కేసులు తగ్గుముఖం..

29 Sep, 2020 03:47 IST|Sakshi

అయినా అప్రమత్తత అవసరం

భౌతిక దూరం, మాస్క్‌లే రక్షణ కవచాలు

అధికంగా వసూలు చేసే ప్రయివేటు ఆస్పత్రుల లైసెన్స్‌లు రద్దు

మీడియాతో వైద్యారోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని, అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డా.కేఎస్‌ జవహర్‌రెడ్డి చెప్పారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. భౌతిక దూరం పాటించడం, మాస్కు ధారణే నియంత్రణ మార్గమన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు మించి వసూలు చేసే ప్రయివేటు ఆస్పత్రుల లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. అధికంగా వసూలు చేస్తున్నాయంటూ పత్రికలు రాస్తున్నాయని, అయితే ఆ ఆస్పత్రుల పేర్లు కూడా రాస్తే బావుంటుందన్నారు. పేర్లు రాయకపోయినా మా దృష్టికి తెచ్చినా విచారణ జరుపుతామన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...

► ఆగస్ట్‌ 30 నుంచి సెప్టెంబర్‌ 12 వరకూ నమోదైన కేసులతో పోల్చుకుంటే, సెప్టెంబర్‌ 13 నుంచి 26 వరకూ నమోదైన కేసుల్లో 23.75శాతం తగ్గుదల ఉంది. 
► గతంలో రోజుకు 91 మరణాలుంటే ఇప్పుడా సంఖ్య 50 లోపే.. ప్రస్తుతం పట్టణాల్లో 40 శాతం, గ్రామాల్లో 60 శాతం కేసులు నమోదవుతున్నాయి.
► ప్రస్తుతం రోజుకు 70 వేలకు పైగా పరీక్షలు జరుగుతున్నాయి. వాటిలో ఆర్టీపీసీఆర్‌ టెస్టులు 35 వేలు చేస్తున్నాం. ఈ సంఖ్యను 50 వేలకు పెంచనున్నాం. దీనికి సంబంధించి పరికరాల కొనుగోలుకు టెండర్లు పూర్తయ్యాయి.
► రాష్ట్రంలో కేసుల రెట్టింపు గడువు బాగా పెరిగింది. దీంతో పాటు ఒక పాజిటివ్‌ వ్యక్తి వైరస్‌ వ్యాప్తి ఒకరి కంటే తక్కువే ఉంది.
► రాష్ట్రంలో 240 ఆస్పత్రుల్లో 53 వేల పడకలు సిద్ధం చేసి సేవలందిస్తున్నాం. దేశంలోనే ఏ రాష్ట్రమూ చేయని విధంగా ఏపీలో 28 వేల ఆక్సిజన్‌ పడకలు తయారు చేశాం.
► కోవిడ్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చిన ఘనత ఏపీదే.
► లక్షణాలున్నవారందరికీ పరీక్షలు చేయాలని చెప్పాం. 104కి కాల్‌ చేసినా వచ్చి పరీక్షలు చేస్తారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి మందులివ్వాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించాం. 

మరిన్ని వార్తలు