ఏపీ అభ్యంతరాలకు వివరణ ఇవ్వండి

2 Jul, 2021 08:33 IST|Sakshi

తెలంగాణాకు కేఆర్‌ఎంబీ ఆదేశం

ఆంధ్రప్రదేశ్‌ ఫిర్యాదుపై స్పందన

7లోగా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టీకరణ

సాక్షి, అమరావతి: నాగార్జున సాగర్‌ డ్యామ్‌ నుంచి కేటాయింపులకు మించి తెలంగాణ నీటి వినియోగంపై కేఆర్‌ఎంబీ (కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు) అభ్యంతరం తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుంచి మే 31వ తేదీ వరకు 13.4 టీఎంసీల నీటిని విద్యుత్‌ ఉత్పత్తి పేరుతో తెలంగాణ ఏకపక్షంగా వినియోగించుకుందన్న ఏపీ అభ్యంతరాలకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పటి వరకు సాగర్‌ నుంచి విడుదల చేసిన 9.9 టీఎంసీల నీటిని మొత్తం కేటాయింపుల నుంచి మినహాయించుకోవాలని తెలంగాణకు సూచించింది. వచ్చే సమావేశం నాటికి దీనికి సంబంధించిన వివరాలను సమర్పించాలని పేర్కొంది. ఈ నెల ఏడో తేదీలోగా కేఆర్‌ఎంబీ సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్‌సీకి కృష్ణా బోర్డు లేఖ రాసింది.

ఏపీ కోటా నుంచి ఆ నీటిని మినహాయించాలి
గత నీటి సంవత్సరంలో నాగార్జునసాగర్‌ కుడికాలువకు నీటిని విడుదల చేయవద్దని కోరినా ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుంచి మే 31 వరకు 13.4716 టీఎంసీలను అనవసరంగా విడుదల చేశారని, వాటిని ఏపీ కోటా నుంచి మినహాయించాలని కృష్ణాబోర్డుకు ఏపీ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి లేఖ రాశారు. దీనిపై స్పందించిన బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే.. ఏపీ ఈఎన్‌సీ రాసిన లేఖలో పేర్కొన్న అంశాలపై అభిప్రాయం చెప్పాలంటూ తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ను ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఆయనకు లేఖ రాశారు. 

మరిన్ని వార్తలు