ఆ మూడు లక్షణాలున్నా ఆస్పత్రిలో చేరొచ్చు

9 Aug, 2020 03:46 IST|Sakshi

కోవిడ్‌ టెస్ట్‌ అవసరం లేదు

ప్రభుత్వానికి ప్రజలు సహకరించి రక్షణ చర్యలు తీసుకోవాలి

వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి

వరుసగా మూడు లేదా నాలుగు రోజుల పాటు జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రక్తంలో ఆక్సిజన్‌ శాతం 94 కంటే తగ్గిపోతే నేరుగా ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందొచ్చు. ఇలాంటి లక్షణాలున్న వారికి పరీక్షలు లేకుండానే ఆస్పత్రిలో చేర్చుకునిచికిత్స ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించాం.

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌కు సంబంధించిన మూడు ప్రధాన లక్షణాలుంటే నిర్ధారణ పరీక్షలు కూడా అవసరంలేదని, నేరుగా ఆస్పత్రికి వెళ్తే చేర్చుకుంటారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డా.కేఎస్‌ జవహర్‌రెడ్డి అన్నారు. మహమ్మారి నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చేయాల్సిన అన్ని చర్యలూ చేపట్టిందని.. ఇక ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలే ఎక్కువగా ఉన్నాయని శనివారం ఆయన మీడియాతో అన్నారు. జవహర్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే..

► అన్‌లాక్‌ తర్వాత పాజిటివిటీ రేటు పెరిగింది. ఇప్పుడు కేసులు కాదు మరణాల నియంత్రణే మనముందున్న కర్తవ్యం. 
► ప్రస్తుతం నాలుగు జిల్లాల్లో వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉంది. మరికొన్ని జిల్లాల్లో ఈ స్థాయికి రాబోతోంది. ప్రజలు రక్షణ చర్యలు విధిగా పాటించాలి.
► మరణాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. కనీసం ఆరు రోజులు ఆస్పత్రిలో ఉండాలి. రెమ్‌డెసివిర్, తోసిజుమాంబ్‌ వంటి మందులు వాడాలి. సాధారణ, ఆక్సిజన్‌ బెడ్‌ మీద మరణాలు సంభవించకూడదని కలెక్టర్లకు ఆదేశాలిచ్చాం.
► ఈనెల 12 వరకూ నాలుగు జిల్లాల్లో సీరో–సర్వైలెన్స్‌ జరుగుతోంది. దీన్నిబట్టి ఏపీలో యాంటీబాడీస్‌ స్థాయి ఎంత పెరిగాయి.. ఎంతమందికి వైరస్‌ వచ్చి పోయిందో తెలుస్తుంది.
► ఈ ఫలితాలను బట్టి తదుపరి వ్యూహం అమలుచేస్తాం.
► 104, 14410, జిల్లాల్లో ఉన్న కాల్‌సెంటర్‌ నంబర్లను ఉపయోగించుకోవాలి.

మరిన్ని వార్తలు