కృష్ణమ్మ పరవళ్లు

19 Jul, 2021 04:24 IST|Sakshi
పులిచింతల ప్రాజెక్టు

సాక్షి, అమరావతి/అచ్చంపేట/కర్నూలు సిటీ: ఎగువన గల ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాల నుంచి వస్తున్న ప్రవాహానికి తోడు దిగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లోకి కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎగువ ఆల్మట్టి నుంచి 52 వేల క్యూసెక్కులను దిగువ నారాయణపూర్‌కు విడుదల చేస్తుండగా.. అక్కడి నుంచి 62 వేల క్యూసెక్కులను నదిలోకి వదిలేస్తుండటంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులకు భారీ ప్రవాహాలు వచ్చి చేరుతున్నాయి. ఆదివారం సాయంత్రానికి జూరాలకు 79 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, లక్ష క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. శ్రీశైలానికి 99 వేల క్యూసెక్కులు వస్తుండటంతో జలాశయంలోని నీటిమట్టం 41.11 టీఎంసీలకు చేరింది. శ్రీశైలం విద్యుత్‌ ప్రాజెక్ట్‌లో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ 7 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతుండగా.. నాగార్జున సాగర్‌లోకి 9వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. సాగర్‌ నీటిమట్టం 169.71 టీఎంసీలకు చేరింది.  

44.18 టీఎంసీలకు చేరిన పులిచింతల 
పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నాగార్జున సాగర్, కృష్ణా పరీవాహక ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఆదివారం సాయంత్రం 6 గంటలకు నీటి నిల్వ 44.1813 టీఎంసీలకు చేరింది. జెన్‌కో పవర్‌ జనరేషన్‌కు 13,800 క్యూసెక్కులు వదలడం అనివార్యమైందని ప్రాజెక్టు ఏఈ రాజశేఖర్‌ తెలిపారు. ఒక రేడియల్‌ గేటును మూడు అడుగుల మేర ఎత్తి 11వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నామన్నారు. మరో 600 క్యూసెక్కులు రేడియల్‌ లీకేజీ వల్ల దిగువకు వెళ్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 175 అడుగుల సామర్థ్యానికి గాను 173 అడుగుల మేర నీరు ఉన్నట్టు వివరించారు. ఇది 44.18 టీఎంసీలకు సమానమని చెప్పారు.

తుంగభద్రకు పెరిగిన ఇన్‌ఫ్లో 
తుంగభద్ర డ్యామ్‌లోకి నీటి ప్రవాహం పెరిగింది. శనివారం 40 వేల క్యూసెక్కులుగా ఉన్న ప్రవాహం ఆదివారం నాటికి 58 వేల క్యూసెక్కులకు చేరింది. ప్రస్తుతం డ్యామ్‌లో 50 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. దీంతో సాగు నీటి కాలువలకు నీటిని విడుదల చేసేందుకు బోర్డు అధికారులు సిద్ధమవుతున్నారు. కర్ణాటకలోని కొప్పళ, రాయచూరు జిల్లాలకు ఉపకరించే తుంగభద్ర ఎడమ కాలువకు ఆదివారం నీటిని విడుదల చేశారు.   

మరిన్ని వార్తలు