ప్రకృతి సాగుతో అబ్బురపరుస్తున్న టెక్కీ! ‘గూగుల్‌ ఫామ్స్‌’ ద్వారా మార్కెటింగ్‌..

21 Jan, 2023 12:39 IST|Sakshi

సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లా జొహరాపురానికి చెందిన బాలభాస్కరశర్మ పదేళ్ల పాటు సింగపూర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేశారు. తండ్రి మరణంతో కర్నూలు వచ్చేసిన ఆయన బెంగళూరు కేంద్రంగా ఉన్న ఓ కంపెనీలో ఇంటినుంచే పని చేస్తున్నారు. కొలువును కొనసాగిస్తూనే.. కల్లూరు మండలం నాయకల్లు గ్రామంలో తనకున్న 8.50 ఎకరాల్లో 20 రకాల కూరగాయలు, ఆకు కూరలతో పాటు 10కి పైగా పండ్లను సాగు చేస్తూ వినూత్న రీతిలో మార్కెటింగ్‌ చేస్తున్నారు.

ఎర్ర బెండ, నల్ల పసుపు, మామిడి అల్లం వంటి విభిన్న పంటలతో పాటు నిమ్మ, జామ, సీతాఫలం, మామిడి, అంజూర, నేరేడు, అరటి, మునగ, పాల సపోట, చెర్రీ, టమాటా, చెన్నంగి కొబ్బరి, ముల్లంగి, ఆకు కూరలను సాగు చేస్తున్నాడు. మధురై నుంచి ఎర్ర బెండ సీడ్‌ను, ఆయుర్వేద మందుల్లో ఎక్కువగా ఉపయోగించే నల్ల పసుపును మేఘాలయ నుంచి తెప్పించి నాటారు. 

గూగుల్‌ ఫామ్స్‌ ద్వారా బుకింగ్‌ 
బాలభాస్కరశర్మ పండించిన పంటలన్నిటినీ గూగుల్‌ ఫా­మ్స్‌ ద్వారా మార్కెటింగ్‌ చేస్తున్నారు. వారానికి రెండుసార్లు కూరగాయలు, ఆకు కూరలు కోతకు వస్తుండగా.. కోతకొచ్చే రెండ్రోజుల ముందుగానే గూగుల్‌ ఫామ్స్‌లో తాను పండించే పంటలు, వాటి ధరల వివరాలను వినియోగదారులకు లింక్‌ ద్వారా పంపిస్తున్నారు. తమకు అవసరమైన వాటిని ఏ మేరకు కావాలో ఎంచుకొని.. ఆ వివరాలను వినియోగదారులు సబ్మిట్‌ చేయగానే బాలభాస్కరశర్మకు మెయిల్‌ మెసేజి వస్తుంది.

ఆ వివరాలను ఎక్సెల్‌ షీట్‌లో క్రోఢీకరించు­కుని కోతలు పూర్తి కాగానే వాటి నాణ్యత కో­ల్పోకుండా ప్యాకింగ్‌ చేసి స్వయంగా డోర్‌ డెలివరీ చేస్తు­న్నారు. ఇలా కర్నూలులోని 3 అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తున్న వారికి తన పంటలను విక్రయిస్తున్నారు. గూగుల్‌ ఫామ్స్‌ను వినియోగించడం వల్ల సొంత వెబ్‌సైట్, ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ అవసరం లేకుండా, ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా మొత్తం పంటల్ని విక్రయిస్తున్నారు. 

సాగులో ఆధునికత 
కూరగాయలు, ఆకు కూరలను మల్చింగ్‌ విధానంలో భాస్కరశర్మ సాగు చేస్తున్నారు. మల్చింగ్‌ వల్ల భూమిలో తేమ ఆరిపోకుండా ఉండటమే కాకుండా నీరు ఆదా అవుతుంది. చీడపీడల బెడద కూడా ఉండదు. కూరగాయలు, ఆకు కూరలు మంచి నా­ణ్య­తతో ఉంటాయి. మామిడి, ఇతర పండ్ల తోటలకు వేరుశనగ పొట్టుతో మల్చింగ్‌ చేస్తున్నారు. సాగులో ఎరువులు, పురుగుల మందులు వాడరు. పూర్తిగా గో ఆధారిత వ్యవసాయం కోసం 5 దేశీవాళీ ఆవులను పోషిస్తున్నారు.

వాటిద్వారా వచ్చే జీవామృతం మొక్కలకు వేస్తారు. రసం పీల్చే పురుగుల నివారణకు వావిలాకు కషాయం, గొంగళి పురుగుల నివారణకు అగ్ని అస్త్రం, దశపర్ణి కషాయం, పుల్లటి మజ్జిగ, చీడపీడలకు నీమాస్త్రం, వేప, సీతాఫలం నూనెలు వాడుతున్నారు.  పండ్ల తోటలకు నష్టం కలిగించే పండు ఈగల నివారణకు సోలార్‌ ట్రాప్స్, తెలుపు, పసుపు జిగురు అట్టలు ట్రాప్స్‌ను ఉపయోగిస్తున్నారు.  

రసాయన అవశేషాలు లేని పంటల సాగే లక్ష్యం 
రసాయన అవశేషాలు లేకుండా పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్నాను. వారానికి ఐదు రోజులు వ్యవసాయ క్షేత్రంలోనే ఉంటాను. క్షేత్రంలో ఓ కుటుంబానికి ఉపాధి కల్పిస్తున్నాను. మొదట్లో పండ్ల మొక్కలు నాటాను. ఆరు నెలలుగా కూరగాయలు, ఆకు కూరలు సాగు చేస్తున్నాను. వారానికి రెండుసార్లు ఆపార్ట్‌మెంట్స్‌లో విక్రయిస్తున్నాను. మంచి ఆదరణ లభిస్తోంది. పెట్టుబడికి తగినట్టుగా ఆదాయం వస్తుంది.  
– బాలభాస్కరశర్మ, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్, కర్నూలు

మరిన్ని వార్తలు