ఆ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం: మంత్రి జయరామ్‌

14 Apr, 2022 12:10 IST|Sakshi

సాక్షి, అమరావతి: పోరస్‌ ఇండియా కెమికల్‌ ఫ్యాక్టరీలో ప్రమాద ఘటనపై కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం స్పందించారు. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి, ప్రమాద పరిస్థితిపై సమీక్షించారు. సంబంధిత అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆరుగురు కార్మికుల మృతిపై మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో వ్యక్తులకు గాయాలు అయిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి, మెరుగైన వైద్యం అందించాలని మంత్రి గుమ్మనూరు ఆదేశించారు. ప్రమాదంపై తక్షణమే విచారణ చేపట్టి, పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రమాద ఘటనలో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షలు, ఫ్యాక్టరీ యాజమాన్యం రూ. 25లక్షలు అందిస్తుంది. ఆ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు వారికి రూ.5లక్షలు, చిన్న గాయాలు అయిన వారికి రూ. 2లక్షలు ఇవ్వడం జరుగుతుంది. ప్రమాదంలో గాయపడిన కార్మికులకు, వారు కోలుకునే వరకు వారికి ఫ్యాక్టరీ తరుపున జీతం ఇవ్వడం జరుగుతుంది. ప్రమాదానికి కారుకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు.

చదవండి: (ఏలూరు: కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి)

తాత్కాలికంగా మూసేస్తున్నాం: జిల్లా కలెక్టర్‌
హై ప్రెషర్ కెమికల్ రియాక్షన్ వల్లే పోరస్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ అన్నారు. అయితే ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స జరుగుతున్నంతకాలం కంపెనీ వేతనం అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఫోరస్‌ కంపెనీని తాత్కాలికంగా మూసేస్తున్నట్లు తెలిపారు. అయితే కంపెనీ నిబంధనలు ఏమైనా ఉల్లంఘించిందా..? ప్రమాదకర రసాయనాల వినియోగం ఏమైనా ఉందా? అనే అంశంపై విచారణ చేపడుతున్నట్లు కలెక్టర్‌ వెల్లడించారు.

చదవండి: (అగ్నిప్రమాదంపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు పరిహారం)

మరిన్ని వార్తలు