విజయవాడ, కాకినాడ జీజీహెచ్‌లకు లక్ష్య సర్టిఫికెట్‌

13 Jun, 2021 03:17 IST|Sakshi
ప్రసూతి విభాగ వైద్యులతో నాణ్యతా ప్రమాణాల నిపుణుల బృందం(ఫైల్‌)

ప్రసూతి విభాగం ద్వారా చేసిన సేవలకు కేంద్రం నుంచి గుర్తింపు

సౌత్‌ ఇండియాలో రెండు టీచింగ్‌ ఆస్పత్రులకే దక్కిన సర్టిఫికెట్‌

ఆ రెండూ ఏపీకి చెందినవే..

కోవిడ్‌ సమయంలోనూ గర్భిణులకు విశేష సేవలు

లబ్బీపేట(విజయవాడ తూర్పు): విజయవాడ, కాకినాడ ప్రభుత్వాస్పత్రుల్లోని లేబర్‌ రూమ్‌లకు కేంద్రం ఇటీవల లక్ష్య సర్టిఫికెట్‌లు అందజేసింది. ప్రసూతి విభాగంలోని లేబర్‌ రూమ్‌లలో అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించడంతో పాటు తక్కువ సిబ్బందితో ఎక్కువ డెలివరీలు చేసినందుకు గానూ కేంద్రం ఈ సర్టిఫికెట్లు ప్రకటించింది. దక్షిణ భారత్‌లో 2 టీచింగ్‌ ఆస్పత్రులకే ఈ సర్టిఫికెట్‌ రాగా.. ఆ రెండూ ఏపీకి చెందినవే కావడం గమనార్హం.   

గతేడాది పరిశీలన.. 
కేంద్రం 2017 నుంచి ప్రసూతి విభాగంలో నాణ్యమైన సేవలందిస్తున్న వారికి పలు సర్టిఫికెట్లు అందిస్తోంది. కేంద్ర బృందం గతేడాది ఏప్రిల్‌లో విజయవాడ, కాకినాడ ప్రసూతి విభాగాలను సందర్శించింది. లేబర్‌ రూమ్, మెటర్నిటీ ఆపరేషన్‌ థియేటర్‌లలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తున్నారా? సేవలు ఎలా అందుతున్నాయి?తదితర అంశాలను తనిఖీ చేసింది. నాణ్యతా ప్రమాణాల విషయంలో విజయవాడ లేబర్‌ రూమ్‌ 100కి 95 శాతం స్కోర్‌ సాధించి లక్ష్య సర్టిఫికెట్‌ను సొంతం చేసుకుంది. కేంద్రం ఆరోగ్య రంగంలో అనేక సర్టిఫికెట్‌లు ఇస్తున్నప్పటికీ లక్ష్య సర్టిఫికెట్‌ అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా వైద్యాధికారులు పేర్కొన్నారు.  

కోవిడ్‌ సమయంలో అత్యధిక డెలివరీలు 
కోవిడ్‌ మొదటి వేవ్‌ సమయంలో ప్రైవేటు ఆస్పత్రులన్నీ మూతపడంతో డెలివరీలకు ప్రభుత్వాస్పత్రి పెద్ద దిక్కుగా మారింది. సాధారణంగా నెలలో 550 నుంచి 600 వరకు డెలివరీలు చేస్తుంటారు. కానీ కోవిడ్‌ సమయంలో 800 నుంచి 1,000 వరకు డెలివరీలు చేశారు. విజయవాడలో అయితే గతేడాది సెపె్టంబరులో 1,100 డెలివరీలు చేశారు.  
వైద్య సిబ్బంది కృషి వల్లే.. 
ప్రసూతి విభాగాల్లోని వైద్యులు, సిబ్బంది కృషితోనే కేంద్ర ప్రభుత్వం నుంచి లక్ష్య సర్టిఫికెట్‌ను పొందగలిగాం. దక్షిణ భారతదేశంలో రెండు టీచింగ్‌ ఆస్పత్రులకే ఈ సర్టిఫికెట్‌ వచ్చింది. అందులో కృష్ణా జిల్లాకు చెందిన ఆస్పత్రి ఉండటం ఆనందంగా ఉంది.  
– డాక్టర్‌ మిర్యాల కృష్ణచైతన్య, నాణ్యతా ప్రమాణాల అధికారి, కృష్ణా జిల్లా 

మరిన్ని వార్తలు