రాజకీయ లబ్ధికే పవన్‌ పాకులాట

4 Apr, 2022 09:02 IST|Sakshi

తిరుపతి రూరల్‌: కౌలు రైతుల ఆత్మహత్యల పేరుతో పవన్‌కల్యాణ్‌ రాజకీయ స్వలాభం కోసం పాకులాడుతున్నారని వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. గతంలో వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆయన ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. తిరుపతిలో ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. విత్తనం నుంచి పంట విక్రయం వరకు రైతులను చెయ్యిపట్టి నడిపిస్తున్న ఘనత సీఎం వైఎస్‌ జగన్‌దేనన్నారు. రైతులకు ఆత్మహత్యలు చేసుకోవాలనే ఆలోచనే రాకుండా ప్రతి సంక్షేమ పథకాన్ని వారికి అందిస్తున్నారన్నారు. దురదృష్టవశాత్తు ఎక్కడైనా సంఘటన జరిగితే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు అ«ధికారంలోకి వచ్చిన రోజునే ఎక్స్‌గ్రేషియాను రూ.7 లక్షలకు పెంచినట్లు కన్నబాబు తెలిపారు.

గతంలో చంద్రబాబు హయాంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే కేవలం రూ.5 లక్షలు మాత్రమే ఇచ్చేవారని.. కానీ, అందులో రూ.1.5 లక్షలు అప్పు చెల్లించడానికి జమచేసే వారని గుర్తుచేశారు. 2014–18 వరకు రైతు ఆత్మహత్యలుగా నమోదై, ప్రభుత్వం నిర్ధారించకుండా వదలేసిన 469 మంది రైతు కుటుంబాలకు జగన్‌ ప్రభుత్వం రూ.23.45 కోట్లు పరిహారాన్ని చెల్లించిందన్నారు. అప్పుడు పవన్‌ దీనిపై ఎందుకు ప్రశ్నించలేదో సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్‌ చేశారు. కౌలు రైతులను ఆదుకోవడానికి నాడు టీడీపీ ప్రభుత్వం కాని, కేంద్రంలో వున్న బీజేపీ ప్రభుత్వం కానీ ఏమాత్రం ప్రయత్నించలేదని మండిపడ్డారు.  

రైతులకు సమానంగా వారికీ పథకాలు..
ఇక ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్సార్‌ రైతుభరోసా పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులకూ ఏటా రూ.13,500లను పెట్టుబడి సాయంగా అందిస్తున్న విషయం పవన్‌కల్యాణ్‌ తెలుసుకోవాలని కన్నబాబు తెలిపారు. వారికీ పంట బీమా, పంట నష్టపరిహారం అందిస్తున్నామన్నారు. వైఎస్సార్‌ రైతుభరోసాలో భూ యజమానికి పెట్టుబడి సాయం అందిస్తూ అదే రైతు కొంత భూమి కౌలుకు ఇస్తే ఆ కౌలుదారునికి కూడా పెట్టుబడి సాయం అందిస్తున్న ఘనత సీఎం వైఎస్‌ జగన్‌కే దక్కిందన్నారు. కౌలు రైతులకు పీఎం కిసాన్‌ పథకం ఎందుకు అమలుచేయడంలేదో కేంద్ర ప్రభుత్వాన్ని పవన్‌ ప్రశ్నించాలన్నారు. 2019 నుంచి ఇప్పటివరకు 12.11 లక్షల మంది కౌలురైతులకు సీసీఆర్‌సి కార్డులను అందించామన్నారు. జాయింట్‌ లయబులిటీ గ్రూప్స్‌ (జేఎల్‌జీ) కింద వారిని 26,523 గ్రూపులుగా చేసి ఇప్పటివరకు వారికి రూ.5,162 కోట్ల పంట రుణాలను అందించామన్నారు.  

కౌలు రైతులకూ వందశాతం రుణాలు..
సీఎం జగన్‌ ఆదేశాల మేరకు ఈ ఏడాది నుంచి ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాలను ఆర్బీకేలతో సమన్వయం చేసి భూమిలేని కౌలు రైతులకు వందశాతం రుణాలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధంచేస్తున్నామని కన్నబాబు వెల్లడించారు. ఏప్రిల్‌ ఒకటి నుంచి నెల రోజులపాటు ఆర్బీకే స్థాయిలో ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ–క్రాప్‌లో నమోదు చేసుకున్న కౌలురైతులకు సబ్సిడీపై విత్తనాలు అందించడం.. సున్నా వడ్డీ రాయితీ, పంట నష్టపరిహారం, పంటల బీమాలతో పాటు వారి పంటలను కూడా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. రైతుల ఆత్మహత్యల నిర్ధారణకు.. తక్షణం సాయం అందించేందుకు జిల్లా కలెక్టర్ల వద్ద రూ.కోటి చొప్పున నిధులను ఏర్పాటుచేశామన్నారు. కౌలు రైతుల ఆత్మహత్యలంటూ పవన్‌ మాట్లాడడం మంచిపద్ధతి కాదన్నారు. 

మరిన్ని వార్తలు