మూన్నాళ్ల ముచ్చటే!

19 Aug, 2020 12:35 IST|Sakshi

కర్నూలు–గుంటూరు జాతీయ రహదారి పనుల్లో నిర్లక్ష్యం.. 

వేసిన రెండు వారాలకే జారిపోయిన జాతీయ రహదారి  

కొన్ని చోట్ల నిర్మించిన రోడ్డును తవ్వేసిన వైనం 

రోడ్డు పునర్మిస్తామంటున్న అధికారులు  

పెద్దదోర్నాల:  జాతీయ రహదారులు దేశంలోని వేల కిలోమీటర్ల దూరంలోని ప్రధాన నగరాలను కలిపే రాచబాటలు. కాలాన్ని, ఇంధనాన్ని ఆదా చేసే మార్గాలు. రోజూ వందలాది వాహనాలు ఈ మార్గాల గుండా ప్రయాణికులను, సరుకులను తరలిస్తుంటాయి. ఇంతటి ప్రాధాన్యతను కలిగిన జాతీయ రహదారులను నాణ్యతా ప్రమాణాలకు విరుద్ధంగా నిర్మించడం అధికారుల అలసత్వానికి పడుతోంది. కర్నూలు–గుంటూరు జాతీయ రహదారి మూన్నాళ్ల ముచ్చటగా తయారైంది. మండల పరిధిలోని రోళ్లపెంట నుంచి పెద్దదోర్నాల వరకు చేపట్టిన రోడ్ల నిర్మాణ పనుల్లో అడుగుడుగునా అధికారులు, కాంట్రాక్టుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనబడుతోంది. ఈ మార్గంలో ఇటీవల వేసిన రోడ్డు కొద్ది రోజులకే జారి పోయింది. రాయలసీమ, కోస్తా జిల్లాలను కలిపే  ప్రధానమైన రహదారిని అధికారుల పర్యవేక్షణ లేకుండా నాసి రకంగా నిర్మించడంపై వాహనదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  

నాణ్యత ప్రమాణాలు గాలికి.. 
మండల పరిధిలోని కర్నూలు రహదారిలో ఉన్న రోళ్లపెంట నుంచి శ్రీశైలం రోడ్డులోని శిఖరం మీదుగా హనుమాన్‌ జంక్షన్‌ వరకు ఆయా రోడ్లు విజయవాడ పరిధిలో ఉండేవి. అయితే ఇటీవల ఆ రోడ్లను అనంతపురం పరిధిలోకి చేర్చటంతో అధికారుల పర్యవేక్షణ నామమాత్రమైంది. రోళ్లపెంట నుంచి పెద్దదోర్నాల వరకు రెండు భాగాలుగా సుమారు 34 కోట్ల రూపాయలతో ని«ర్మిస్తున్న రహదారులు నాసిరకంగా ఉన్నాయి. సాధారణంగా కొత్త రోడ్డు వేసే క్రమంలో పాత రోడ్డును డోజరుతో పెకిలించి ఆపై కొత్త రోడ్డును నిర్మించాల్సి ఉంటుంది. అలా చేయటం వల్ల కొత్త రోడ్డుకు గ్రిప్‌ ఉంటుంది. కాంట్రాక్టర్లు పాత రోడ్డును పెద్దగా కదిలించకుండా ఆపైన కొత్త రోడ్డు వేశారు. దీంతో రోడ్డు వేసిన కొద్ది రోజులకే అడుగుడుగునా జారిపోయి పాత రోడ్డు దర్శనం ఇస్తుండటంతో అధికారులు తలలు పట్టుకున్నారు. దీంతో హుటా హుటిన మండల పరిధిలోని యడవల్లి వరకు పలు ప్రాంతాలలో నాసిరకంగా ఉన్న రోడ్డును తొలగించి కొత్త రోడ్డును వేసేందుకు రంగం సిద్ధం చేశారు. తొలగించిన రోడ్డు కాకుండా మరి కొన్ని ప్రాంతాలలో రోడ్డు జారి పోవడంతో పాత రోడ్డే దర్శనం ఇస్తుంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్ల నిర్మాణ పనులను మరింత నాణ్యతా ప్రమాణాలు జోడించి చేపట్టాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.  

మరిన్ని వార్తలు