ఆర్థిక అవకతవకలకు ఆస్కారమివ్వొద్దు 

6 Aug, 2021 04:56 IST|Sakshi

ప్రతి రూపాయి రైతుల కష్టార్జితం.. వారికి మేలు చేయండి

ఆప్కాబ్‌ వ్యవస్థాపక దినోత్సవంలో మంత్రి కన్నబాబు

సహకార వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తున్నట్లు వెల్లడి  

సాక్షి, అమరావతి/గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): సహకార వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు నాబార్డు కన్సల్టెన్సీ సర్వీసెస్‌(నాబ్కాన్స్‌) కమిటీ సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. డీసీసీబీలు, సహకార సంఘాల్లో పనిచేస్తున్న వారందరికీ ఒకే రీతిలో జీతభత్యాలు ఉండాలన్న ఆలోచనతో హెచ్‌ఆర్‌ పాలసీని తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఆర్థిక అవకతవకలకు ఆస్కారమివ్వొద్దని ఆప్కాబ్, డీసీసీబీ, పీఏసీఎస్‌లకు సూచించారు. ఏపీ స్టేట్‌ కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌(ఆప్కాబ్‌) 59వ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం విజయవాడలోని ఓ హోటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆప్కాబ్, డీసీసీబీ, పీఏసీఎస్‌ పర్సన్‌ ఇన్‌చార్జ్‌ కమిటీలు పారదర్శకంగా పని చేయాలని సూచించారు.

ప్రతి రూపాయి రైతుల కష్టార్జితమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మొహమాటానికో, తెలిసిన వారి కోసమో నిబంధనలను అతిక్రమించవద్దని చైర్మన్లకు హితవు పలికారు. నిబంధనలు పాటిస్తూ రైతులను ఆదుకునేందుకు ఉదారంగా రుణాలివ్వాలని ఆదేశించారు. బ్యాంకింగ్‌తో పాటు ఇతర సేవలందించడంపైనా ఆలోచన చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. రూ.7,500 కోట్లతో మొదలైన ఆప్కాబ్‌ గతేడాదిలో రూ.21 వేల కోట్ల టర్నోవర్‌తో దేశంలోనే నంబర్‌ 1 సహకార బ్యాంక్‌గా నిలిచిందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.30 వేల కోట్ల లక్ష్యంతో ముందుకు వెళ్తోందన్నారు.

ఆప్కాబ్‌ పర్సన్‌ ఇన్‌చార్జ్‌ కమిటీ చైర్‌పర్సన్‌ మల్లెల ఝాన్సీ మాట్లాడుతూ.. రైతులకు మరింత చేరువగా ఆప్కాబ్‌ను నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన కృష్ణాజిల్లా కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌తో పాటు రీజనల్‌ స్థాయిలో ప్రతిభ చూపిన విజయనగరం, గుంటూరు, కర్నూలు డీసీసీబీలకు అవార్డులను ప్రదానం చేశారు. శ్రీ రామలింగేశ్వర (తూర్పు గోదావరి), నందమూరి(కృష్ణా), కరవాడి (ప్రకాశం) పీఏసీఎస్‌లకు అవార్డులిచ్చారు. విధి నిర్వహణలో ప్రతిభ కనపర్చిన ఆప్కాబ్‌ ఉద్యోగులకు కూడా అవార్డులను బహూకరించారు. కార్యక్రమంలో సహకార మార్కెటింగ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వై.మధుసూదనరెడ్డి, సహకార శాఖ కమిషనర్‌ బాబు.ఎ, నాబార్డు సీజీఎం సుధీర్‌ కుమార్, ఆప్కాబ్‌ ఎండీ ఆర్‌ఎస్‌ రెడ్డి, సీజీఎం రాజయ్య తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు