లక్ష్యానికి తూట్లు పొడుస్తున్న సచివాలయ సిబ్బంది తీరు

7 Jul, 2022 20:38 IST|Sakshi
11:30 దాటినా చెలిమిల్ల గ్రామ సచివాలయంలో సిబ్బంది లేని దృశ్యం

ఉదయం 11:30 దాటినా విధులకు రాని గ్రామ సచివాలయ సిబ్బంది 

కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ

నిరీక్షించి వెనుదిరుగుతున్న ప్రజలు

పాములపాడు: ప్రజలకు నాణ్యమైన పాలన అందించడమే కాకుండా, మరింత చేరువ చేయాలని ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. ఎంతో మంది నిరుద్యోగులకు గ్రామంలో ఉద్యోగం కల్పించింది. ఈ విధానం విజయవంతం కావడంతో పలు రాష్ట్రాలు అధ్యయనం చేసి అమలు చేయడానికి పూనుకున్నాయి. అయితే కొన్నిచోట్ల స్థానిక సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి. మండలంలోని చెలిమిల్ల గ్రామంలో సచివాలయ ఉద్యోగుల తీరు అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.

ఉదయం 11.30 దాటినా ఒక్కరు కూడా విధులకు హాజరుకాకపోవడం, కార్యాలయానికి వచ్చిన వారిని పట్టించుకోకపోవడంతో స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో సిబ్బంది ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని వారు మండిపడుతున్నారు. సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు నిరీక్షించి వెనుదిరిగి వెళ్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని సక్రమంగా విధులు నిర్వర్తించేలా చూడాలని కోరుతున్నారు.


 

మరిన్ని వార్తలు