వృద్ధురాలికి అంత్యక్రియలు... మానవత్వం చాటుకున్న తహసీల్దార్‌

26 May, 2021 10:29 IST|Sakshi
లక్ష్మిదేవమ్మ అంత్యక్రియలు నిర్వహిస్తున్న తహసీల్దార్‌ నాగమణి తదితరులు 

సాక్షి, గడివేముల: కుటుంబ సభ్యులంతా కరోనా బారినపడి కోవిడ్‌ కేర్‌ సెంటరులో ఉండగా.. ఇంటి వద్ద అనాథలా మృతిచెందిన ఓ వృద్ధురాలికి అంత్యక్రియలు చేయడానికి స్థానికులెవరూ ముందుకు రాలేదు. కానీ స్వయాన మండల తహసీల్దార్‌  కన్నబిడ్డలా ముందుకొచ్చి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ సంఘటన గడివేముల మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.  కొరటమద్ది గ్రామానికి చెందిన వడ్డు  లక్ష్మిదేవమ్మ(85) కుమారుడు, కోడలు, మనవడు, మనవడి భార్య మూడు రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. వీరిని వైద్యసిబ్బంది చికిత్స నిమిత్తం నంద్యాలలోని కోవిడ్‌ కేర్‌ సెంటరుకు తరలించారు.

అప్పటి నుంచి లక్ష్మిదేవమ్మ ఒక్కరే ఇంట్లో ఉండేవారు. కుటుంబ సభ్యుల పరిస్థితిని తలచుకుని ఆందోళన చెందుతుండేవారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచింది. కుటుంబ సభ్యులు కోవిడ్‌ కేర్‌ సెంటరులో ఉండిపోవడం, కరోనా భయంతో స్థానికులెవరూ ఆమె అంత్యక్రియలు చేయడానికి ముందుకు రాని విషయం తహసీల్దార్‌ నాగమణి దృష్టికి వెళ్లింది. దీంతో ఆమె మంగళవారం సిబ్బందితో కలిసి  గ్రామానికి చేరుకున్నారు.  ఒక కూతురిలాగా లక్ష్మిదేవమ్మ మృతదేహాన్ని సిబ్బందితో కలిసి మోసుకుంటూ వెళ్లి హిందూ సంప్రదాయ పద్ధతిలో ఖననం చేశారు. ఈ దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. అంత్యక్రియలలో తహసీల్దార్‌కు గ్రామ సర్పంచ్‌ నాగేశ్వర్‌రెడ్డి తదితరులు సహకరించారు. 

చదవండి: ‘మాయలేడి’ మామూలుది కాదు.. లక్షల కాజేసి..
భర్త అనుమానం.. ఇద్దరు బిడ్డలతో తల్లి ఆత్మహత్య

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు