కొత్త జిల్లాల్లో త్వరగా ఖాళీల భర్తీ

17 Feb, 2023 05:38 IST|Sakshi

కార్యదర్శుల సమావేశంలో సీఎస్‌ డా.జవహర్‌ రెడ్డి  

పదోన్నతులు, రేషనలైజేషన్, ఇన్‌చార్జ్‌ బాధ్యతల అప్పగింత

అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇ–ఆఫీస్‌ విధానం

గ్రూపు–1, 2 స్థాయి పోస్టుల వివరాలు వెంటనే అందించండి

అసెంబ్లీ, కౌన్సిల్‌లో సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు పంపండి

కోర్టు కేసులపై త్వరలో జీపీలు, కార్యదర్శులతో వర్క్‌షాప్‌

ఉద్యోగుల ఆర్థికేతర డిమాండ్లను సకాలంలో పరిష్కరించాలి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్త జిల్లాల్లో మండల, జిల్లా స్థాయి పోస్టులతో పాటు గ్రామ, వార్డు సచివాలయాలు సహా వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి ఏపీపీఎస్‌సీ ద్వారా రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ జరిగే లోగా తాత్కాలిక ప్రాతిపదికన ప్రస్తుతం ఉన్న సిబ్బంది రేషనలైజేషన్, పదోన్నతులు, ఇన్‌చార్జి బాధ్యతల అప్పగింత ద్వారా త్వరగా భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్‌ జవహర్‌ రెడ్డి కార్యదర్శులకు సూచిం­చారు.

గురువారం రాష్ట్ర సచివాలయం ఐద­వ బ్లాకు కలెక్టర్ల సమావేశ మందిరంలో సీఎస్‌ అధ్యక్షతన కార్యదర్శుల సమావేశం జరిగింది. గ్రామ, వా­ర్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను మరింత మెరుగు పరచడం, అధికారాల బదిలీ, కలెక్టర్లతో వీడియో సమావేశాల్లో వచ్చిన అంశాలపై ఫాలోఅప్‌ చర్యలు, అసెంబ్లీకి సంబంధించి పెండింగ్‌లో ఉన్న వివిధ ఎల్‌ఏక్యూ, ఎల్సీ­క్యూలపై సత్వరం సమాచారం అందించడం, తది­త­ర అజెండా అంశాలపై సీఎస్‌ కార్యదర్శులతో సమీ­క్షించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. 

► గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లరేషన్‌కు చర్యలు తీసుకోవాలి. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూపు 1, 2స్థాయి పోస్టుల ఖాళీల వివరాలను వెంటనే సాధారణ పరిపాలన శాఖకు అందజేయాలి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇ–ఆఫీస్‌ విధానం కింద ఇ–రశీదులు, ఇ–డిస్పాచ్‌ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలి. 

► త్వరలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ, శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖలు త్వరగా సమాధానాలు అందించేందుకు చర్యలు తీసు­కోవాలి. వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న ఏసీ­బీ, విజిలెన్సు కేసులను నిరంతరం మానిటర్‌ చేస్తూ ఆయా కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలి. 

► ఏపీ ఆన్‌లైన్‌ లీగల్‌ కేసుల మేనేజ్‌మెంట్‌ విధానం కింద వివిధ శాఖల్లో నమోదు అవుతున్న కోర్టు కేసులకు సంబంధించి సకాలంలో కౌంటర్లు దాఖలు చేయాలి. కోర్టు కేసులపై జాప్యం లేకుండా సకాలంలో చర్యలు తీసుకోవాలి. దీనిపై త్వరలో జీపీలు, కార్యదర్శులతో వర్కషాపు నిర్వహిస్తాం.

► గతంలో నిర్వహించిన ఉద్యోగ సంఘాల జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశాల్లో ఉద్యోగ సంఘాల నుండి వచ్చిన డిమాండ్లలో ఆర్థికేతర అంశాలకు సంబంధించిన డిమాండ్లను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలి. 

మరిన్ని వార్తలు