మూడు రాజధానులతోనే రాష్ట్రాభివృద్ధి.. ‘సీమ’లో మళ్లీ ఉద్యమం 

14 Nov, 2021 11:36 IST|Sakshi

కర్నూలు కేంద్రంగా వికేంద్రీకరణ పరిరక్షణ సమితి ఏర్పాటు 

ఉద్యమ కార్యాచరణకు రేపు అన్ని వర్గాలతో సదస్సు 

వికేంద్రీకరణను అడ్డుకుంటున్న విపక్షాలపై ఆగ్రహం 

ధికార వికేంద్రీకరణను అడ్డుకుంటే సహించం 

చంద్రబాబు రియల్‌ దందా కోసమే రైతుల పాదయాత్ర 

న్యాయ రాజధానిని కాపాడుకునేందుకు పోరాటం  

విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకుల స్పష్టీకరణ

కర్నూలు ప్రాంతం దశాబ్దాలుగా పాలకుల నిర్లక్ష్యానికి గురైంది. ఈ నేపథ్యంలో ఇక్కడి ప్రజల కష్టాలు తీర్చేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం హైకోర్టు ఏర్పాటు చేయతలపెట్టింది. 2019లోనే మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టినా కొన్ని విపక్షాలు కోర్టుల్లో కేసులు వేసి, మరోమారు ‘సీమ’ను దగా చేసే యత్నానికి ఒడిగట్టాయి. ఈ క్రమంలో ‘సీమ’ వాసులు మళ్లీ గళమెత్తుతున్నారు. ఉద్యమాన్ని తీవ్రం చేసేందుకు ఈ నెల 15న కర్నూలు వేదికగా సమావేశం కానున్నారు.

సాక్షి, కర్నూలు: ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు తర్వాత కర్నూలే రాష్ట్ర రాజధాని.. ఆపై హైదరాబాద్‌కు తరలించారు. హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేస్తామని అప్పట్లో ప్రకటించారు. ప్రతి రాజకీయపార్టీ ‘సీమ’లో ప్రాబల్యం కోసం దీన్ని రాజకీయ అస్త్రంగా వాడుకోవడం మినహా చిత్తశుద్ధి చూపలేదు. ఈ క్రమంలో 2014లో తెలంగాణ ఏర్పాటుతో హైదరాబాద్‌ దూరమైంది. దశాబ్దాలుగా హైదరాబాద్‌ కేంద్రంగానే అభివృద్ధి జరిగింది. ఫార్మా, ఐటీలతో పాటు అన్ని రకాల పరిశ్రమలు హైదరాబాద్‌ సమీపంలోనే స్థాపించారు. విద్యా, వైద్యంతో పాటు ఏ అవసరమున్నా హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అనివార్య పరిస్థితిని పాలకులు కల్పించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరబాద్‌ దూరం కావడంతో రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరు లేకుండా పోయింది. ఈ అనుభవంతో 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని ఉద్యమించారు. దీన్ని చంద్రబాబు విస్మరించారు. 2019లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ, విశాఖను పాలన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధాని, అమరావతిని శాసన రాజధానిగా చేస్తూ బిల్లు ప్రవేశపెట్టింది. హైదరాబాద్‌ విషయంలో జరిగిన పొరపాటు మరోసారి జరగకుండా జాగ్రత్త తీసుకుంది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది. అన్ని ప్రాంతాలను ప్రభుత్వం సమానంగా భావిస్తోందనే చర్చ మొదలైంది.  

‘సీమ’కు ద్రోహం చేసేలా రాజకీయపార్టీల వైఖరి 
ప్రభుత్వ ప్రకటన తర్వాత ఒక్కసారిగా విపక్ష పార్టీలు స్వరం మార్చాయి. అమరావతి రాజధానిగా ఉండాలని ఆ పారీ్టలు ప్రకటన చేశాయి. చివరకు జిల్లా వాసి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఇదే స్వరం విని్పంచారు. జిల్లా టీడీపీ నేతలు జయనాగేశ్వరరెడ్డి, అఖిలప్రియ, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తిక్కారెడ్డితో పాటు పలువురు టీడీపీ నేతలు రాజధానిగా అమరావతి వైపే మొగ్గు చూపారు. 2019లో జీఎన్‌రావు కమిటీ, బోస్టన్‌కమిటీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు తిరిగి పరిస్థితులు అధ్యయనం చేసి ప్రజాభిప్రాయాలు తీసుకుని నివేదికలు ఇచ్చాయి. ఈ కమిటీలు కూడా వికేంద్రీకరణే శ్రేయస్కరమని సూచించాయి. కానీ టీడీపీ నేతలు అమరావతిలో ఆస్తులు కొనుగోలు చేసి వాటిని కాపాడుకునే క్రమంలో వికేంద్రీకరణకు వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేయించారు. దీంతో హైకోర్టు తరలింపు ప్రక్రియలో జాప్యం జరుగుతోంది.   

హెచ్‌ఆర్సీ, లోకాయుక్త ఏర్పాటు 
న్యాయరాజధానిలో భాగంగా ఇప్పటికే మానవహక్కుల కమిషన్, లోకాయుక్త కార్యాలయాలు జిల్లాలో ఏర్పాటయ్యాయి. త్వరలోనే మరిన్ని ట్రిబ్యునల్స్‌ రానున్నాయి. హైకోర్టుతో పాటు మొత్తం 43కుపైగా అనుబంద ట్రిబ్యునల్స్‌ జిల్లాకు రానున్నాయి. వీటి ఏర్పాటుతో కర్నూలు అభివృద్ధి మరోస్థాయికి చేరనుంది. కానీ కోర్టు కేసులతో జాప్యం జరగనుండటంతో ప్రజల ఆకాంక్షలు మరోసారి తెలియజేసేలా రాయలసీమలోని ఉద్యోగ, వ్యాపార, విద్యార్థి, న్యాయవాద వర్గాలు, సంఘాలు కలిసి వికేంద్రీకరణ పరిరక్షణ సమితి ఏర్పాటు చేశాయి. దీని కన్వీనర్‌గా క్రిష్టఫర్, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డిలు సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. న్యాయరాజధాని  సాధన దిశగా కార్యాచరణ రూపొందించనున్నారు.  

సాక్షి, కర్నూలు (రాజ్‌విహార్‌): రాష్ట్రంలో మూడు రాజధాలను ఏర్పాటు చేయడంతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు తన, తన అనుచరుల రియల్‌ దందా కోసమే పాదయాత్ర చేయిస్తున్నారని అన్నారు. గతంలో 14 ఏళ్ల పాటు ఆయన సీఎంగా ఉన్నా రాష్ట్రాభివృద్ధి కంటే స్వలాభం కోసమే ఎక్కువ శ్రమించారన్నారు. ఇచ్చిన హామీలను విస్మరిస్తూ ప్రజలను మోసం చేస్తూ వచ్చారు తప్ప ఏం సాధించారో చెప్పాలన్నారు. శ్రీబాగ్‌ ఒప్పందంకు అనుగుణంగా శివరామకృష్ణ, శ్రీరామకృష్ణ కమిటీలు నివేదికలు ఇచ్చినా ఆయన ఎందుకు సాధించలేకపోయారన్నారు.

రాయలసీమ, ఉత్తరాంధ్రలు వెనకబడిపోయినా, వీటి గురించి ఆలోచించని ఆయన కేవలం ఒక సామాజిక వర్గం భూమి కొనుగోలు చేసిన ప్రాంతం అభివృద్ధి కోసం తపిస్తున్నారన్నారు. 1953లో వచ్చిన రాజధాని కోల్పోయిన తాము  ఇప్పుడు వచ్చిన హైకోర్టును పోగొట్టుకోలేమని, ఇందు కోసం ఎలాంటి ఉద్యమాలకైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో చెన్నై, తాజాగా హైదరాబాదు అభివృద్ధి చెందిన తరువాత వదిలి వచ్చామని, ఇప్పుడు విజయవాడ, గుంటూరు అభివృద్ధి చెందిన తరువాత వదిలేసి వెళ్లమంటే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. జగన్‌ తీసుకున్న నిర్ణయానికి ప్రజలు మద్దతుగా నిలవాలని చెప్పారు. ఈ సమావేశంలో బీసీ కార్పొరేషన్ల డైరెక్టర్లు గోపాల్‌రెడ్డి, షరీఫ్, పార్టీ రాష్ట్ర నాయకులు సీహెచ్‌ మద్దయ్య పాల్గొన్నారు. 

ఎంత వరకైనా వెనకాడం 
‘సీమ’కు ప్రతిసారీ దగా జరుగుతోంది. అంతా వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారు. హైకోర్టు ఏర్పాటును కూడా అడ్డుకుంటుంటే రేపు ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో న్యాయం చేస్తారనే నమ్మకం ఏముంది. హైకోర్టు అనేది ‘సీమ’ హక్కు. కచ్చితంగా ఏర్పాటు చేయాల్సిందే. దీని కోసం ధర్నాలు, పాదయాత్రలు, రిలేదీక్షలు అవసరమైతే ఆమరణదీక్షలు చేస్తాం. ఇప్పుడు న్యాయం జరగకపోతే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది జరగకుండా న్యాయరాజధాని ఏర్పాటు చేయాలి. 
– బి.క్రిష్టఫర్, వికేంద్రీకరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు 

విడతల వారీగా ఉద్యమం 
అన్ని పార్టీలు, సంఘాలను సదస్సుకు పిలిచాం. ఈ దఫా ఉద్యమం తీవ్రంగా చేయనున్నాం. హైకోర్టు ఏర్పాటయ్యేదాకా ఉద్యమం ఆగదు. అందరి అభిప్రాయాలు తీసుకుని కార్యాచరణ రేపు ప్రకటిస్తాం. టీడీపీ, బీజేపీతో సహా అన్ని పారీ్టలను ఆహ్వానించాం. ఎవరి అభిప్రాయాలు వారు చెప్పొచ్చు. న్యాయరాజధాని ఏర్పాటైతే జరిగే అభివృద్ధి మేం వివరిస్తాం. దీనికి ‘సీమ’ వాసులంతా సహకరించాలి. 
– విజయ్‌ కుమార్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌

మరిన్ని వార్తలు