కుప్పం దూకుడు!

7 Aug, 2020 09:52 IST|Sakshi
పట్టణ ప్రజలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్న అధికారులు 

మున్సిపాలిటీగా అభివృద్ధి వైపు పయనం 

వేగవంతమవుతున్న పనులు 

అర్ధంతరంగా ఆగిన పనులకు పునరుజ్జీవం 

కుప్పం తలరాత మారుతోంది. అభివృద్ధి వైపు వేగంగా దూసుకుపోతోంది. ఆగిపోయిన అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. జిల్లాలో మున్సిపాలిటీ గ్రేడింగ్‌ సంపాదించుకున్న ఏకైక పంచాయతీ కుప్పం కావడం గమనార్హం. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే కుప్పంను మున్సిపాలిటీగా చేసి.. నిధులు సమకూర్చి.. అభివృద్ధిని పరుగులు పెట్టించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.  

కుప్పం: కుప్పం నియోజకవర్గం ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుకు కంచుకోట. ఇక్కడ ఆయన 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 1996 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ తన నియోజకవర్గాన్ని కనీసం మున్సిపాలిటీగా కూడా మార్పు చేయలేకపోయాడు. నూతనంగా అధికారం చేపట్టిన వైఎస్సార్‌ సీపీ రాష్ట్రంలో 52 నగర పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్‌ చేసింది. అందులో కుప్పం ఒకటి. మున్సిపాలిటీగా మారడంతో అభివృద్ధిలో వేగం పుంజుకుంది. 

రూరల్‌ అర్బన్‌ మిషన్‌కు మోక్షం 
గత ప్రభుత్వ హయాంలో విడుదలైన రూ.30 కోట్ల రూరల్‌ అర్బన్‌ మిషన్‌ నిధులు వృథా అయ్యాయి. ఇప్పటికీ రూ.18 కోట్లు బ్యాంకుల్లో మూలుగుతున్నాయి. దీనిపై అధికార పార్టీ నేతలు, స్థానిక అధికారులు స్పందించి ఆ నిధులతో పట్టణంలో డ్రైనేజీలు, సిమెంట్‌ రోడ్ల నిర్మాణాలకు చర్యలు చేపట్టారు. నాలుగు ప్రాంతాల్లో రూరల్‌ అర్బన్‌ మిషన్‌ కింద పనులు జరుగుతున్నాయి. గత ప్రభుత్వం ఈ నిధులను రెండేళ్లు బ్యాంకు ఖాతాల్లోనే ఉంచింది. 

మౌలిక వసతులు మెరుగు 
మున్సిపాలిటీ పరిధిలోని 8 పంచాయతీలతో పాటు పట్టణంలో పారిశుధ్య పనులు పుంజుకున్నాయి. 25 వార్డులకు గాను 10 వార్డుల్లో ఇంటింటికీ చెత్త సేకరణ కార్యక్రమం చేపడుతున్నారు. 8 పంచాయతీల్లో ప్రత్యేకంగా పది మంది పారిశుధ్య కార్మికులతో టీమ్‌గా ఏర్పాటు చేసి, రోజు మార్చి రోజు పనులు చేపడుతున్నారు. డ్రైనేజీల శుభ్రతతో పాటు రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చిమొక్కలను తొలగిస్తున్నారు. ప్రస్తుతం కోవిడ్‌ కారణంగా ప్రతి వీధిలోనూ బ్లీచింగ్, సోడియం హైడ్రోక్లోరైడ్‌ పిచికారీ చేస్తున్నారు. 15 కంటైన్మెంట్‌ జోన్లలో పూర్తిస్థాయి శానిటేషన్‌ జరుగుతోంది. మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సమస్య పరిష్కారానికి పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు. ప్రతిరోజూ 130 నుంచి 140 వాటర్‌ ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేపడుతున్నారు. ఆరు నూతన బోర్లు వేశారు. వాటర్‌ సమస్య పరిష్కారం కోసం ప్రతినెలా రూ.10 నుంచి 15 లక్షలు వెచ్చిస్తున్నారు. సోషియల్‌ మీడియా ద్వారా సమస్య తెలిపిన వెంటనే సిబ్బంది స్పందించి తాగునీటి సమస్య పరిష్కరిస్తున్నారు. 

భవన నిర్మాణ అనుతులకు ఆన్‌లైన్‌ విధానం 
గతంలో పంచాయతీ పరిధిలో భవన నిర్మాణాలకు కార్యాలయం చుట్టూ తిరిగే పరిస్థితి. ప్రస్తుతం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. వ్యాపారులకు దుకాణ నిర్వహణ అనుమతులు, వాటర్‌ కనెక్షన్‌ కోసం బైలాన్‌ సిద్ధం చేశారు. విద్యుత్‌ స్తంభాల నిర్వహణకు ప్రత్యేక బైలాన్‌ ద్వారా మున్సిపాలిటీ నిబంధనలు పాటిస్తున్నారు. ప్రతి ఇంటికీ డోర్‌ నంబర్లు ఇచ్చి జనాభా లెక్కలు తీసేందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. 

వర్కర్లకు చేయూత 
మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు ఆక్యూపేషన్‌ హెల్త్‌ అలవెన్స్‌ ద్వారా శానిటేషన్‌ వర్కర్లు 70 మందికి ప్రతినెలా ఆరు వేల రూపాయల జీతంలో పాటు అదనంగా వచ్చే విధంగా చేపట్టారు. గతంలో ఈ స్కీమ్‌ ఉన్నా వర్కర్లకు అందేది కాదు. ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న వర్కర్లకు అందిస్తున్నారు. 

మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి 
నూతనంగా ఏర్పడిన కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అన్ని విధాలా కృషి చేస్తున్నాం. ఇప్పటికే శాఖల వారీగా విభజించి పనులు వేగవంతం చేశారు. ప్రధానంగా తాగునీటి సమస్యపై వాట్సప్‌ గ్రూపులో సమాచారం అందించినా వెంటనే స్పందించి పరిష్కరిస్తున్నాం. ప్రతి ఒక్కరూ నీటి పన్ను, ఇంటి పన్నులు చెల్లించి సహకరించాలి. – చిట్టిబాబు, కమిషనర్‌ కుప్పం మున్సిపాలిటీ 

మరిన్ని వార్తలు