త్వరలో మిల్లెట్‌ మిషన్‌ పాలసీ 

25 Mar, 2022 04:01 IST|Sakshi

దీంతో చిరుధాన్యాల సాగుకు మరింత ఊతం 

ఎమ్మెల్సీలూ.. రైతుభరోసా కేంద్రాలను సందర్శించండి 

వచ్చే సీజన్‌ నుంచి బీమా రశీదులు 

వ్యవసాయ మంత్రి కన్నబాబు   

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో త్వరలోనే ‘మిల్లెట్‌ మిషన్‌ పాలసీ’ని తీసుకొస్తామని, దీనిద్వారా చిరుధాన్యాల సాగుకు మరింత ఊతమిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కె. కన్నబాబు వెల్లడించారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించిన రైతుభరోసా కేంద్రం (ఆర్బీకే) వ్యవస్థ ఒక విప్లవమని, దీని ద్వారా ప్రతి గ్రామంలోను రైతుకు సొంత కార్యాలయం ఉందనే ధీమా కలిగిందన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలపై శాసన మండలిలో గురువారం జరిగిన స్వల్పకాలిక చర్చలో పలువురు సభ్యులు అడిగిన వివిధ ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. రైతులకు కావాల్సిన ప్రతి సేవా ఆర్బీకేల్లో అందుతోందన్నారు.

ఎమ్మెల్సీలు సైతం తమతమ గ్రామాల్లో వీటిని సందర్శించాలని కన్నబాబు విజ్ఞప్తిచేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రేటింగ్‌లో వ్యవసాయ రంగంలో ఏపీ దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిచిందని.. స్కోచ్‌ తదితర అవార్డులు మన వ్యవసాయ రంగానికి దక్కాయని కన్నబాబు తెలిపారు. ఇక.. రాష్ట్రంలో ప్రతి పంటకూ ఈ–క్రాప్‌ బుకింగ్‌ సిస్టమ్‌ ద్వారా బీమాను వర్తింపజేస్తున్నామని, వచ్చే సీజన్‌ నుంచి బీమా నమోదుకు సంబంధించి రశీదులిచ్చే విధానాన్ని అమలుచేస్తామని కూడా ఆయన వెల్లడించారు. భూ యజమాని అనుమతితో సంబంధంలేకుండానే ఈ–క్రాప్‌లో కౌలురైతులనూ నమోదు చేసి వారికి మేలు చేస్తున్నామని.. పెట్టుబడి సాయం అందించేలాకూడా వారికి సీసీఆర్‌సీ కార్డులను జారీచేస్తున్నామన్నారు.  

ఆర్బీకేల ద్వారా సుబాబుల్, సరుగుడు కొనుగోలు     
సుబాబుల్, యూకలిప్టస్, సరుగుడు పంటనూ ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కన్నబాబు చెప్పారు. పేపర్‌ పరిశ్రమకు ముడిసరుకుగా ఉపయోగపడే సుబాబుల్, యూకలిప్టస్, సరుగుడుకు ప్రస్తుత పరిస్థితుల్లో సరైన ధర దక్కడంలేదన్న ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. ఇప్పటికే వాటి కటింగ్‌ ఆర్డర్‌ కోసం ఆర్బీకేల ద్వారా నమోదు చేసే పద్ధతిని చేపట్టామన్నారు.  క్షేత్రస్థాయిలో కొత్తగా ఉద్యోగ నియామకాలు అయ్యే వరకు ఎంపీఈఓలను కొనసాగిస్తామన్నారు.  ఇక రాష్ట్రంలో స్మశాన వాటికల ఆక్రమణ, కొరత తదితర ఇబ్బందులపై చర్యలు చేపడతామని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ బదులిచ్చారు. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ ద్వారా రాష్ట్రంలో అంగన్‌వాడీల్లో పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం తీçసుకుంటున్న ప్రత్యేక చర్యలతో మాత, శిశు మరణాల రేటు తగ్గిందని మరో మంత్రి తానేటి వనిత బదులిచ్చారు.  

వచ్చే నెలలో ఆర్బీకేను సందర్శించనున్న గవర్నర్‌ 
రాష్ట్రంలో ఏదో ఒక రైతుభరోసా కేంద్రాన్ని స్వయంగా పరిశీలించేందుకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అంగీకరించారని మంత్రి కన్నబాబు గురువారం ‘మండలి’లో తెలిపారు. ఏప్రిల్‌లో ఆయన సందర్శించే అవకాశముందని.. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారన్నారు.   

మరిన్ని వార్తలు