‘క్రిస్‌ సిటీ’ తొలి దశకు టెండర్లు 

21 Sep, 2021 05:32 IST|Sakshi

రూ.1,190 కోట్ల పనులకు టెండర్లు పిలిచిన ఏపీఐఐసీ 

చెన్నై–బెంగళూరు కారిడార్‌లో భాగంగా కృష్ణపట్నం వద్ద తొలి దశలో 2,134 ఎకరాల్లో అభివృద్ధి 

క్రిస్‌ సిటీ నిర్మాణ పనులు 36 నెలల్లో పూర్తి చేయాలన్న నిబంధన 

బిడ్లు దాఖలుకు చివరి తేదీ నవంబర్‌ 4

సాక్షి, అమరావతి: చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా కృష్ణపట్నం ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీ (క్రిస్‌ సిటీ) తొలి దశ పనులకు ఏపీఐఐసీ టెండర్లు పిలిచింది. పరిశ్రమల ఏర్పాటుతో పాటు నివాసయోగ్యంగా ఉండేలా నిర్మిస్తున్న క్రిస్‌ సిటీలో రహదారులు, విద్యుత్, నీటి సదుపాయాలు, మురుగు, వరద నీరు పారుదల, మురుగునీటి శుద్ధి వంటి మౌలిక వసతుల కల్పనకు రూ.1,190 కోట్ల విలువైన పనులకు ఏపీఐఐసీ బిడ్లను ఆహ్వానించింది. ఈ కాంట్రాక్ట్‌ దక్కించుకున్న సంస్థ 36 నెలల్లో పనులను పూర్తి చేయాలన్న నిబంధన విధించింది. అలాగే పనులు పూర్తయిన తర్వాత నాలుగేళ్ల పాటు క్రిస్‌ సిటీ నిర్వహణ బాధ్యతలను కూడా చూడాల్సి ఉంటుంది.

ఆసక్తి గల సంస్థలు నవంబర్‌ 4 మధ్యాహ్నం 3 గంటల్లోగా బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. సీబీఐసీ కారిడార్‌లో భాగంగా మొత్తం 12,944 ఎకరాల్లో కృష్ణపట్నం నోడ్‌ను అభివృద్ధి చేయనుండగా తొలిదశ కింద 2,134 ఎకరాలను అభివృద్ధి చేయడానికి నేషనల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఇంప్లిమెంటేషన్‌ ట్రస్ట్‌ (నిక్‌ డిట్‌) ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.2,139.44 కోట్లను నిక్‌డిట్‌ కేటాయించింది. ఈ క్రిస్‌ సిటీ నిర్మాణం ద్వారా రూ.37,500 కోట్ల పెట్టుబడులు, లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుందని అంచనా.   

మరిన్ని వార్తలు