రాజకీయ పిచ్చోళ్లను చూడాలనుకుంటే.. ఇక్కడికి రావచ్చు!

27 Feb, 2024 15:10 IST|Sakshi

'రాజకీయాలలో పిచ్చోళ్లు ఉంటారని వినడమే కానీ, చూడలేదు అని ఎవరైనా అనుకుంటుంటే, వారు ఆంధ్రప్రదేశ్‌కు రావచ్చు. అలా పిచ్చితనంతో వ్యవహరించే రాజకీయవేత్తలను చూసి ఇలా ఉంటారా అని తెలుసుకోవచ్చు. ఇప్పటికే ఒకరిద్ధరు పిచ్చి రాజకీయనేతలతో జనం సినిమా చూస్తుంటే, వారు చాలరన్నట్లు తెలంగాణ నుంచి వైఎస్ షర్మిల దిగుమతి అయ్యారు. ఆమె వ్యవహార శైలి, మాట్లాడుతున్న తీరు అంతా ఏ మాత్రం పద్ధతిగా లేవు. లేకుంటే ఏపీలో అసలు ప్రభుత్వ ఉద్యోగాలే ఇవ్వనట్లు, ఇరవైఒక్కవేల మంది ఆత్మహత్య చేసుకున్నట్లు అబద్ధపు లెక్కలు చెబుతారా! ఇది అచ్చంగా కొంతకాలం క్రితం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ముప్పైఒక్కవేల మంది మహిళలు ఏపీలో మిస్సింగ్ అయ్యారంటూ ఓ పిచ్చి ప్రకటన చేసిన తరహాలోనే ఉంది.'

పవన్‌ కల్యాణ్‌ కూడా ఎప్పుడు ఏమి మాట్లాడతారో తెలియదు. షర్మిల కూడా ఇప్పుడు అలాగే ప్రవర్తిస్తున్నారు. తన మాటలకు విశ్వసనీయత ఉండాలని, తను ఏదైనా చెబితే జనం శ్రద్ధగా విని అందులో వాస్తవం ఉందని అనుకోవాలని ఆమె భావించడం లేదు. తెలుగుదేశంకు మద్దతు ఇచ్చే మీడియాలో భారీగా తనకు వస్తున్న ప్రచారం చూసి మురిసిపోతున్నారేమో తెలియదు. కానీ అదే సమయంలో ఆమె కేంద్రంలోని బీజేపీని విమర్శించినా, పొరపాటున చంద్రబాబు ప్రస్తావన తెచ్చినా టీడీపీ మీడియా వాటన్నిటిని సెన్సార్ చేస్తున్న విషయం ఆమె గమనించడం లేదు. అంటే దాని అర్ధం రెండునెలల తర్వాత షర్మిల వార్తలను కూడా టీడీపీ మీడియా కరివేపాకు తీసిపారేసినట్లు తీసిపారేస్తుంది. కేవలం తన సోదరుడు వైఎస్‌ జగహన్‌మోహన్‌రెడ్డిపై ద్వేషంతో, టీడీపీ వారి రాజకీయ ట్రాప్‌లో పడి షర్మిల తెలివితక్కువ రాజకీయం చేస్తున్నారు.

తెలంగాణలో విఫలం అయిన షర్మిల ఏపీలో ఉద్దరిస్తుందని కాంగ్రెస్ నాయకత్వం తలపోయడంలోనే కుట్ర ఉంది. ఏపీలో ఉన్న కాంగ్రెస్ నేతలు ఎవ్వరూ పనికిరారని, వారందరిని చెత్తబుట్టలో వేసినట్లుగా ప్రవర్తిస్తూ, తెలంగాణ బిడ్డను అని చెప్పుకున్న షర్మిలను ఏపీకి తీసుకువచ్చి సోనియాగాంధీ మరోసారి ఏపీ కాంగ్రెస్‌ను, ఏపీ ప్రజలను అవమానించారు. రాష్ట్ర విభజన అంటే ఇష్టంలేని ఆంధ్రుల పుండుమీద కారం చల్లినట్లు కాంగ్రెస్ అధినాయకత్వం వ్యవహరించింది. దీనిని ప్రజలు గమనించకపోలేదు. కాకపోతే షర్మిల ఈ రాజకీయ వికృత క్రీడలో బలిపశువుగా మిగలబోతున్నారనిపిస్తుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, రామోజీరావు, రాధాకృష్ణ వంటి వైఎస్ కుటుంబ శత్రువులతో కుమ్మక్కై షర్మిల చివరికి తన తండ్రి ఆత్మ క్షోభించేలా చేస్తున్నారు.

తన అన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు అమలు చేస్తున్న వివిధ స్కీములను చూసి ఆనందపడవలసిన తరుణంలో షర్మిల పెత్తందారుల చేతిలో కీలుబొమ్మగా మారిపోయారు. విజయవాడలో షర్మిల చేసిన ధర్నా డ్రామా, ఆంధ్రరత్న భవన్‌లో నిద్రపోయిన సన్నివేశం, తదుపరి ఆమె ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు చూస్తే, కచ్చితంగా మరో పిచ్చి రాజకీయ నేత ఏపీకి వచ్చి తన వెర్రితనాన్ని బయట పెట్టుకుంటున్నారనిపిస్తుంది. నిజానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరిగా షర్మిల అంటే వైఎస్సార్‌సీపీ వారందరికీ గౌరవమే. కానీ ఆమె ఆ గౌరవాన్ని నిలబెట్టుకోలేకపోయారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నవారికి  ఆమె ఒక పాచికగా మారారు.

అయినా జగన్ తొణకకుండా తన మానాన తన పనిచేసుకుపోతున్నారు. షర్మిల చేస్తున్న తలతిక్క ప్రసంగాలను జగన్ పట్టించుకోవడం లేదు. దాంతో షర్మిల మరింత ప్రష్టేషన్‌కు గురై ఇష్టారీతిన పిచ్చి, పిచ్చిగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో కూడా ఇలాగే చేయబోయి పల్టీకొట్టారు. హైదరాబాద్‌లో ఒక సందర్భంలో ఆనాటి సీఎం ఇంటి ముట్టడికి అని బయల్దేరడం, అక్కడ పోలీసులు ఆపితే ఆమె కారునుంచి దిగకుండా మొండికేయడంతో, వారు ఆమెను అలాగే క్రేన్ తీసుకువచ్చి కారుతో సహా తీసుకుపోవడం జరిగింది. ఆ సమయంలో కొంతమంది పెద్ధలు కూడా రాజకీయ కారణాలతో సంఘీబావం తెలిపారు. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదు.

ఏపీలో పోలీసులు చాలా సంయమనంగా ఉంటున్నారని చెప్పాలి. దానికి కారణం ఆమె ముఖ్యమంత్రి సోదరి కావడమే. ఏ రాష్ట్రంలో అయినా శాంతిభద్రతలు కాపాడడం పోలీసుల విధి. తాను రాజకీయవేత్తను, పీసీసీ అధ్యక్షురాలిని కనుక, రోడ్డుమీద ఎక్కడబడితే తన ఇష్టం వచ్చినట్లు కూర్చుని ధర్నాలు చేస్తానంటే పోలీసులు చూస్తూ కూర్చోరు. ప్రజలకు అసౌకర్యం కలిగిస్తుంటే చక్కదిద్దవలసిన బాధ్యత వారిపై ఉంటుంది. ధర్నాలు, నిరసనలు తెలపడానికి నిర్దిష్ట స్థలాలు ఉన్నాయి. వాటిని కాదని రోడ్డుపై కూర్చుంటే ప్రజలకు ఎంత ఇబ్బంది! ఒకవేళ కూర్చున్నా, కొద్ధిసేపు తర్వాత పోలీసుల సూచన మేరకు వెళ్లిపోవాలి. లేదా పోలీసులకు సహకరించి వారి వాన్‌లు ఎక్కి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలి. అది ప్రజాస్వామ్య విధానం.

ఆ క్రమంలో కొందరు అతిగా ప్రవర్తించి మీడియా కళ్లలో పడాలని ప్రయత్నిస్తారు. అది తరచుగా జరుగుతూంటుంది. షర్మిలకు ఇప్పుడు ప్రత్యేకంగా అలాంటి ప్రచారం అవసరం లేదు. అయినా ఏదో ఘనకార్యం వెలగబెట్టినట్లు జనం అనుకోవాలన్నది ఆమె కోరిక కావచ్చు. దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఆమెకు రాదు. కాకపోతే ఆమెకు ఈ విషయం అర్దం అయ్యేసరికి ఆమె రాజకీయం ముగిసిపోయినా ఆశ్చర్యం లేదు. ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు చూద్ధాం. ఉపాధిలేక 21 వేల మంది మరణించారని ఆమె ఒక పిచ్చి ఆరోపణ చేశారు. ఇవన‍్నీ ప్రభుత్వ హత్యలేనని, ఉపాధిలేక వలస పోతున్నారని, త్వరలో యువత లేని రాష్ట్రంగా ఏపీ మారుతుందట. ఇది ఆమె తెలివి. షర్మిలతో ఎవరో అబద్దాలు ఆడిస్తున్నారు.

ఎందుకంటే కేంద్రం లెక్కల ప్రకారం ఏపీలో పేదరికం పన్నెండు శాతం నుంచి ఆరుశాతానికి తగ్గింది. చంద్రబాబు పాలన సమయంలో కేవలం 34వేల ఉద్యోగాలు ఇస్తే, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏకంగా రెండున్నర లక్షల ఉద్యోగాలను భర్తీ చేసింది. సచివాలయాలలో ఉద్యోగులంతా జగన్ సైన్యమని ఆమె అంటున్నారు. అంటే వారు ఏపీ యువత కాదని ఆమె చెబుతున్నారు. తనకు మల్లే తెలంగాణ నుంచి ఇక్కడకు వచ్చినవారని అనుకుంటున్నారా! వారంతా పరీక్షలలో ఉత్తీర్ణులై ఉద్యోగాలు పొందినవారే. టీచర్ పోస్టుల సంఖ్య పెంచాలని కోరితే కోరవచ్చు. కానీ ఆరువేల పోస్టులకు డీఎస్సీ వేస్తే అది మెగాడిఎస‍్సీ కాదని ఆమె అంటున్నారు. అవసరం ఉన్నా, లేకున్నా టీచర్లను నియమించడం వల్ల ఎవరికి ఉపయోగం అన్నదానితో నిమిత్తం లేకుండా రాజకీయ నేతలు విమర్శలు చేస్తుంటారు.

ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో 54 కార్పోరేషన‍్లను మూసివేసి వేలాది మంది ఉద్యోగులను స్వచ‍్ఛంద పదవీ విరమణ పథకం కింద ఇళ్లకు పంపించిన విషయం షర్మిలకు తెలియకపోవచ్చు. కానీ ఇప్పుడు చంద్రబాబు అండ్ కో ఏమి చెబితే, దానిని చిలకపలుకుల మాదిరి పలికి ప్రజలలో ఆమె పలచన అవుతున్నారు. జగనన్న ఐదేళ్లపాటు కుంభకర్ణుడిలా నిద్రపోయి, గుడ్డి గుర్రాలకు పళ్లు తోముతూ కూర్చున్నారని షర్మిల అంటున్నారంటే ఆమె పైత్యం ఎంతగా ప్రకోపించిందో అర‍్థం చేసుకోవచ్చు. తన అన్నను పట్టుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా తనను, తానే అవమానించుకుంటున్నారు. అందుకే ఏపీకి మరో పిచ్చి నేత, రాజకీయాలు, విధానాలు తెలియని మరో మూర్కపు వ్యక్తి వచ్చారని అనవలసి వస్తోంది. అచ్చం పవన్‌ కల్యాణ్‌ చేసే పిచ్చి వ్యాఖ్యల మాదిరే ఆమె కూడా మాట్లాడుతున్నారు.

పవన్ వలంటీర్లను ఒకసారి కిడ్నాపర్లుగా ఆరోపించి, ఆ తర్వాత తాను అలా అనలేదని నాలుక కరచుకున్నారు. 31 వేల మంది మహిళలు మిస్ అయ్యారంటూ ఆరోపించి ప్రజలలో నవ్వులపాలయ్యారు. చివరికీ వలంటీర్లతో కేసులు పెట్టించుకునే స్థాయికి పవన్‌ కల్యాణ్‌ దిగజారిపోయారు. సరిగ్గా షర్మిల కూడా అదే రీతిలో వ్యవహరిస్తూ లాఫింగ్ స్టాక్ అవుతున్నారు. తనను పోలీసులు తీసుకువెళుతున్నప్పుడు గాయం అయిందట. దానికి ఆమె తల్లి బాధపడి ఉంటారట. తండ్రి ఆత్మ క్షోభిస్తుందట. ఆమె ఈ వ్యాఖ్యలను ఎవరు ప్రముఖంగా ప్రచారం చేశారో తెలుసా! వైఎస్ బతికి ఉన్నంతకాలం ఆయనపై నిత్యం వ్యతిరేక ప్రచారం చేసి, దారుణమైన ఆరోపణలతో ఆయనను అవమానపరిచిన ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి తెలుగుదేశం మీడియా.

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణంపై కూడా అనుచిత వ్యాఖ్యలను ప్రచారం చేసిన ఈ మీడియా చేతిలో షర్మిల బందీ అవడం ఒక విషాదం. నిజంగానే షర్మిల తీరును చూసి, తనను దూషించిన టీడీపీ, ఆ పార్టీ మీడియా ట్రాప్‌లో పడడం చూసి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆత్మ క్షోభించి ఉంటుంది. షర్మిల  తెలంగాణలో రాజకీయం చేస్తానని చెప్పి, అక్కడ ఘోరంగా ఫెయిల్ అయినందుకు, వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు చెడగొట్టినందుకు ఆమె తల్లి విజయమ్మ బాధపడి ఉండాలి. అక్కడితో ఆగకుండా తగుదునమ్మా అంటూ ఏపీకి వెళ్లి తన అన్నపై పిచ్చిగా ప్రవర్తిస్తూ వైఎస్ కుటుంబ పరువును షర్మిల గంగలో కలుపుతున్నదని విజయమ్మ విచారపడుతుండవచ్చు. ఇంత పిచ్చిగా చేస్తున్న షర్మిలకు ఏపీలో రాజకీయ భవిష్యత్తు ఉందా అంటే ఏమీ లేదు. ఎందుకంటే అసలు కాంగ్రెస్‌కే లేని భవిష్యత్తు షర్మిలకు ఎక్కడి నుంచి వస్తుంది!


– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

whatsapp channel

మరిన్ని వార్తలు