బాధితులకు వారంలోపే అందిన సాయం

20 Dec, 2020 04:33 IST|Sakshi
బాధితులకు చెక్‌ ఇస్తున్న ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి, ఎమ్మెల్యే బిజేంద్ర

కర్నూలు రోడ్డు ప్రమాద బాధితులకు రూ.30.5 లక్షలు అందించిన ప్రభుత్వం 

శిరివెళ్ల: కర్నూలు జిల్లా యర్రగుంట్ల రోడ్డు ప్రమాద బాధితులకు ప్రకటించిన ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వారంలోపే అందించింది. రూ.30.5 లక్షల ఆర్థిక సహాయం విడుదల కాగా.. ఈ చెక్కులను జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్‌రెడ్డి బాధితుల కుటుంబాలకు శనివారం అందజేశారు. ప్రమాదంలో మరణించిన చిన్నారులు ఝాన్సీ, సుస్మిత, వంశీ, హర్షవర్ధన్, వృద్ధురాలు సువర్ణల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున అందించారు. అలాగే 11 మంది క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున చెక్కులు అందజేశారు.

అనంతరం ఎమ్మెల్యే బిజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ..  ప్రమాదం జరిగిన వెంటనే తాను బాధితులను పరామర్శించి.. విషయాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఆయన స్పందించి.. ఆర్థిక సాయం ప్రకటించి బాధితులకు అండగా నిలిచారన్నారు. కార్యక్రమంలో నంద్యాల సబ్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి, తహసీల్దార్‌ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు