వద్దు‘లే..జీ’ నడవటం ­ఈజీ.. మరణాలకు నాలుగో ప్రధాన కారణం ఏంటో తెలుసా?

26 Feb, 2023 08:01 IST|Sakshi

తాగి డ్రైవింగ్‌ చేయడం.. అతి వేగంతో వాహనాలు నడపటం.. సిగరెట్లు తాగడం వంటివి ఎలా ప్రాణాంతకమవుతాయో.. రోజంతా మంచంపై కూర్చోవడం.. ఎలాంటి కదలికలు లేకుండా ఉండటం కూడా అంతే ప్రాణాంతకమని మీకు తెలుసా. సోమరితనం మీ విలువైన కాలంతోపాటు మీ ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది. శరీరానికి తగినంత వ్యాయామం చేయకపోతే అకాల మరణాలు సంభవించే అవకాశాలు 500 రెట్లు అధికమని ‘ది లాన్సెట్‌’లో ప్రచురించిన ఓ అధ్యయనం స్పష్టం చేసింది. నడక లేదా పరుగు వంటి సాధారణ వ్యాయామాలు చేయడానికి కూడా తీరిక లేని వ్యక్తి వ్యాధులను ఆహ్వానిస్తాడని వెల్లడించింది.

సాక్షి, అమరావతి: బడి ఈడు పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఏ వయసు వారైనా తగినంత శారీరక శ్రమ చేయడం ఆరోగ్యానికి చాలా అవసరం. ఇంటినుంచి అడుగు బయట పెట్టగానే బైక్‌ లేదా కారెక్కి తుర్రుమని గమ్యస్థానానికి చేరుతున్న వారెందరో ఉన్నారు. ఒక్క క్లిక్‌తో గుమ్మం వద్దకే అగ్గిపెట్టె నుంచి అన్నిరకాల వస్తువులు వచ్చి చేరుతున్నాయి.

దీంతో బద్ధక­స్తులు పెరిగిపోతు­న్నారు. ఫలితంగా దీర్ఘకాలిక వ్యాధులబారిన పడుతున్న వారి సంఖ్య కూడా శరవేగంగా పెరుగు­తోంది. ఉరుకుల పరుగుల జీవితంలో నడక, జాగింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, జిమ్‌ చేయడం లాంటి ఏదో ఒక వ్యాయామం చేసి తీరాలని వైద్యులు సూచిస్తున్నారు.

భారం పెరిగిపోతోంది
ప్రజలు బద్ధకిస్టులుగా మారడం.. ఆధునిక ఆహారపు అలవాట్ల వల్ల గుండె జబ్బులు, పక్షవాతం, క్యాన్సర్‌ వంటి నాన్‌ కమ్యూ­నికబుల్‌ (ఎన్‌సీడీ) వ్యాధులు దేశంలోను, రాష్ట్రంలోనూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశంలో 63 శాతం, రాష్ట్రంలో 68 శాతం మరణాలకు ఎన్‌సీడీ వ్యాధులకు కారణమవుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్‌సీడీ నివారణ, నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 30 ఏళ్ల పైబడిన వారందరికీ స్క్రీనింగ్‌ నిర్వహించి.. వారి ఆరోగ్యంపై నిరంతర ఫాలో అప్‌ను వైద్య శాఖ చేపడుతోంది.

రాష్ట్రంలో ఇప్పటివరకూ 2.80 కోట్ల మందికి స్క్రీనింగ్‌ నిర్వహించగా.. 55.41 లక్షల మందిలో రక్తపోటు లక్షణాలు వెలుగు చూశాయి. వీరిలో 16.28 లక్షల మందిలో సమస్య నిర్ధారణ అయింది. 5.46 లక్షల మంది ప్రస్తుతం చికిత్సలో ఉండగా.. 5.14 లక్షల మందిలో సమస్య అదు­పులోనే ఉంది. అదేవిధంగా 53.92 లక్షల మందిలో మధుమేహం సమస్య వెలుగు చూడగా.. 12.29 లక్షల మందికి సమస్య నిర్ధారణ అయింది. వీరిలో 4.17 లక్షల మంది ప్రస్తుతం చికిత్సలో ఉన్నారు. 3.65 లక్షల మందిలో సమస్య అదుపులో ఉంది. ఫ్యామిలీ డాక్టర్‌ విధానంలో ఎన్‌సీడీ బాధితులపై వైద్య శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తోంది.

ప్రజల్లోకి తీసుకుని వెళ్లేలా..
దీర్ఘకాలిక జబ్బుల బారిన పడేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రజలకు శారీరక శ్రమ ఆవశ్యకతను తెలియజేసి.. వారిని నడక, వ్యాయామం ఇతర కార్యకలాపాల వైపు మళ్లించడంపై వైద్య శాఖ దృష్టి సారించింది. ఈ క్రమంలో ప్రైవేట్‌ విద్యాసంస్థలు, ఎన్‌జీవోల సహకా­రాన్ని తీసుకుని వాకింగ్‌ ట్రాక్‌లు, గ్రౌండ్‌లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళిక రచించారు. పాఠశాల దశలోనే పిల్లల్లో వ్యాయామం, నడక రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

మరణాలకు నాలుగో ప్రధాన కారణం బద్ధకమే
ప్రజలు తగినంత శారీరక శ్రమ చేయకపోవడం మరణాలకు నాలుగో ప్రధాన కారణంగా ఉంటోందని డబ్ల్యూహెచ్‌వో సైతం హెచ్చరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న మరణాలకు నాలుగు ప్రధాన కారణాలను పరిశీలిస్తే అధిక రక్తపోటు మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత స్థానాల్లో పొగాకు వినియోగం, మధుమేహం, శారీరక శ్రమ చేయకపోవడం వంటివి ఉంటున్నాయి. తగినంత శారీరక శ్రమ లేకపోవడంతో ప్రజలు దీర్ఘకాలిక జబ్బులైన మధుమేహం, రక్తపోటు, పక్షవాతం, క్యాన్సర్, గుండె సమస్యలు, మానసిక రుగ్మతల బారిన పడుతున్నారు.

వీటిని నయం చేసుకోవడానికి ఏటా రూ.25 వేల కోట్ల మేర ఖర్చవుతోందని, పదేళ్లలో ఈ ఖర్చు రూ.2.50 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని గత ఏడాది ఓ నివేదికలో డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. పట్టణీకరణ పెరుగుదల, రవాణా సౌకర్యంలో మార్పులు, అవుట్‌డోర్‌ పార్కులు, వాకింగ్‌ ట్రాక్‌లు అందుబాటులో లేకపోవడం, శారీరక శ్రమ ఆవశ్య కతపై అవగాహన లేకపోవడం వంటి కారణాలు ప్రజలను బద్ధకిస్టులుగా మార్చుతున్నాయి.

ఇప్పటికే సమావేశం నిర్వహించాం
ప్రజలకు వాకింగ్‌ చేయడానికి వీలుగా మైదానాలను అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో ఇప్పటికే సమావేశం నిర్వహించాం. తమ గ్రౌండ్‌లను ఉదయం, సాయంత్రం ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరాం. వివిధ శాఖలను సమన్వయం చేసుకుని ప్రజల రోజువారి దినచర్యలో వాకింగ్, జాగింగ్, వ్యాయామం, ఇతర శారీరక శ్రమ కార్య కలాపాలను భాగం చేసేలా కార్యక్రమాలు చేపడతాం.
– జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌

మార్పు రావాలి
పాశ్చాత్య జీవన విధానానికి ప్రజలు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో అలవాట్లలో మార్పు రావాలి. మన పూర్వీకుల జీవన విధానాల్లోకి మనం వెళ్లాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు నడక, వ్యాయామం, ఈత ఇలా ఏదో ఒక శారీరక శ్రమ చేయాలి. తద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుప డుతుంది. ఊబకాయం నుంచి బయటపడొచ్చు.
– డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్, కర్నూలు జీజీహెచ్‌ 

మరిన్ని వార్తలు