రూ.10,300 కోట్లతో వ్యవసాయ రంగంలో మౌలిక వసతులు

3 Jan, 2021 05:38 IST|Sakshi

మలికిపురం: వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పనకు రూ.10,300 కోట్లతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధానంగా ఆహార పంటల సాగులో పురుగు మందుల వినియోగం తగ్గించడమే లక్ష్యంగా ప్రతి గ్రామంలోనూ మూడేసి బయో ఫెర్టిలైజర్‌ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు సీఎం ఆదేశించారని తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణకు ఇది చాలా ముఖ్యమని ఆయన భావిస్తున్నారన్నారు.

ప్రతి నియోజకవర్గంలోనూ ఇంటిగ్రేటెడ్‌ ల్యాబొరేటరీలు ఏర్పాటు చేస్తారని చెప్పారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి డివిజన్‌కు ఒకటి చొప్పున వెటర్నరీ ల్యా»ొరేటరీలు ఏర్పాటు చేయనున్నారన్నారు. బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారన్నారు. ప్రతి వ్యవసాయ మార్కెట్‌ యార్డును, రైతు భరోసా కేంద్రాలను బలోపేతం చేస్తామన్నారు. అంతర పంటల సాగుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, ఇందులో ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు మేలు కలిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. 

మరిన్ని వార్తలు