CI Ramudu Suspension‌: బరితెగించిన సీఐ.. ఏకంగా రూ.15లక్షలతో..

26 Mar, 2022 10:48 IST|Sakshi

సీఐ కంబగిరి రాముడు సస్పెన్షన్‌ 

సాక్షి, కర్నూలు: కర్నూలు అర్బన్‌ తాలూకా సీఐ కంబగిరి రాముడిని సస్పెండ్‌ చేస్తూ ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పంచలింగాల రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద ఈ నెల 19వ తేదీన సెబ్‌ తనిఖీల్లో రూ.75 లక్షల నగదు పట్టుబడింది. ఈ నగదుకు తగిన ఆధారాలు చూపినప్పటికి ఎస్పీకి మామూళ్లు ఇవ్వాలంటూ సీఐ కంబగిరి రాముడు రూ.15 లక్షలు వసూలు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదైంది. ఓర్వకల్లుకు చెందిన గౌరీశంకర్‌ ద్వారా మామూళ్ల వ్యవహారం నడిచింది. హైదరాబాద్‌కు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి, కర్నూలుకు చెందిన భాస్కర్‌రెడ్డి ఇందుకు సహకరించడంతో ముగ్గురిని అరెస్ట్‌ చేసి న్యాయస్థానంలో హాజరు పరచగా, సీఆర్‌పీసీ 41 నోటీసు జారీ చేసి పంపాల్సిందిగా ఉత్తర్వులు ఇచ్చారు. పరారీలో ఉన్న కంబగిరి రాముడి కోసం గాలిస్తున్నారు. సీసీఎస్‌ సీఐగా ఉన్న శేషయ్యకు కర్నూలు అర్బన్‌ తాలుకా బాధ్యతలు అప్పగించారు.

తప్పు చేస్తే తప్పించుకోలేరు: ఎస్పీ హెచ్చరిక
‘ఎవరు ఎలా పనిచేస్తున్నారో తెలుసు. తప్పు చేసి తలదించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు. చట్ట పరిధిలో సక్రమంగా పనిచేస్తే సహకరిస్తా. అక్రమాలకు పాల్పడితే ఇంటికి పంపుతా’ అంటూ ఎస్పీ సీహెచ్‌ సుధీర్‌కుమార్‌రెడ్డి పోలీస్‌ అధికారులను హెచ్చరించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియంలో శుక్రవారం నెల వారీ సమీక్ష  నిర్వహించారు. హత్యలు, అత్యాచారాలు, పోక్సో కేసులపై ప్రధానంగా సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘బాధితులకు న్యాయం జరగాలి. నిందితులకు శిక్షలు పడాలి’ అనే లక్ష్యంతో పని చేయాలన్నారు. నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో వాటి నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులను స్టేషన్ల వారీగా సమీక్షించి వచ్చే సమావేశం నాటికి వాటి సంఖ్యను సగానికి తగ్గించాలని ఆదేశించారు.

జిల్లాలోని పోలీస్‌ అధికారులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ప్రతి కేసును కచ్చితమైన ప్రణాళికతో దర్యాప్తు చేయాలని ఆదేశించారు. రెండు సంవత్సరాలకు పైగా పెండింగ్‌లో ఉన్న కేసులపై చర్చించారు. నంద్యాలలో జిల్లా పోలీస్‌ కార్యాలయం ఏర్పాట్లపై కూడా ఆ ప్రాంత అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. డీపీఓ కార్యాలయ సిబ్బందికి సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారానికి ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఈ సందర్భంగా చర్చించి పరిష్కార సూచనలు చేశారు. అడిషనల్‌ ఎస్పీలు చిదానందరెడ్డి, రాజేంద్ర, డీఎస్పీలు మహేశ్వరరెడ్డి, వెంకటాద్రి, వెంకటరామయ్య, శ్రీనివాసులు, వినోద్‌కుమార్, యుగంధర్‌బాబు, రామాంజినాయక్, శ్రీనివాసరెడ్డి, శ్రుతి,  జిల్లాలోని వివిధ స్టేషన్లకు చెందిన సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు