‘పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది’

28 Sep, 2021 16:05 IST|Sakshi

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

సాక్షి, తాడేపల్లి: పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర, కృష్ణా, గోదావరి జిల్లాల్లో పంటనష్టం జరిగిందని, పంట నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులను నియమించామని తెలిపారు. ఇరిగేషన్‌ కాలువలను చక్కదిద్దేందుకు చర్యటు చేపట్టామని పేర్కొన్నారు. ప్రభుత్వంపై తప్పుడు విమర్శలకే టీడీపీ పరిమితమైందని మండిపడ్డారు.

చదవండి: బద్వేలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా దాసరి సుధ: సజ్జల

డైవర్షన్‌ పాలిటిక్స్‌లో చంద్రబాబును మించినవాళ్లు లేరని ఎద్దేవా చేశారు. దుర్భిక్ష పరిస్థితుల నుంచి అనంత జిల్లా బయటపడుతోందని తెలిపారు. వాస్తవాలను పక్కదారి పట్టించేలా టీడీపీ నేతల వ్యాఖ్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు.  విత్తనాల కోసం గతంలో రోజుల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి ఉండేదని అన్నారు. ప్రస్తుతం ఇంటికే విత్తనాలను అందిస్తున్నామని తెలిపారు. విత్తనాల నుంచి విక్రయం వరకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు.

పవన్‌ కల్యాణ్‌ ఫ్రస్ట్రేషన్‌ పీక్స్‌కు వెళ్లింది
పవన్‌ కల్యాణ్‌ ఫ్రస్ట్రేషన్‌ పీక్స్‌కు వెళ్లిందని మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. రెండు చోట్లా ఓడిపోయాననే అవమానభారం తట్టుకోలేకపోతున్నాడని మండిపడ్డారు. సినిమా ఫంక్షన్‌కు వెళ్లి రాజకీయం మాట్లాడటం ఎంటీ? అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎనాడైనా చంద్రబాబును ప్రశ్చించారా? అని నిలదీశారు. 

మరిన్ని వార్తలు