టీటీడీ ఆస్తుల పరిరక్షణకు అన్ని చర్యలూ..

4 Mar, 2021 04:19 IST|Sakshi

విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీని వేశాం 

ఆస్తులను అమ్మరాదని తీర్మానం చేశాం 

ఆస్తుల వివరాలతో శ్వేతపత్రం ప్రచురించాం 

హైకోర్టుకు నివేదించిన టీటీడీ ఈవో కేఎస్‌ జవహర్‌రెడ్డి 

సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి ఆస్తుల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నామని టీటీడీ ఈవో కె.ఎస్‌.జవహర్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. ఆస్తుల పరిరక్షణ విషయంలోనే కాక ఇతర విషయాల్లోనూ తగిన సహాయ, సహకారాలు అందించేందుకు వీలుగా గౌహాతీ హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీధరరావు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్‌ జగన్నాథరావు, జస్టిస్‌ వాద్వా కమిటీలు ఇచి్చన నివేదికలను సైతం అమలు చేస్తున్నామన్నారు. శ్రీవారి ఆభరణాల రక్షణ, ఇతర విధి విధానాలపై ఈ కమిటీల నివేదికల ప్రకారం వ్యవహరిస్తున్నామని తెలిపారు. టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేశామని, ఆ వివరాలన్నీ టీటీడీ వెబ్‌సైట్‌లో ఉన్నాయని వివరించారు.

టీటీడీకి చెందిన ఏ భవనాన్ని గానీ, ఆస్తిని గానీ విక్రయించరాదని టీటీడీ బోర్డు తీర్మానం చేసిందన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, టీటీడీ ఆస్తులపై దాఖలైన వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోర్టును కోరారు. టీటీడీకి తమిళనాడులో ఉన్న 23 ఆస్తులను వేలం వేసేందుకు టీటీడీ పాలక మండలి నిర్ణయించిందని, ఇందులో జోక్యం చేసుకోవాలని కోరుతూ అనంతపురానికి చెందిన బీజేపీ నేత అమర్నాథ్‌ గత ఏడాది హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన సీజే జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి నేతృత్వంలోని ధర్మాసనం, టీటీడీ ఆస్తుల పరిరక్షణకు చేసిన తీర్మానాలు, కమిటీ ఏర్పాటు తీర్మానాలు, ఆస్తుల వివరాలను తమ ముందుంచాలని టీటీడీ ఈవోను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు జవహర్‌రెడ్డి అఫిడవిట్‌ దాఖలు చేశారు. టీటీడీకి ఎక్కడెక్కడ ఎంతెంత ఆస్తులు ఉన్నాయో అందులో వివరించారు. ఈ వ్యాజ్యంపై ధర్మాసనం 8న విచారణ జరపనుంది. 

మరిన్ని వార్తలు