సబ్సిడీ ఉల్లి విక్రయాలు ప్రారంభం

24 Oct, 2020 05:14 IST|Sakshi

అమ్మకాలను ప్రారంభించిన మంత్రి కన్నబాబు 

సాక్షి, అమరావతి/సూర్యారావుపేట (విజయవాడ సెంట్రల్‌)/తాడేపల్లిగూడెం: రైతు బజార్లలో సబ్సిడీపై కిలో ఉల్లిపాయలను రూ.40కే విక్రయిస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. జిల్లా కేంద్రాల్లోని రైతు బజార్లలో శనివారం నుంచి.. అన్ని రైతు బజార్లలో సోమవారం నుంచి  అందుబాటులో ఉంటాయన్నారు. విజయవాడ స్వరాజ్‌ మైదానం రైతు బజార్‌లో ఉల్లి విక్రయాలను మంత్రి శుక్రవారం ప్రారంభించారు.

మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి 6 వేల క్వింటాళ్లను తెచ్చేలా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. గతంలోనూ రూ.60 కోట్ల భారం పడినా ప్రభుత్వమే సబ్సిడీపై ప్రజలకు అందించిందని గుర్తు చేశారు. దుకాణాల వద్ద ధరల బోర్డులు పెట్టాలని, అలా పెడుతున్నదీ లేనిదీ కలెక్టర్లు, ఎస్పీలు పర్యవేక్షించాలని కూడా సీఎం ఆదేశించారన్నారు. తాడేపల్లిగూడెం హోల్‌సేల్‌ మార్కెట్‌లో అధికారులు 140 టన్నులు కొనుగోలు చేశారు. కర్నూలు నుంచి వచ్చిన 2,881 బస్తాలనూ కొనుగోలు చేసి ప్రతి జిల్లాకు 10 టన్నుల చొప్పున తరలించారు. 

>
మరిన్ని వార్తలు