ఏపీలో ‘లంబోర్గిని’

25 Oct, 2020 03:46 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రఖ్యాత స్పోర్ట్స్‌ వెహికల్‌ బ్రాండ్‌ లంబోర్గిని ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ యూనిట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. గోల్ఫ్, ఆతిథ్య రంగాల్లో వినియోగించే ప్రీమియం బ్రాండ్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల (బ్యాటరీతో నడిచే కార్లు) తయారీ యూనిట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి పుణెకు చెందిన కైనటిక్‌ గ్రీన్‌ సంస్థ ప్రతిపాదనలు పంపింది. దేశంలో లంబోర్గిని బ్రాండ్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలు తయారు చేసి విక్రయించేందుకు గాను కైనటిక్‌ గ్రీన్‌ సంస్థతో 2018లో ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలో సుమారు రూ.1,750 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ యూనిట్, బ్యాటరీ చార్జింగ్‌ స్టేషన్లు, చార్జింగ్‌ స్వాపింగ్, ఆర్‌ అండ్‌ డీ యూనిట్లు ఏర్పాటు చేయడానికి కైనటిక్‌ గ్రీన్‌ బోర్డు ఆమోదం తెలిపింది.

ఈ మేరకు కైనటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ అండ్‌ పవర్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ ఫౌండర్‌ సీఈవో సులజ్జా ఫిరోడియా మొత్వాని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి లేఖ రాశారు. ఆ సంస్థ పోర్టు ఆధారిత సెజ్‌ ప్రాంతంలో సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో యూనిట్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. లంబోర్గిని వాహనాలతో పాటు కైనటిక్‌ గ్రీన్‌ బ్రాండ్‌ పేరుతో ద్వి, త్రిచక్ర వాహనాలను స్థానిక అవసరాలకు తోడు ఎగుమతి చేసే విధంగా యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. వచ్చే పదేళ్లలో కేవలం రాష్ట్రంలోనే 5 లక్షల ఎలక్ట్రిక్‌ వాహనాలు విక్రయిస్తామని, దీనివల్ల 2,30,00,000 మెట్రిక్‌ టన్నుల కాలుష్య ఉద్గారాలు తగ్గుతాయన్నారు. ఇది 147.34 కోట్ల చెట్లను పెంచడానికి సమానమని ఆ ప్రతిపాదనల్లో పేర్కొంది. భారీ మెగా ప్రాజెక్టుగా దీన్ని పరిగణించి దానికి అనుగుణంగా రాయితీలు ఇవ్వాల్సిందిగా కోరింది. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఆర్‌ అండ్‌ డీలో అభివృద్ధి చేసిన టెక్నాలజీ వాణిజ్యపరంగా వినియోగిస్తే దానిపై ఒక శాతం రాయల్టీ చెల్లించడానికి కంపెనీ ప్రతిపాదించింది.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు