Kurnool: ఇండస్ట్రియల్‌ హబ్‌గా కర్నూలు

22 Mar, 2022 11:38 IST|Sakshi
ఓర్వకల్లు సమీపంలో నిర్మాణంలో డీఆర్‌డీఓ ప్లాంటు

పారిశ్రామికవాడ కోసం 10,900 ఎకరాలు సేకరించిన ఏపీఐఐసీ 

నీటి వసతి కోసం రూ.560 కోట్లు విడుదల 

సిగాచీ, ఆర్‌పీఎస్‌తో పాటు 8 ఫార్మారంగ కంపెనీల దరఖాస్తు 

బ్లూహ్యాక్, ప్రైమో ప్యారిస్‌లాంటి మరో 13 పెద్ద కంపెనీలు కూడా 

ఫార్మారంగానికి కర్నూలు సానుకూల ప్రాంతమంటున్న నిపుణులు

దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమకు ‘న్యాయ రాజధాని’ని ప్రకటించి అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... కర్నూలు జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటోంది. ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌లో సేకరించిన భూములు, దరఖాస్తు చేసుకున్న కంపెనీలు, రిజిస్ట్రేషన్లు, మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలను పరిశీలిస్తే ‘కర్నూలు’ పారిశ్రామిక కేంద్రంగా మారబోతోందనేది స్పష్టమవుతోంది. 

సాక్షి ప్రతినిధి కర్నూలు: జిల్లాలో ప్రభుత్వం ఆరు ఇండస్ట్రియల్‌ పార్క్‌లను అభివృద్ధి చేస్తోంది. కర్నూలు, ఆదోని, డోన్‌తో పాటు నంద్యాలలో రెండు పార్కులు ఉన్నాయి. కర్నూలు పరిధిలో ఓర్వకల్‌ మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ (ఓహెచ్‌ఎం) కోసం 11 గ్రామాల పరిధిలో 10,900 ఎకరాలను ఏపీఐఐసీ సేకరించింది. ఇందులో 8,300 ఎకరాలు పట్టా, తక్కినవి డీకేటీ భూములు. హైదరాబాద్‌ – బెంగళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో భాగంగా ‘ఓహెచ్‌ఎం’ను నోడ్‌ పాయింట్‌’గా కేంద్రం ప్రభుత్వం 2020 ఆగస్టులో నోటిఫై చేసింది. ఇందులో ఇప్పటికే జయరాజ్‌ ఇస్పాత్‌కు తొలివిడతలో 413.19 ఎకరాలు కేటాయించింది. ఈ స్టీల్‌ ప్లాంటు పనులు చివరిదశలో ఉన్నాయి. త్వరలో ఫేజ్‌–2లో మరో 600 ఎకరాలు వీరికి ఏపీఐఐసీ కేటాయించనుంది. ఇందులో అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే తంగడంచలో జైన్‌ ఇరిగేషన్‌కు 623.40 ఎకరాలు కేటాయించారు. అగ్రికల్చర్, హార్టికల్చర్‌ పార్క్‌ ఇక్కడ ఏర్పాటవుతోంది.

భూముల కోసం 21 కంపెనీలు దరఖాస్తు 
ఓహెచ్‌ఎంలోని గుట్టపాడు క్లస్టర్‌లో 4,900 ఎకరాలు ఏపీఐఐసీ సేకరించింది. ఇందులో సిగాచీ ఇండస్ట్రీస్, ఆర్‌పీఎస్‌ ఇండస్ట్రీస్‌తో పాటు మారుతి – సుజుకి కూడా ఫార్మారంగంలో ప్రవేశించేందుకు భూముల కోసం ఏపీఐఐసీకి దరఖాస్తు చేసుకుంది. వీటితో పాటు మరో 5 ఫార్మా కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. వీటితో పాటు ప్రైమో పాలీప్యాక్‌ (ప్లాస్టిక్‌ ఇండస్ట్రీ), బాక్లహ్యాక్, ఎక్సైల్‌ ఇమ్యూన్‌ లాజిక్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ (వెటర్నరీ ఫార్మా) భారీ ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్‌తో పాటు మరో 13 బడా కంపెనీలు కూడా గుట్టపాడు క్లస్టర్‌లో నిర్మాణాలు మొదలుపెట్టబోతున్నాయి.  

ఓర్వకల్లు సమీపంలో జయరాజ్‌ ఇస్పాత్‌ స్టీల్‌ ఇండస్ట్రీ నిర్మాణ పనులు 

ఫార్మారంగం అభివృద్ధికి అవకాశాలు ఎక్కువ 
గుట్టపాడు క్లస్టర్‌లో దరఖాస్తు చేసుకున్న కంపెనీలలో ఫార్మాకంపెనీలు ఎక్కువగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, వైజాగ్‌ ఫార్మారంగానికి అనువైన వాతావరణం ఉన్న ప్రదేశాలు. హైదరాబాద్‌ కంటే కర్నూలులో వాతావరణ పరిస్థితులు ఫార్మా అభివృద్ధికి అనుకూలమని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో భూసమస్య ఎక్కువగా ఉండటం, అక్కడి కంటే ఇక్కడి పరిస్థితులు అనువుగా ఉండటంతో తెలంగాణలో ఏర్పాటు చేయాలనుకున్న ఫార్మా కంపెనీలు కర్నూలుపై దృష్టి సారిస్తున్నాయి. ఓర్వకల్‌లో ఎయిర్‌పోర్టు ఉండటం, హైదరాబాద్‌కు దగ్గరగా ఉండటంతో ముంబై, ఢిల్లీ, బెంగళూరుతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కంపెనీ ప్రతినిధులు, శాస్త్రవేత్తలు కర్నూలుకు వచ్చేందుకు ఎయిర్‌ కనెక్టివిటీ కూడా దోహదం చేస్తుంది.  

‘రెడ్‌’కు ఈసీ క్లియరెన్స్‌ వస్తే.. 
ఫార్మా రంగంలో రెడ్, ఆరెంజ్‌ అని రెండు విభాగాలు దరఖాస్తులు, అనుమతుల ప్రక్రియ ఉంటుంది. ఆరెంజ్‌ కేటగిరికి ఈసీ (పర్యావరణ అనుమతి) క్లియరెన్స్‌ ఉంది. 4,200 ఎకరాలు ఆరెంజ్‌ కేటగిరీలో ఫార్మాకు భూములు కేటాయిస్తున్నారు. మరో 900 ఎకరాలు రెడ్‌ కేటగిరిలో దరఖాస్తు చేసుకున్నారు. దీనికి ఈసీ క్లియరెన్స్‌ రావాల్సి ఉంది. దీనికి ఈసీ ‘గ్రీన్‌సిగ్నల్‌’ ఇస్తే ‘రెడ్‌’ విభాగంలో భారీగా ఫార్మా కంపెనీలు కర్నూలులో ప్లాంట్‌లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది.  

డీఆర్‌డీవోతో పాటు మరిన్ని సంస్థలు.. 
ఓహెచ్‌ఎంలో 250 ఎకరాల్లో డీఆర్‌డీవో ప్లాంటు నిర్మిస్తున్నారు. ఈ పనులు కూడా చివరి దశలో ఉన్నాయి. ఇవి కాకుండా వంద ఎకరాల్లో ఎన్‌ఐసీ, మెడ్‌సిటీతో పాటు ప్రతీ నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈలు నిర్మిస్తున్నారు. బ్రాహ్మణపల్లి, తంగడంచ, ఇటిక్యాలతో పాటు అన్ని ప్రాంతాల్లో ఎంఎస్‌ఎంఈలకు భూములు కేటాయిస్తున్నారు. బ్రాహ్మణపల్లిలో 20 యూనిట్లు, ఇటిక్యాలలో 4 యూనిట్లకు ఇప్పటికే భూములు కేటాయించారు.   

మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి 
ఓర్వకల్‌ ఇండస్ట్రియల్‌ హబ్‌లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ముచ్చుమర్రి నుంచి ఓహెచ్‌ఎంకు 56 కిలోమీటర్ల మేర నీటిని తరలించేందుకు తొలివిడతలో రూ.560 కోట్లు కేటాయించారు. దీనికి ఈ నెల 16న టెండర్లు పిలిచారు. ఫేజ్‌–2లో మరో రూ.800 కోట్లు కేటాయించనున్నారు. ఇవి కాకుండా విద్యుత్‌ సబ్‌స్టేషన్ల నిర్మాణం పూర్తయింది. రోడ్లు, డ్రైనేజీ పనులు జరుగుతున్నాయి. పారిశ్రామికవేత్తలకు అన్నిరకాల మౌలిక వసతులు కల్పిస్తామని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. మౌలిక వసతులు పూర్తయి, ముచ్చుమర్రి నుంచి ఓహెచ్‌ఎంకు నీరు చేరితే భారీ సంఖ్యలో పరిశ్రమలు రానున్నాయి.
 
పారిశ్రామిక అభివృద్ధికి ఎక్కువ అవకాశాలు 
పారిశ్రామిక అభివృద్ధికి 33 వేల ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం భావించింది. ప్రస్తుతం 10,900 ఎకరాలు సేకరించాం. చాలా కంపెనీలు దరఖాస్తులు చేసుకున్నాయి. జయరాజ్, జైన్‌ ఇరిగేషన్‌ లాంటి కంపెనీలు నిర్మాణ పనులు ప్రారంభించాయి. పారిశ్రామికవాడలో మౌలిక వసతులు కల్పిస్తాం. ప్రభుత్వం దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ముఖ్యంగా ఫార్మారంగానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దరఖాస్తులు కూడా ఈరంగం నుంచే ఎక్కువగా వచ్చాయి. రాబోయే ఐదేళ్లలో కర్నూలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందనుంది. – వెంకట నారాయణమ్మ, జోనల్‌ మేనేజర్, ఏపీఐఐసీ, కర్నూలు

మరిన్ని వార్తలు