రైతు పక్షపాతి సీఎం జగన్‌

8 Jul, 2021 03:46 IST|Sakshi

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

రాయదుర్గం: ఉచిత విద్యుత్‌తో పాటు జలయజ్ఞం ద్వారా దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి రైతు బాంధవుడిగా ఖ్యాతి గడించారని, తండ్రి బాటలోనే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నడుస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఆయన బుధవారం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి, ఏపీ విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ సీఈవో ఆలూరి సాంబశివారెడ్డి, ఎమ్మెల్యేలు అనంతవెంకటరామిరెడ్డి, ఉషశ్రీ చరణ్‌ , వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్యతో కలిసి అనంతపురం జిల్లా రాయదుర్గంలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వ్యవసాయం వల్ల ఉపయోగం లేదని, ఉచిత విద్యుత్‌ అంటే తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారన్నారు. కానీ వైఎస్సార్‌ అధికారం చేపట్టిన వెంటనే  రైతులను బతికించుకోవడం కోసం ఉచిత విద్యుత్‌తో పాటు ఎన్నో ప్రాజెక్టులను నిర్మించారని గుర్తు చేశారు.

అన్నదాతల పాలిట ఆపద్బాంధవుడిగా నిలిచిన వైఎస్సార్‌ జయంతి (జూలై 8)ని రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తండ్రి ఒక అడుగు ముందుకేస్తే , తనయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రైతుల సంక్షేమం కోసం వంద అడుగులు ముందుకేస్తున్నారని కొనియాడారు. కరోనా వచ్చినా , కష్టం వచ్చినా రైతు సంక్షేమ పథకాలు  ఆపలేదని,  రైతు సంక్షేమ ప్రభుత్వం అనడానికి ఇదే నిదర్శనమని అన్నారు.  రైతుల అభివృద్ధికి పాటుపడుతున్న  తమ ప్రభుత్వం  రాయదుర్గంలో నేడు రైతు దినోత్సవాన్ని పండుగలా నిర్వహిస్తోందన్నారు. ఈ వేడుకకు  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై.. దాదాపు రూ.1,500 కోట్లతో నిర్మిస్తున్న గోడౌన్లు, రైతు భరోసా కేంద్రాలు, కోల్డ్‌ స్టోరేజీలు, రైతు బజార్లు తదితర వ్యవసాయ సంబంధిత అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారని తెలిపారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ మాట్లాడారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు