హర్షాతిరేకాలు : నెరవేరిన ఆరు దశాబ్దాల కల

31 Jul, 2020 16:42 IST|Sakshi

సాక్షి, కర్నూలు : మూడు రాజధానులు బిల్లుకు గవర్నర్‌ బిశ్వభూషన​ హరిచందన్‌ ఆమోదం తెలపడంపై రాష్ట్ర వ్యాప్తంగా పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యాయ రాజధాని కర్నూలు ప్రజలు, ప్రజాప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బిల్లుకు ఆమోదం తెలిపిన సందర్భంగా కర్నూలు నడిబొడ్డున గల కొండారెడ్డి బురుజు వద్ద సంబరాలు జరపుకున్నారు. ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పారాటానికి నేడు ప్రతిఫలం లభించిందని ఆ జిల్లా ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. సీఆర్‌డీఏ-2014 రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ శుక్రవారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

దీనిపై స్థానిక ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ మాట్లాడుతూ.. కర్నూలును న్యాయ రాజధానిగా ఎంపిక చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే సీఎం జగన్‌ లక్ష్యమన్నారు.  కర్నూలులో న్యాయ రాజధానిని స్వాగతిస్తున్నామన్నారు. న్యాయ రాజధాని కర్నూలుకు రావాలన్నది మా కలఅని, 6  దశాబ్దాల మా కల ఇన్నాళ్లకు నెరవేరిందని పేర్కొన్నారు. మా కలను నెరవేర్చిన సీఎం జగన్‌కు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ కృతజ్ఞతలు తెలిపారు. (మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్‌ ఆమోదం)

హైకోర్టు ఏర్పాటు వల్ల సీమకు న్యాయం
మూడు రాజధానుల బిల్లుకు ఆమోదం తెలిపిన గవర్నర్ నిర్ణయంపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు ఆలూరు రామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాయలసీమలో జ్యూడిషియల్ క్యాపిటల్ స్వాగతిస్తున్నామన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు వల్ల రాయలసీమకు న్యాయం జరుగుతుందని, మూడు రాజధానుల వల్ల ప్రాంతీయ అసమానతలు ఉండవని అభిప్రాయపడ్డారు.

ఈరోజు చారిత్రాత్మకమైన రోజుని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. పాలనా వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. చంద్రబాబు కుట్రలన్నీ విఫలమయ్యాయి. రియల్‌ ఎస్టేట్‌ కోసం చంద్రబాబు కుట్రలు పన్నితే... అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం సీఎం జగన్‌ ఆలోచన చేశారు’ అని అన్నారు. 
 

మరిన్ని వార్తలు