Kurnool: అదృష్టం తలుపు తట్టింది.. ఆ కుటుంబాలకు వజ్రాల రూపంలో లక్షలు..

11 Aug, 2022 06:59 IST|Sakshi

తుగ్గలి: అదృష్టం తలుపు తట్టడంతో కర్నూలు జిల్లాలో రెండు కుటుంబాలకు బుధవారం వజ్రాల రూపంలో రూ.లక్షలు లభించాయి. తుగ్గలి మండలంలో ఒక రైతు కుటుంబం, ఒక కూలీ కుటుంబం వజ్రాలు దొరకడంతో లబ్ధిపొందాయి. జి.ఎర్రగుడిలో రైతు కుటుంబానికి చెందిన యువతి పొలం పనులకు వెళ్లింది. సొంత పొలంలో ఆముదం పంటలో కలుపుతీస్తుండగా మెరుగురాయి తళుక్కుమంది. దాన్ని కుటుంబసభ్యులకు చూపించడంతో వజ్రం అని నిర్ధారణ చేసుకున్నారు.

దాదాపు పది క్యారెట్లు ఉన్న ఈ వజ్రాన్ని పెరవలి, జొన్నగిరి, గుత్తికి చెందిన పలువురు వ్యాపారులు సిండికేట్‌ అయి రూ.34 లక్షల నగదు, 10 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేసినట్లు తెలిసింది. జొన్నగిరిలో టమాటాలు తెంచేందుకు కూలికి వెళ్లిన మహిళకు రంగురాయి దొరికింది. దాన్ని తీసుకెళ్లి వ్యాపారికి చూపించగా వజ్రమని తేల్చి రూ.6 లక్ష లకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ ఏడాది ఇప్పటివరకు జొన్నగిరి, జి.ఎర్రగుడి, పగిడిరాయి, గిరిగెట్ల గ్రామాల్లో ఏడువజ్రాలు లభ్యమయ్యాయి.

ఏటా తొలకరి వర్షాలకు ఈ ప్రాంతంలో విలువైన వజ్రాలు లభ్యమవుతుంటాయి. వజ్రాలు వెతికేందుకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల నుంచి జనం వస్తుంటారు. జనం తాకిడి ఎక్కువ కావడంతో ఈ ఏడాది జొన్నగిరిలో రైతులంతా కలిసి కాపలాదారులను పెట్టారు. వజ్రాన్వేష కులు రాకుండా కాపలాదారులు నిలువరిస్తున్నారు. 

చదవండి: (హాస్టళ్లకు మహర్దశ) 

మరిన్ని వార్తలు