రైతులకు రెట్టింపు ఆదాయం

2 Jul, 2021 04:43 IST|Sakshi
సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి కన్నబాబు

త్వరలో సేంద్రియ వ్యవసాయ పాలసీ

ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ కమిటీ భేటీలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు  

సాక్షి, అమరావతి: వ్యవసాయంలో రసాయనాల వినియోగాన్ని తగ్గించి, సేంద్రియ పద్ధతులపై అవగాహన పెంచాలని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అధికారులకు సూచించారు. రైతులకు రెట్టింపు ఆదాయం, నాణ్యమైన ఉత్పత్తులు, భూసారాభివృద్ధి, మెరుగైన, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం లక్ష్యాలుగా త్వరలో సేంద్రియ వ్యవసాయ పాలసీ తీసుకొస్తున్నామని వెల్లడించారు. ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన కమిటీతో మంత్రి  గురువారం సుదీర్ఘం గా చర్చించారు. కొత్త పంటల సాగు ప్రారంభం నుంచే  రైతులను సేంద్రియ వ్యవసాయ విధానంపై ప్రోత్సహించాలని కమిటీ సభ్యులు సూచిం చారు. సంబంధిత శాఖల సూచనలు, అభిప్రాయాలను సేకరించి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో చర్చించి ఆర్గానిక్‌ పాలసీని తెస్తామని మంత్రి చెప్పారు.సమీక్షలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, రైతు సాధికార సంస్థ ముఖ్య అధికారి టి.విజయ్‌కుమార్, మార్కెటింగ్‌ ప్రత్యేక కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, ప్రిన్సి పల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ చిరంజీవి చౌదరి, వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్‌ శాఖల కమిషనర్లు,  ఇతర అధికారులు పాల్గొన్నారు. 

’పట్టు’ ధరలు తగ్గకుండా చర్యలు
2021–22 సంవత్సరంలో కనీసం కొత్తగా పది వేల ఎకరాలలో మల్బరీ సాగు జరిగే దిశగా రైతులను ప్రోత్సహించాలని మంత్రి కన్నబాబు అధికారులను ఆదేశించారు. పట్టు పరిశ్రమ (సెరికల్చర్‌) శాఖ ఉన్నతాధికారులతో మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. రైతు ఆర్థిక ప్రయోజనాలకు సీఎం జగన్‌ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. గ్రామ సచివాలయాల్లో పని చేస్తున్న వ్యవసాయ, ఉద్యాన, పట్టు సహాయకులను పట్టు పరిశ్రమ విస్తరణలో వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వం నియమించిన 400 మంది విలేజ్‌ సెరికల్చర్‌ అసిస్టెంట్లకు పూర్తి స్థాయిలో సాంకేతిక శిక్షణ ఇవ్వాలని సూచించారు. ‘డాక్టర్‌ వైఎస్సార్‌ పట్టు బడి’ కార్యక్రమం ద్వారా రైతులకు క్రమం తప్పకుండా శిక్షణ అందించాలన్నారు. పట్టు ధరలు తగ్గకుండా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం పట్టు కొనుగోలు చేసే వారిని ప్రోత్సహించాలని  మంత్రి చెప్పారు.  

మరిన్ని వార్తలు