కొత్త జిల్లాలతో రైతులకు మరింత మెరుగైన సేవలు

7 Apr, 2022 04:26 IST|Sakshi
కోర్సు కరదీపికను ఆవిష్కరిస్తున్న మంత్రి కన్నబాబు, పూనం మాల కొండయ్య తదితరులు

ఇతర రాష్ట్రాలు కూడా ఏపీ సంస్కరణలపై ఆసక్తి చూపిస్తున్నాయి

మంత్రి కన్నబాబు  

సాక్షి, అమరావతి/తాడేపల్లిగూడెం: కొత్త జిల్లాలతో రైతులకు మరింత వేగంగా మెరుగైన సేవలందే అవకాశం ఏర్పడిందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ, ఇతర అనుబంధ రంగాలకు సంబంధించి సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకువచ్చిన సంస్కరణలకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు వచ్చిందని చెప్పారు. ఇతర రాష్ట్రాలు సైతం ఏపీలో అమలు చేస్తున్న సంస్కరణలు, విధానాలను అందిపుచ్చుకునేందుకు ఆసక్తిని కనబరుస్తున్నాయని తెలిపారు. జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ నేపథ్యంలో అన్ని జిల్లాల అధికారులతో బుధవారం మంత్రి కన్నబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మరింత వేగంగా నాణ్యమైన సేవలందించేందుకు వీలుగా ప్రభుత్వం జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చేసిందని చెప్పారు. దీనికి తగినట్లుగా రైతులకు సేవలందించేందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలని సూచించారు.

వ్యవసాయ రంగంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని వివరించారు. రైతుల ప్రతి అవసరాన్ని.. వారి వద్దకే వచ్చి తీర్చేందుకు ప్రభుత్వం ఆర్బీకేలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఆర్బీకే వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిన విషయం అందరికే తెలిసిందేనన్నారు. పెట్టుబడి సాయం, ఇన్‌పుట్‌ సబ్సిడీ తదితరాల రూపంలో ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో రైతులు అధిక దిగుబడులు, మంచి ధరలు పొందుతున్నారని పేర్కొన్నారు. గత మూడేళ్లలో రాష్ట్ర రైతులకు 1.10 లక్షల కోట్ల లబ్ధిని చేకూర్చామని వివరించారు. సమీక్షలో స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య,  డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ జానకిరామ్‌ పాల్గొన్నారు. 

సేంద్రియ వ్యవసాయంపై సర్టిఫికెట్‌ కోర్సు 
డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది నుంచి ‘ఉద్యాన పంటల్లో సేంద్రియ వ్యవసాయం’పై సర్టిఫికెట్‌ కోర్సును ప్రారంభించారు.  కోర్సు కరదీపికను విజయవాడలోని తన క్యాంప్‌ కార్యాలయంలో  మంత్రి  కన్నబాబు  తదితరులు ఆవిష్కరించారు. 

మరిన్ని వార్తలు