‘మనకు ఇదేం ఖర్మరా బాబూ’.. కుప్పం హడల్‌

4 Jan, 2023 08:35 IST|Sakshi

టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కుప్పం నియోజకవర్గ ప్రజలు హడలిపోతున్నారు. ఆయన పాదం పెట్టిన చోటల్లా అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతుండడంతో భయాందోళనకు గురవుతున్నారు. మొన్న నెల్లూరు జిల్లా కందుకూరులో ఎనిమిది మంది, నిన్న గుంటూరు ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంపై మదనపడుతున్నారు. ఇప్పుడు కుప్పం వస్తే ఎలాంటి అనర్థాలు జరుగుతాయోనని చర్చించుకుంటున్నారు. స్థానికులనే కాకుండా..టీడీపీ నేతలు సైతం ఎప్పుడు.. ఎలాంటి ఘటనలు ఎదురవుతాయోనని ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయంపై టీడీపీ ముఖ్యనేతలు వరుసగా రెండు రోజులు సమావేశాలు నిర్వహించి..'మనకు ఇదేం ఖర్మరా బాబూ' అంటూ విస్మయం చెందినట్లు సమాచారం.

సాక్షి ప్రతినిధి, తిరుపతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారైంది. బుధ, గురు, శుక్రవారాల్లో ఆయన కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. బాబు పర్యటన షెడ్యూల్‌ ఇప్పటికే పలుమార్లు ఖరారైనా స్థానిక నేతలు సుముఖంగా లేకపోవడం.. జన సమీకరణకు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో వాయిదాలు పడుతూ వచ్చింది. జన సమీకరణ, పర్యటన ఖర్చులు పార్టీ శ్రేణులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేయడంతో తప్పని పరిస్థితుల్లో ఒప్పుకున్నట్లు టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.  

వస్తే.. గమ్మనుండడుగా? 
గతంలో చంద్రబాబునాయుడు తన నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించిన సమయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి అలజడి సృష్టించారు. ప్రశాంతంగా ఉన్న కుప్పంలో చిచ్చుపెట్టి కేసులు పెట్టే స్థాయికి తెచ్చారు. అనుచిత వ్యాఖ్యలతో జనాన్ని ఉసిగొలిపి కొట్లాటలకు కారణమయ్యారు. పచ్చని పల్లెల్లో వర్గవైషమ్యాలు సృష్టించి వేడుక చూసి వెళ్లిపోయారు. ఇప్పుడు మళ్లీ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో.. ఎవరెవరిని ఉసిగొల్పుతారో.. ఈ పర్యటన ఎక్కడికి దారితీస్తుందోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఏదో ఒకచోట తాను చెప్పాల్సింది చెప్పి వెళ్లితే బాగుంటుందని హితవు పలుకుతున్నారు. 

చంద్రబాబు ప్రచార ఆర్భాటానికి జనాన్ని బలిపశువులు చేస్తున్నారని జనం గట్టిగా నమ్ముతున్నారు. గోదావరి పుష్కరాల్లో ఫొటో షూట్‌ కోసం 28 మంది.. ఇటీవల నెల్లూరు జిల్లా కందుకూరులో ఎనిమిది మందిని పొట్టనబెట్టుకోవడం చూస్తే ఆయన పాదం మామూలుది కాదని స్థానికులు చెప్పుకుంటున్నారు. అలాగే గుంటూరులో కానుకలను ఎరవేసి ముగ్గురి ప్రాణాలను హరించేశాడని గుర్తుచేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో కుప్పం పర్యటన ఖరారు కావడంతో స్థానికులు ‘ఐరన్‌ లెగ్‌’ వ్యాఖ్యలపై చర్చించుకుంటున్నారు. పబ్లిసిటీ కోసం బలవంతంగా జనాన్ని తరలించి చంపేస్తారేమోనని భయపడుతున్నారు. పర్యటనను వాయిదా వేసుకోమని టీడీపీ శ్రేణులు బ్రతిమలాడినట్లు విశ్వసనీయ సమాచారం. అందుకు చంద్రబాబు ససేమిరా అనడంతో చేసేదిలేక  సభలకు ఓకే అన్నట్టు సమాచారం.  

(చదవండి: రామోజీ.. తప్పుడు రాతలు కట్టిపెట్టు)

మరిన్ని వార్తలు