బిందు సేద్యం బకాయిలు విడుదల

8 Mar, 2022 05:26 IST|Sakshi

రూ. 437.95 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి కన్నబాబు వెల్లడి

వచ్చే ఏడాదిలో 3.37 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం 

సాక్షి, అమరావతి: ఏపీ మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు(ఏపీఎంఐపీ)కు సంబంధించి గత ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన రూ. 437.95 కోట్ల బకాయిలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. ఆయా కంపెనీలకు ఒకటి రెండ్రోజుల్లో నేరుగా ఈ మొత్తం చెల్లిస్తామన్నారు. ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో బకాయిల విడుదలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారన్నారని సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

అదే విధంగా రానున్న ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మ సేద్యం ప్రాజెక్టు అమలు కోసం షెడ్యూల్‌ ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారన్నారు. సీఎం ఆదేశాల మేరకు 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,200 కోట్లతో 3.75 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం ప్రాజెక్టును అమలు చేయబోతున్నట్టు మంత్రి కన్నబాబు వెల్లడించారు. ఆర్బీకేల ద్వారా అవసరమున్న ప్రతి రైతుకు బిందు సేద్య పథకం ద్వారా లబ్ధి చేకూర్చేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. రాయలసీమ, ప్రకాశం తదితర జిల్లాల్లో ఈ ప్రాజెక్టు ద్వారా రైతాంగానికి ఎంతో మేలు కలుగుతుందన్నారు. సబ్సిడీపై పెద్దఎత్తున డ్రిప్, స్ప్రింక్లర్ల పరికరాలను సమకూర్చనున్నట్టు ఆయన తెలిపారు. 

మరిన్ని వార్తలు