల    గొంది, చీలేపల్లి, శివపురం, సి.బండమీదపల్లి, పోతురాజుకాల్వ, చక్రాయిపేట, పెరవలి గ్రామాల వరకు అధికారిక, అనధికారికంగా దాదాపు ఆరువేల ఎకరాల ఆయుకట్టు ఉంది. చెరువులో నీరుంటే ఈ గ్రామాలతో పాటు నాయనవారిపల్లి, చిన్నమట్ల   గొంది, ఆనందరావుపేట, చిన్నజలాలపురం, గురుగుంట్ల, మదిరేపల్లి, నీలాంపల్లి, పాత చెదుల్ల, కొత్త చెదల్ల, కొర్రపాడు గ్రామాల వరకు భూగర్భజలం పెరిగే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో చెరువును లోకలైజేషన్‌ చేయాలన్నది ఈ ప్రాంత రైతుల డిమాండ్‌. వీరి ఆకాంక్షలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు లోకలైజేషన్‌ అంశాన్ని 1978 నుంచి ఎన్నికల హామీగా మార్చేశాయి. ఒకానొక దశలో టీడీపీ హయాంలో ‘లోకలైజేషన్‌’ జీఓ తెచ్చామని ఆ పార్టీ నాయకులు ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. అయితే ప్రజలు వారి మాటలను నమ్మలేదు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు నాలుగేళ్లపాటు శింగనమల చెరువుకు నీళ్లు వచ్చాయి.

నార్పలలో నిర్వహించిన బహిరంగ సభలో ‘లోకలైజేషన్‌’ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆయన అకాల మరణంతో హామీ నెరవేరలేదు. కనీసం చెరువుకు నీరు విడిపించే దిక్కు లేకుండా పోయింది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చొరవ తీసుకుని పలు దఫాలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడి చెరువుకు నీరు విడుదల చేయించారు. నేటికీ నీటితో చెరువు    కళకళలాడుతోంది. వైఎస్సార్‌ హయాంలో ఇచ్చిన హామీని.. తనయుడు సీఎం వైఎస్‌ జగన్‌ ద్వారా  నెరవేర్చడంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సఫలీకృతులయ్యారు. 

ఏటా పంటలు 
శింగనమల రంగరాయల చెరువుకు ప్రతి ఏటా ఒక టీఎంసీ కృష్ణా జలాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. హంద్రీ–నీవా కాలువ ద్వారా పీఏబీఆర్, అటు నుంచి నుంచి మిడ్‌ పెన్నార్‌ (ఎంపీఆర్‌), అక్కడి నుంచి దక్షిణ కాలువ ద్వారా శింగనమల చెరువుకు నీళ్లు రానున్నాయి. చెరువు నీటి నిల్వ సామర్థ్యం ఒక టీఎంసీ. నీరు వదిలితే ఏటా పంటలు పండుతాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

మత్స్యకారులకు ఉపాధి 
చెరువులో నీరు ఉంటే చేపల వేటకు ఢోకా ఉండదు. 300 మత్స్యకార కుటుంబాలు ఈ చెరువుపై ఆధారపడి ఉన్నాయి. మత్స్యకారులకు ఎప్పుడూ చేపల వేట ఉంటుంది. తద్వారా జీవనోపాధి మెరుగుపడనుంది. 

ఆనందంగా ఉంది 
శింగనమల చెరువుకు నీటి కేటాయింపు అనేది ఎన్నో ఏళ్లపాటు హామీగానే నిలిచిపోయింది. ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు. కానీ ఎవ్వరూ నెరవేర్చలేకపోయారు. కానీ జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి మా చెరువుకు నీటిని కేటాయించడానికి     ఎంతో కృషి చేశారు. చెరువు కింది ఆయకట్టు రైతులు, వ్యవసాయ కూలీలు చాలా సంతోషంగా ఉన్నారు.  
– గోవిందరెడ్డి, చెరువు ఆయకట్టు రైతు సంఘం నాయకులు, శింగనమల 

జలప్రదాత పద్మావతి
శింగనమల చెరువుకు నీటి కేటాయింపునకు కృషి చేసిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి మత్స్యకారులు జీవితాంతం రుణపడి ఉంటారు. చెరువులో నీరు లేక ఎన్నో సంవత్సరాలు చేపల పెంపకం చేపట్టలేకపోయాం. కానీ ఎమ్మెల్యే పద్మావతి చెరువుకు నీటి           కేటాయింపులు చేయించి మాకు జలప్రదాతగా మారింది.  
– వెంకటనారాయణ, మత్స్యకారుడు, శింగనమల 

మాట ఇచ్చారు.. నెరవేర్చారు 
దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నార్పల బహిరంగసభలో చెరువు లోకలైజేషన్‌ చేస్తామని మాట ఇచ్చారు. ఆయన మృతి చెందిన తర్వాత అధికారంలోకి వచ్చిన వారు పట్టించుకోలేదు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత చెరువు సమస్యను వివరించా. ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు శింగనమల చెరువుకు ఒక టీఎంసీ నీరు కేటాయించారు. శింగనమల ప్రజల చిరకాల కోరికను నెరవేర్చాం. చాలా సంతోషంగా ఉంది.  
– ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, శింగనమల  

మరిన్ని వార్తలు