అంబేడ్కర్‌ పేరును వ్యతిరేకించడం దారుణం

27 May, 2022 04:45 IST|Sakshi
నిరసన తెలుపుతున్న ఎమ్మెల్సీ లక్ష్మణరావు, దళిత, ప్రజా సంఘాల నేతలు

కోనసీమకు అంబేడ్కర్‌ పేరును కొనసాగించాలనే డిమాండ్‌తో 5న ‘చలో అమలాపురం’

దళిత, బహుజన, ప్రజా సంఘాల నాయకులు   

నెహ్రూనగర్‌(గుంటూరు ఈస్ట్‌): కోనసీమ జిల్లాకు పెట్టిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరును వ్యతిరేకించడం దారుణమని ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు మండిపడ్డారు. గురువారం గుంటూరులోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద మాలమహానాడు, దళిత, బహుజన, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇతర జిల్లాలకు పేర్లు పెట్టినప్పుడు రాని అభ్యంతరం.. కోనసీమకు అంబేడ్కర్‌ పేరు పెట్టినందుకు రావడం దురదృష్టకరమన్నారు.

ప్రభుత్వం కోనసీమకు అంబేడ్కర్‌ పేరును కొనసాగించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే మస్తాన్‌వలి మాట్లాడుతూ ప్రపంచ మేధావి పేరును వ్యతిరేకించడం సరికాదన్నారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగానే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ 5న చలో అమలాపురానికి పిలుపునిచ్చినట్లు తెలిపారు.

బీజేపీ నేతలు అంబేడ్కర్‌ను చులకన చేసి మాట్లాడుతున్నారని, ఇందుకు సోము వీర్రాజు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రెడ్డి జనసేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు కె.అంజనీశ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు