వారి గత చరిత్రపై పోలీసు నివేదిక తప్పనిసరి 

8 Oct, 2020 05:43 IST|Sakshi

పోక్సో చట్టంపై ఆన్‌లైన్‌ శిక్షణ కార్యక్రమంలో కృతికా శుక్లా 

సాక్షి, అమరావతి: పిల్లలతో కలిసి పనిచేసే వారు, పిల్లలకు వసతి కల్పించే సంస్థలు, పాఠశాలలు, క్రీడా అకాడమీల సిబ్బంది గత చరిత్రపై పోలీస్‌ నివేదిక తప్పనిసరి అని మహిళాభివృద్ధి, బాలల, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ కృతికా శుక్లా స్పష్టం చేశారు. బాలలపై లైంగిక నేరాల నుంచి రక్షణ కల్పించే నిబంధనల(పోక్సో)పై జిల్లాస్థాయి అధికారులతో బుధవారం ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీలు, పోలీస్‌ అధికారులు, స్పెషల్‌ జువైనల్‌ పోలీస్‌ యూనిట్లు, జిల్లా బాలల సంరక్షణ అధికారులు, ప్రొబెషన్‌ అధికారులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృతికా శుక్లా మాట్లాడారు. ఆమె ఇంకా ఏమన్నారంటే... 

► పోక్సో చట్టం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసింది. 
► గుంటూరులో బాలల కోసం చైల్డ్‌ ఫ్రెండ్లీ కోర్టును ఏర్పాటు చేశారు. 
► దిశ పోలీస్‌ స్టేషన్లు పోక్సో చట్టం అమలు కోసం కూడా పని చేస్తున్నాయి. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్‌ అనూరాధ, సీఐడీ ఏఐజీ సునీల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు