Mahanandi Temple: మహానంది ఆలయానికి మహర్దశ

3 Jan, 2023 19:13 IST|Sakshi

ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే శిల్పా రూ.2 కోట్ల స్వంత నిధులు

రూ.80 లక్షలతో త్వరలో కోనేరులకు మరమ్మతులు 

టీటీడీ ఆధ్వర్యంలో 27 గదుల నిర్మాణానికి ముహూర్తం 

మహానంది: భక్తుల కోర్కెలు తీర్చే మహానందీశ్వరుడి ఆలయానికి మహర్దశ వచ్చింది. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి చొరవ, ఈఓ కాపు చంద్రశేఖర్‌రెడ్డి పర్యవేక్షణతో మహానంది క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని శైవక్షేత్రాల్లో ఒకటైన మహానంది క్షేత్రానికి గతంలో ఏడాదికి రూ.7 నుంచి రూ.10 కోట్ల ఆదాయం వచ్చేది. రెండేళ్ల నుంచి రూ.13 కోట్ల నుంచి రూ.16 కోట్ల వరకు వస్తోంది. ఇక ఈ ఏడాది భారీగా పెరిగింది.   

కోనేరుల మరమ్మతులకు శ్రీకారం 
ఆలయ పరిధిలో పెద్దకోనేరు(రుద్రగుండం)తో పాటు రెండు చిన్న కోనేరులు ఉన్నాయి. వాటి మరమ్మతులకు దేవదాయశాఖ రూ.80 లక్షలు మంజూరు చేసింది. అందులో భాగంగా సీజీఎఫ్‌ నుంచి రూ.40 లక్షలు, దేవస్థానం నుంచి రూ.40 లక్షలు కేటాయిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పనులకు త్వరలో భూమిపూజ చేయనున్నారు. అలాగే ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి స్వంత నిధులు రూ.2 కోట్లతో రాతి నంది విగ్రహాన్ని అభివృద్ధి చేశారు. చుట్టూ వాటర్‌ ఫౌంటెయిన్, గ్రీనింగ్, అధునాతనమైన లైటింగ్‌ అమర్చారు. వాటితో పాటు ఆలయ మాడవీధుల్లో ల్యాండ్‌ స్కేపింగ్‌ పనులు చేపడుతున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు ఒకరోజు ఇక్కడే ఉండి పోవాలన్నంత అందంగా తీర్చిదిద్దుతున్నారు.   


రూ.4.60 కోట్లతో గదుల నిర్మాణం 

టీటీడీ ఆధ్వర్యంలో రూ.4.60 కోట్లతో 27 గదుల నిర్మాణానికి త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. అందులో భాగంగా నంది విగ్రహం ఎదురుగా ఉన్న వేదపాఠశాల భవనం ప్రాంగణంలో సాయిల్‌టెస్టును సేకరించారు. త్వరలోనే పనులు మొదలు పెట్టనున్నారు. వీటితో పాటు దాతలు, భక్తుల సహకారంతో వంద వసతి గృహాల నిర్మాణం చేపట్టనున్నారు. ఏపీ టూరిజం, ప్రస్తుతం ఉన్న టీటీడీ వసతి గృహాల మధ్యలో ఖాళీగా ఉన్న స్థలంలో 50 గదులు, పార్వతీపురం రస్తాలో ఉన్న దేవస్థానం స్థలంలో మరో 50 వసతి గృహాలను నిర్మాణానికి దేవదాయశాఖ ఆమోదం తెలిపింది. మహానందీశ్వర, కామేశ్వరీదేవి, గంగాసదన్‌ల పేర్లు ప్రతిపాదించి త్వరలో నిర్మాణం మొదలు పెట్టనున్నారు.   


అన్నదానానికి రూ.2.30కోట్లు డిపాజిట్లు 

మహానంది దేవస్థానంలో నిర్వహించే అన్నదాన పథకానికి రూ.2.30 కోట్లు డిపాజిట్లు ఉన్నాయి. గతంలో రోజుకు 150 మందికి అన్నప్రసాద వితరణ చేసేవారు. ప్రస్తుతం 200 మందికి పంపిణీ చేస్తుండగా ఆ సంఖ్యను మూడొందలకు పెంచాలని ప్రతిపాదించారు. శని, ఆది, సోమవారాల్లో ఐదు వందల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అరిటాకుల్లో అన్నప్రసాదాలు పంపిణీ చేస్తూ భక్తుల మన్ననలు పొందుతున్నారు. భక్తుల సౌకర్యార్థం దాతల సహకారంతో రూ. 15 లక్షలు వెచ్చించి స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ టేబుళ్లు, కుర్చీలు కొనుగోలు చేశారు. మరింత మంది భక్తులకు అన్నప్రసాదాలు అందాలన్న సదుద్దేశంతో రైతుల నుంచి 1,000 బస్తాల వరిధాన్యం సేకరించారు.   


కార్తీకమాసంలో రూ.1.40 కోట్లు ఆదాయం 

మహానందికి అన్ని విభాగాల నుంచి ఆదాయాన్ని పెంచి భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గతంలో హుండీ కానుకల లెక్కింపు జరిగితే రూ.30 లక్షల నుంచి రూ.32 లక్షలు ఆదాయం వచ్చేది. గత ఏడాది నవంబర్‌లో 49 రోజులకు నిర్వహించిన హుండీ కానుకల లెక్కింపు ద్వారా రూ.63,71,256 ఆదాయం సమకూరింది. అలాగే గత ఏడాది కార్తీకమాసంలో నెలరోజులకు రూ.96 లక్షల ఆదాయం రాగా ఈసారి రూ.1.40 కోట్ల ఆదాయం వచ్చింది. గతంలో కంటే అదనంగా రూ. 44 లక్షలు ఆదాయం పెరిగింది. 


భక్తులకు మెరుగైన సౌకర్యాలు

శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నాం. అవినీతి రహిత పాలనే ధ్యేయంగా పనిచేస్తూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం. మహానందీశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తులు ఎక్కడా రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు. ఆలయానికి ఆదాయం పెంచడంతో పాటు భక్తుల సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నాం. దాతల సహకారంతో ఇప్పటికే మరుగుదొడ్లు మరమ్మతులు చేశాం. త్వరలో డాక్టర్‌ భార్గవవర్ధన్‌రెడ్డి, డాక్టర్‌ విజయభాస్కర్‌రెడ్డిల సహకారంతో బస్‌షెల్టర్‌ నిర్మించనున్నాం. జిందాల్‌ కంపెనీ ఆధ్వర్యంలో టాయిలెట్లు నిర్మించనున్నాం. త్వరలో వంద వసతి గృహాలను నిర్మిస్తాం.      
– కాపు చంద్రశేఖర్‌రెడ్డి, ఈఓ, మహానంది 

మరిన్ని వార్తలు