వేగంగా వెలిగొండ పనులు

7 Dec, 2021 05:36 IST|Sakshi
బోటులో కొల్లంవాగుకు వెళ్తున్న జవహర్‌రెడ్డి

ఇరిగేషన్‌ స్పెషల్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి

పెద్దదోర్నాల: వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని ఇరిగేషన్‌ స్పెషల్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కేఎస్‌ జవహర్‌రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని కొత్తూరు వద్ద ప్రాజెక్టు సొరంగం నిర్మాణ పనులను జవహర్‌రెడ్డి, ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జవహర్‌రెడ్డి మాట్లాడుతూ.. నల్లమల సాగర్‌లో తొలి దశలో 10.6 టీఎంసీల నీరు నిల్వ చేసేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నెల్లూరు, వైఎస్సార్, ప్రకాశం జిల్లాల్లో లక్షలాది మందికి సాగు, తాగునీరు అందుతుందన్నారు.

ప్రకాశం జిల్లాలో 1.19 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయని వివరించారు. మంగళవారం కొత్తూరు వద్ద సొరంగ నిర్మాణాలను పరిశీలించి.. జిల్లాలో జరుగుతున్న వివిధ ఇరిగేషన్‌ ప్రాజెక్టు పనులపై సమీక్ష జరుపుతామని చెప్పారు. బోటులో కొల్లం వాగుకు చేరుకున్న ఆయన అక్కడి నుంచి రెండో సొరంగంలో జరుగుతున్న మాన్యువల్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. మొదటి సొరంగం నుంచి 14వ కిలోమీటరు వద్ద రెండో సొరంగంలోకి తీసిన అప్రోచ్‌ టన్నెల్‌ను సైతం పరిశీలించారు. 

మరిన్ని వార్తలు