Kurnool: అమూల్‌ ఆధ్వర్యంలో పాలసేకరణ.. పాడి రైతుకు పండగ

5 Aug, 2022 19:29 IST|Sakshi
పాలుపితుకుతున్న దృశ్యం

కర్నూలు జిల్లాలో 199 బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ సెంటర్ల ఏర్పాటు

గ్రామాల్లో 200కు పైగా  పాలసేకరణ కేంద్రాలు

వెన్న శాతాన్ని బట్టి లీటరుకు రూ.77.98 వరకు వచ్చే అవకాశం

పాడి రైతుకు మేలు చేకూరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం  

రైతు ఇంట పాడిని అభివృద్ధి చేయాలనే తలంపుతో రాష్ట్ర ప్రభుత్వం అమూల్‌ను రంగంలోకి దించుతోంది. సెప్టెంబర్‌ నుంచి జిల్లాలో పాలసేకరణ కొనసాగనుంది. ఈ మేరకు ఒప్పందం కుదిరింది. దీంతో పోటీతత్వం పెరిగి పాడి రైతుకు మేలు చేకూరనుంది. పాలకు మెరుగైన ధర లభించనుంది.  

సాక్షి, కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లాల్లో పాడి గేదెలు 59,690, పాడి ఆవులు 68,120 ఉన్నాయి. పచ్చిమేత పుష్కలంగా ఉండే సమయంలో రోజుకు 5.5 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రస్తుతం గేదెపాలకు వెన్న శాతాన్ని బట్టి లీటరుకు గరిష్టంగా రూ.67 వరకు ధర లభిస్తోంది. ఆవు పాలను గరిష్టంగా లీటరుకు రూ.32 ప్రకారం కొనుగోలు చేస్తున్నారు. పాల కొలతలు, వెన్నశాతం నిర్ధారణలో రైతులను దగా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అమూల్‌ వస్తే రైతులకు వెన్న శాతాన్ని బట్టి లీటరుకు రూ.77.98 ధర లభించే అవకాశం ఉంది.  


ఆర్‌బీకేల పక్కనే బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ సెంటర్లు 

అమూల్‌ ద్వారా సెప్టెంబర్‌ నెల నుంచి పాల సేకరణ చేపట్టనున్నారు. రైతు భరోసా కేంద్రాల వారీగా 2000 లీటర్ల సామర్థ్యంతో బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. పాల  ఉత్పత్తి ఉన్న 199 ఆర్‌బీకేల సమీపంలోనే వీటి ఏర్పాటుకు జిల్లా రెవెన్యూ యంత్రాంగం స్థలాలు సేకరిస్తోంది. ఒక్కోదానికి ఐదు సెంట్ల స్థలం అవసరం కాగా, ఇప్పటికే 198 పాలశీతలీకరణ కేంద్రాలకు రెవెన్యూ అధికారులు స్థలాలను గుర్తించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో 47 భవనాలు కూడా నిర్మిస్తున్నారు.

ఇవిగాక గ్రామాల్లో 200 లీటర్ల సామర్థ్యంతో 200కుపైగా పాల సేకరణ కేంద్రాలు(అటోమేటిక్‌ మిల్క్‌ కలెక్షన్‌ సెంటర్లు) కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీటికి 3.50 సెంట్ల స్థలం అవసరం కాగా, 168 పాలసేకరణ కేంద్రాల కోసం రెవెన్యూ అధికారులు అవసరమైన స్థలాలను సేకరించారు. వీటిలో అమూల్‌ సిబ్బంది ఉండి, సేకరించిన పాలను బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ సెంటర్లకు తరలిస్తారు. అక్కడి నుంచి ట్యాంకర్ల ద్వారా అమూల్‌ డెయిరీకి పాలు సరఫరా అవుతాయి. ట్యాంకర్లు వెళ్లడానికి జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారులు రూట్లను కూడా సిద్ధం చేశారు. 


మహిళా సొసైటీల ఏర్పాటు  

జిల్లాలోని స్వయం సహాయక సంఘాల్లో 3.25 లక్షల మంది వరకు మహిళలు ఉన్నారు. వీరిలో 50 శాతం మంది పాడిపై ఆధారపడి ఉన్నారు. పాలు ఉత్పత్తి చేసే మహిళలతో ఉమెన్‌ డెయిరీ డెవలప్‌మెంటు సొసైటీలు ఏర్పాటు కానున్నాయి. వీటిని కో–ఆపరేటివ్‌ చట్టం కింద రిజిస్ట్రేషన్‌   చేస్తారు. అమూల్‌ పాల సేకరణలో డీఆర్‌డీఏ, పశుసంవర్ధకశాఖ, సహకార శాఖ భాగస్వామ్యం ఉంటుంది. ఇప్పటికే సహకార శాఖ డిప్యూటీ రిజిస్ట్రార్‌ అయిన వెంకటకృష్ణను ప్రభుత్వం జిల్లా డెయిరీ డెవలప్‌మెంట్‌ అధికారిగా నియమించింది. ఉమన్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ సహకార చట్టం కింద సొసైటీలను రిజిస్ట్రేషన్‌ చేస్తారు. రోజుకు ఎన్ని లీటర్లు ఉత్పత్తి అవుతున్నాయనే వాటిని పర్యవేక్షిస్తారు. 


ఎన్నో ప్రయోజనాలు  

మాకు పది పాడి గేదెలు ఉన్నాయి. పచ్చిమేత పుష్కలంగా లభించే సమయంలో రోజుకు 35 లీటర్ల పాలు ఉత్పత్తి అయ్యేవి. గతంలో ఒక డెయిరీకి పాలుపోసే వాళ్లం. లీటరుకు గరిష్టంగా రూ.45 వరకే ధర లభించేది. ఈ ధర గిట్టుబాటు కాకపోవడంతో ప్రస్తుతం పిండిన పాలు పిండినట్లు హోటళ్లకు పోస్తున్నాం. లీటరుకు రూ. 55 ప్రకారం ధర ఇస్తున్నారు. అమూల్‌ ఆధ్వర్యంలో పాల సేకరణ చేపడితే పాడిరైతులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరనున్నాయి. మా గ్రామంలో కూడా బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ సెంటర్లు, ఆటోమేటిక్‌ మిల్క్‌ కలెక్షన్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.                  
– రసూల్, టి.గోకులపాడు, కృష్ణగిరి మండలం  

పాడి రైతులకు మంచి రోజులు వస్తున్నాయి 
మాకు గ్రేడెడ్‌ ముర్రా గేదెలు4, ఆవులు మూడు ఉన్నాయి. రోజు సమతుల్యత కలిగినదాణా, పచ్చిమేత ఇస్తుంటాం. రోజుకు 45 లీటర్ల వరకు పాలు ఉత్పత్తి అవుతాయి. పాడిమీద కష్టపడుతున్నా, తగిన గిట్టుబాటు ధర లభించడం లేదు. అమూల్‌ పాల సేకరణ మొదలైతేనే పాడిరైతుకు మంచి రోజులు వచ్చినట్లు అవుతుంది. గిట్టుబాటు ధరలు లభిస్తాయనే నమ్మకం ఉంది.  
– ఖాజావలి, గూడూరు 


గిట్టుబాటు ధర లభిస్తుంది 

సెప్టెంబరు నుంచి జిల్లాలో అమూల్‌ ఆధ్వర్యంలో పాల సేకరణకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో ఉపాధి నిధులతో పాలశీతలీకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. అమూల్‌ ఆధ్వర్యంలో పాల సేకరణ చేపడితే పోటీతత్వం పెరిగి రైతుకు గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంది.  
– డాక్టర్‌ రామచంద్రయ్య, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి

మరిన్ని వార్తలు