రూ.1,200 కోట్లతో కృష్ణపట్నం నోడ్‌ పనులు

25 Jan, 2021 04:34 IST|Sakshi

అభివృద్ధికి ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్‌ కమిటీ 

మౌలిక వసతుల కల్పనకు నెలాఖరుకు ఈపీసీ టెండర్లు  

తొలి దశలో 2,134 ఎకరాల్లో అభివృద్ధి  

రూ.18,548 కోట్ల పెట్టుబడులు.. 98,000 మందికి ఉపాధి అంచనా 

సాక్షి, అమరావతి: చెన్నై–బెంగళూరు కారిడార్‌లో భాగంగా 12,944 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్న కృష్ణపట్నం నోడ్‌ (కృష్ణపట్నం పారిశ్రామికవాడ)కు కేంద్ర కేబినెట్‌ కమిటీ ఆమోదం లభించడంతో పనులు ప్రారంభించడానికి ఏపీఐఐసీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా తొలి దశలో 2,134 ఎకరాలు అభివృద్ధి చేయనున్నారు. ఇందుకు నేషనల్‌ ఇండ్రస్టియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ కింద రూ.2,139.44 కోట్లు ఇవ్వడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో కృష్ణపట్నం నోడ్‌లో సుమారు రూ.1,200 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు ఈపీసీ విధానంలో టెండర్లు పిలవడానికి ఏపీఐఐసీ రంగం సిద్ధం చేసింది. రహదారుల నిర్మాణం, నీటి వసతి, మురుగు నీటి శుద్ధి, విద్యుత్‌ వంటి కీలక మౌలిక వసతుల కల్పనకు రూ.1,200 కోట్ల విలువైన పనులకు ఈ నెలాఖరులో ఏపీఐఐసీ టెండర్లు పిలవనుంది. ఇందులో రహదారుల నిర్మాణానికి రూ.432 కోట్లు, విద్యుత్‌ సౌకర్యం కోసం రూ.420 కోట్లు, నీటి వసతి కల్పన, మురుగునీటి శుద్ధి వంటి పనులకు రూ.348 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. జూలై మొదటి వారంలో కృష్ణపట్నం నోడ్‌ పనులు ప్రారంభించాలని ఏపీఐఐసీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. 

నివాసయోగ్యంగానూ అభివృద్ధి: కేవలం పారిశ్రామిక యూనిట్లే కాకుండా నివాస యోగ్యంగా కృష్ణపట్నం నోడ్‌ను అభివృద్ధి చేస్తున్నారు. పోర్టు ఆధారంగా అభివృద్ధి చెందిన చెన్నై, కోల్‌కతా నగరాల మాదిరిగానే పరిశ్రమలతో పాటు నివాస యోగ్యంగా కూడా ఉండేలా అభివృద్ధి చేస్తున్నట్లు ఏపీఐఐసీ వీసీ, ఎండీ రవీన్‌కుమార్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. అభివృద్ధి చేస్తున్న మొత్తం ప్రాంతంలో 46 శాతం మాత్రమే పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తారు. ఉద్యోగులు అక్కడే నివసించే విధంగా గృహ సముదాయాలు నిరి్మంచడానికి 13.9 శాతం వినియోగించనున్నారు. లాజిస్టిక్‌ అవసరాలకు 5.6 శాతం కేటాయించి, పర్యావరణ పరిరక్షణ కోసం 10.9 శాతం ఖాళీగా ఉంచుతారు. తొలి దశలో అభివృద్ధి చేసే ఈ నోడ్‌ ద్వారా సుమారు 18,548 కోట్ల విలువైన పెట్టుబడులతో పాటు 98,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ప్రధానంగా టెక్స్‌టైల్, ఇంజనీరింగ్, ఆటోమొబైల్, ఎల్రక్టానిక్స్, ఆప్టికల్‌ వంటి తయారీ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. పనులు మొదలుపెట్టిన నాటి నుంచి మూడేళ్లలో పూర్తి స్థాయి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేలా ఏపీఐఐసీ ప్రణాళిక సిద్ధం చేసింది.   

మరిన్ని వార్తలు