పేరు, హోదా.. అమ్మ పెట్టిన భిక్షే

15 Oct, 2020 10:14 IST|Sakshi

కూచిపూడి నృత్య ప్రపంచంలో నేటితరం మహారాణి ఆమె.. సృజనాత్మక ప్రక్రియల్లో ఆరితేరిన కళాకారిణి. ఆమె నాట్యం ఓ అద్భుతం.. నర్తించే సమయంలో ఆమె పలికించే హావభావాలు అత్యద్భుతం. ఏ పాత్రలోనైనా ఒదిగి ఆ పాత్రకు వన్నె తెచ్చిన శాస్త్రీయ సంప్రదాయ నర్తకీమణి శోభానాయుడు ఇకలేరు అనగానే నృత్యం కళావిహీనమైంది. ఆ పాదాల గజ్జెలు మౌనం దాల్చాయి. నృత్య ప్రపంచం కన్నీరుమున్నీరై విలపించింది.

సాక్షి, మద్దిలపాలెం/అనకాపల్లి: ప్రముఖ కూచిపూడి నాట్యకళాకారిణి, పద్మశ్రీ అవార్డు గ్రహీత డా.శోభానాయుడు అనారోగ్యంతో మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు. విశ్వవ్యాప్తంగా తన నాట్యంతో అభిమానులను సంపాదించుకున్న ఆమె అనకాపల్లిలోనే పుట్టారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలైన ఆమె తల్లి సరోజనిదేవి, వెంకటనాయుడులకు 1956లో జన్మించారు. శోభానాయుడు కూచిపూడి నృత్యంలో ఎదుగుతారని తల్లి చిన్నప్పుడే గుర్తించారు. ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊపుతున్నప్పుడు.. శోభానాయుడు కాళ్లు, చేతుల కదలికలను సరోజనిదేవి గమనించారు. అప్పుడే శోభానాయుడికి నృత్యం నేర్పించాలని భావించారు. ఇందుకోసం ఆమె కుటుంబంతో పెద్ద యుద్ధమే చేశారంట. ఇదే విషయాన్ని శోభానాయుడు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ పేరు హోదా అమ్మ పెట్టిన భిక్షే అంటూ వెల్లడించారు. ఆమె మూడో ఏటన  ఆ కుటుంబం రాజమండ్రికి వెళ్లిపోయింది. అక్కడ నాల్గో ఏట నుంచే శోభానాయుడికి కూచిపూడిలో శిక్షణ ఇప్పించేందుకు తల్లి దృష్టి సారించారు.

నృత్యంలో ఆమె ఇచ్చిన హావభావాలు, అభినయం చూసి తల్లి.. మరింత బాగా తీర్చిదిద్దాలని చెన్నైలోని చిన వెంపటి సత్యం వద్ద శిక్షణకు పంపించారు. ఆడపిల్లను అంత దూరం పంపించే విషయంలో కుటుంబ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. సరోజనిదేవి ఏమాత్రం వెనుకంజ వేయలేదు. తన కుమార్తెలోని ప్రతిభ గుర్తించి ప్రోత్సహించారు. తల్లి ఇచ్చిన ప్రేరణే శోభానాయుడిని ఈ స్థాయికి తీసుకెళ్లిందనడంలో ఎటువంటి సందేహం లేదు. అలా 12 ఏళ్లకే ప్రదర్శనివ్వడం ప్రారంభించిన శోభానాయుడు సత్యభామ, పద్మావతి, చండాలిక పాత్రల్లో తనదైన అభినయంతో ప్రేక్షకులను మెప్పించారు. ఆమె బహుముఖ ప్రతిభకు అందరూ మంత్రముగ్ధులయ్యారు. ఎన్నో పురస్కారాలు, వివిధ దేశాల్లో నృత్య ప్రదర్శనల అవకాశాలు దక్కించుకున్న శోభానాయుడు కూచిపూడి కళాప్రియుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు.

విశాఖతో అనుబంధం 
కళల ఖిల్లాగా భాసిల్లుతున్న విశాఖ నగరంలో ఏ కళా, సాంస్కృతిక ఉత్సవాలు జరిగినా.. ఆమె ప్రధాన ఆకర్షణగా నిలిచేవారు. అగ్రస్థానం ఆమెకే ఇచ్చేవారు. కళాభారతి ఆడిటోరియంలో నగరానికి చెందిన పలు నృత్య కళా అకాడమీలు నిర్వహించే సాంస్కృతిక వేడుకలకు ఆమె హాజరయ్యేవారు. నటరాజ్‌ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ అకాడమీ వేడుకల్లో భాగంగా శోభానాయుడిని పల్లకీలో తోడ్కొని వచ్చి అపూర్వ స్వాగతం పలికారు. ఆమె అనుభవాన్ని రంగరించి ఇదే వేదికపైన నాట్య ప్రదర్శనలు ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సాయినాథ్‌ నృత్య కళా నిలయం, నటరాజ్‌ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్న వర్ధమాన నృత్య కళాకారులకు ఆమె స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఆమె అభినయాన్ని, అనుభవాలను ఎప్పటికప్పుడు నృత్యకళాకారులకు వినిపించేందుకు ఆయా సంస్థలు చేసిన కృషికి శోభానాయుడు ఎంతో సంబరపడేవారు. కళాభారతి వేదికగా శోభానాయుడు ప్రదర్శించిన ‘సత్యభామా కలాపం’ నృత్యరూపకం అద్వితీయంగా సాగింది.

సత్యభామగా శోభానాయుడు ఒదిగిన తీరు.. పలికించిన హావభావాలు, అలకలతో సాగిన ప్రదర్శనతో విశాఖ కళాప్రియుల హృదయాల్లో ఆమె సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. మరోసారి శోభానాయుడు స్వీయ నృత్య రూపకం ‘నవరస నట భామిని’ ప్రదర్శనలో ఆమె పలికించిన నవరసాలతో.. కళాప్రియులు పులకించిపోయారు. నవరసాల్లో పాత్రలను అవలీలగా ఆమె ఆవిష్కరించిన తీరు ఆహూతులను అబ్బురపరిచింది. మరో ప్రదర్శనలో శివుని భార్య సతీదేవిగా అగ్నికి ఆహుతి అయ్యే సన్నివేశంలో శోభానాయుడు నటన నభూతో న భవిష్యత్‌గా నిలిచిపోయింది. ఆ సన్నివేశంలో సతీదేవి పాత్రలో లీనమై.. చక్కని ప్రదర్శనిచ్చిన ఆమెకు ప్రేక్షకులు నిలబడి కరతాళధ్వనులతో నీరాజనం పలికారు. టి.సుబ్బరామిరెడ్డి కళాపీఠం ఆధ్వర్యంలో 2018లో ఆర్కేబీచ్‌లో ఏర్పాటు చేసిన శివరాత్రి వేడుకల్లో శోభానాయుడు హాజరయ్యారు. ఆ వేడుకల్లో ఆమె తన నృత్యంతో భక్తులను మంత్రముగ్ధులను చేశారు. వేడుకల్లో భాగంగా ఆమెను కేంద్ర మాజీ మంత్రి సుబ్బరామిరెడ్డి ఘనంగా సన్మానించారు.  

మంత్రి ముత్తంశెట్టి సంతాపం 
మహారాణిపేట(విశాఖ దక్షిణ): పద్మశ్రీ అవార్డు గ్రహీత శోభానాయుడు మృతి పట్ల రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనారోగ్యంతో ఆమె మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. శోభానాయుడు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

కళామతల్లి ముద్దు బిడ్డ శోభానాయుడు 
కళామతల్లి ముద్దు బిడ్డ, కూచిపూడి నృత్యకారిణి శోభానాయుడు మాకు ఎంతో స్ఫూర్తిదాయకం. ఆమె ఇక లేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ఎప్పుడు.. ఏ కార్యక్రమానికి ఆహ్వానించినా హాజరయ్యేవారు. కళాసమితి చిన్నారులకు ఆమె అమూల్యమైన సందేశం ఇచ్చి స్ఫూర్తి రగిలించేవారు. అంతరించిపోతున్న కళా నృత్యాలను జీవం పోయడానికి ఆమె పడిన కష్టం, చేసిన కృషి మరువలేనివి. 
– డాక్టర్‌ అరుణ్‌ సాయికుమార్, సాయినాథ్‌ కళా సమితి వ్యవస్థాపకుడు  

నాట్యరంగానికి తీరని లోటు  
అనకాపల్లిలో పుట్టిన శోభానాయుడు మృతి కూచిపూడి నృత్యానికి తీరని లోటు. చినవెంపటి సత్యం వద్ద శిక్షణ తీసుకున్న శోభానాయుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు. కూచిపూడి ఆర్ట్స్‌ స్కూల్‌ పేరుతో శోభానాయుడు హైదరాబాద్‌లో సంస్థను ప్రారంభించి ఎంతోమందికి శిక్షణ అందించారు.  
–ఇంద్రగంటి లక్ష్మీశ్రీనివాస్‌. కల్యాణి నృత్య సంగీత అకాడమీ, అనకాపల్లి

మరిన్ని వార్తలు