ఆనందయ్య మందు: తయారీ కేంద్రం మార్పు

2 Jun, 2021 11:39 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: కృష్ణపట్నంలో ఆనందయ్య మందు తయారీ కేంద్రాన్ని మరో చోటుకి మార్చారు. కృష్ణపట్నం పోర్టులోని సీవీఆర్‌ సెక్యూరిటీ అకాడమీకి మందు తయారీ కేంద్రాన్ని తరలించారు. ఇప్పటివరకు పంపిణీ జరిగిన ప్రాంతంలోనే మందు తయారీ చేయాలని ఆనందయ్య భావించారు. అయితే జిల్లా యంత్రాంగంతో కలిసి ఆనందయ్య చర్చించిన అనంతరం తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇప్పటికే మందు తయారీకి కావల్సిన ముడి సరుకులు, ఇతర వంట సామాగ్రిని సీవీఆర్‌కు తరలించారు. కృష్ణపట్నంలో తయారు చేస్తే అక్కడకు కూడా  ప్రజలు భారీగా వచ్చే అవకాశం ఉందని, ఎటువంటి సమస్యలు తలెత్తకూడదన్న ఉద్దేశంతో తయారీ కేంద్రాన్ని మార్చినట్లు అధికారులు తెలిపారు.

మందు తయారీ సమయంలో భద్రత తదితర విషయాల్లో సహకరించాలని జిల్లా కలెక్టర్‌కు ఆనందయ్య విజ్ఞప్తి చేశారు. తయారీకి కావలసిన మూలికలు ఔషధాలు సమకూర్చుకునే విషయంలో ప్రభుత్వ యంత్రాంగం సహకరించాలని ఆనందయ్య కోరారు. అవసరమైతే గిరిజన కార్పొరేషన్ సొసైటీ నుంచి తేనే సప్లై చేస్తామని కలెక్టర్ చక్రధర బాబు తెలిపారు. నేటి నుంచి childeal.in పేరుతో ఆనందయ్య మందుకు సంబంధించిన వెబ్‌సైట్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వెబ్‌సైట్‌లో కస్టమర్ దరఖాస్తు చేసుకుంటే కొరియర్ ద్వారా మందు పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు ఆనందయ్య బృందం తెలిపింది. సోమవారం నుండి ఆనందయ్య మందు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: ఆనందయ్య మందుల తయారీ ఇలా

మరిన్ని వార్తలు