ప్రకృతి ఆరాధన: చెట్టు మానులే దేవతామూర్తులు..

22 Apr, 2021 12:08 IST|Sakshi
బుట్టాయగూడెం మండలం లక్ష్మీపురంలో మానులతో చేసిన శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడి రూపాలు

 నాలుగు రకాల కొయ్యలే విగ్రహాలు

లక్ష్మీపురంలో రామనవమి వేడుకల ప్రత్యేకం

బుట్టాయగూడెం: చెట్టును, పుట్టను దేవుళ్లగా కొలవడం హిందూ సంస్కృతిలో భాగం. ప్రకృతిని ఆరాధించడం, ప్రకృతితో మమేకం కావడం దీనిలోని ఉద్దేశం. ప్రత్యేకించి గిరిజన సంప్రదాయాలు వినూత్నంగా ఉంటాయి. తరతరాలుగా తాతముత్తాతల నుంచి వచ్చిన ఆనవాయితీలను కొనసాగిస్తూ భావితరాలకు అందిస్తున్న గిరిజన తెగలు చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో నాయక్‌పోడు గిరిజనులు ఒకరు. చెట్టు మానులను కొయ్య రూపాలుగా మార్చి ఏటా శ్రీరామనవమికి పూజలు చేయడం బుట్టాయగూడెం మండలంలోని లక్ష్మీపురం నాయక్‌పోడు గిరిజనుల ప్రత్యేకం. గ్రామంలో 50 నాయక్‌పోడు గిరిజన కుటుంబాలు ఉన్నాయి. గ్రామ దేవతగా గంగానమ్మవారు పూజలందుకుంటున్నారు.

అయినా గ్రామస్తులంతా సీతారాములను ఆరాధ్య దైవంగా కొలుస్తుంటారు. ఏటా శ్రీరామనవమి సందర్భంగా అడవిలోని నాలుగురకాల చెట్ల మానులను సేకరించి వాటిని ప్రత్యేక రూపంలో మలిచి ఘనంగా పూజలు చేస్తుంటారు. తరాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు వీరంతా. గ్రామంలో రామాలయం ఉన్నా తామంతా ఇలానే దేవుళ్లకు పూజలు చేస్తామని శ్రీరామనవమి ఉత్సవ కమిటీ సభ్యులు వనుము వీర్రాజు, కుసినే మణికుమార్, కుసినే వెంకటేశ్వరరావు తెలిపారు.

నాలుగు రకాల మానుల నుంచి..
శ్రీరామనవమికి ముందు ఉత్సవ కమిటీ సభ్యులు అడవికి వెళ్లి చెండ్ర, పాల, ఊడిగ, రావిచెట్ల మానులు సేకరిస్తారు. చెండ్ర చెట్టు మానును రాముడిగా, పాలచెట్టు మానును సీతాదేవిగా, ఊడిగ చెట్టు మానును లక్ష్మణుడిగా, రావిచెట్టు మానును ఆంజనేయుడిగా చెక్కించి గ్రామ మధ్యలో ప్రతిష్టించి పూజలు చేస్తారు. ఇలా ఏటా శ్రీరామనవమి రోజు సీతారాముల కల్యాణాన్ని ఘనంగా జరిపిస్తామని వీరు చెబుతున్నారు. ఏజెన్సీ మారుమూల గ్రామంలో వినూత్న ఆచారంతో సీతారాముల కల్యాణం జరగడం ఇక్కడ ప్రత్యేకతను సంతరించుకుంది. 

అదే మాకు జయం
అడవిలోని చెట్ల మానులు తీసుకువచ్చి విగ్రహాలుగా మలిచి పూజలు చేస్తాం. ఇది మా ఆనవాయితీ. ఇదే మాకు జయం, శ్రీరామరక్ష. పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం. 
–గురువింద రామయ్య, లక్ష్మీపురం
చదవండి:
అపురూప దృశ్యం.. ఆవిష్కృతం  
గట్టిగా కేకలు వేయడంతో గుట్టుచప్పుడు కాకుండా..

మరిన్ని వార్తలు