శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చేయకపోతే కృష్ణా జలాలు వృథా

15 Sep, 2021 04:11 IST|Sakshi

తక్షణమే విద్యుదుత్పత్తి చేయాలని జెన్‌కోను కోరాం

కృష్ణా బోర్డుకు ఏపీ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి లేఖ

కరెంటు ఉత్పత్తికి సోమవారమే బోర్డు అనుమతి కోరిన ఏపీ

సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరడం, 1.08 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తున్న నేపథ్యంలో మరో రెండు మూడు రోజుల్లో గేట్లు ఎత్తేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందని కృష్ణా బోర్డుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం కుడిగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేయకపోతే.. కృష్ణా జలాలను వృథాగా సముద్రంలోకి వదిలేయాల్సిన పరిస్థితి వస్తుందని పేర్కొంది. అందువల్లే శ్రీశైలం కుడిగట్టు కేంద్రంలో తక్షణమే విద్యుదుత్పత్తి ప్రారంభించాలని ఏపీ జెన్‌కో (విద్యుదుత్పత్తి సంస్థ)ను కోరామని వివరిస్తూ మంగళవారం కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురేకు ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి లేఖ రాశారు. శ్రీశైలం కుడిగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తికి అనుమతి ఇవ్వాలని సోమవారం లేఖ రాసిన అంశాన్ని గుర్తుచేశారు. తాజాగా రాసిన లేఖలో ప్రధానాంశాలు..

► మంగళవారం ఉదయం 11 గంటలకు శ్రీశైలంలో 882.4 అడుగుల్లో 201 టీఎంసీల నీరు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. పూర్తి నీటినిల్వ 215.807 టీఎంసీలు. 
► శ్రీశైలంలోకి 1.08 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. వరద ఉద్ధృతి నేపథ్యంలో మరో రెండు మూడు రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
► శ్రీశైలం గేట్లు ఎత్తేయడం వల్ల కృష్ణా జలాలు వృథాగా సముద్రంలో కలుస్తాయి. ఈ నేపథ్యంలో తక్షణమే విద్యుదుత్పత్తిని ప్రారంభించి.. వరద నీటిని సద్వినియోగం చేసుకోవాలని ఏపీ జెన్‌కోకు విజ్ఞప్తి చేశాం.  

మరిన్ని వార్తలు