మాచనపల్లెలో భూ వ్యవహారం వివాదాస్పదం.. స్పందించిన సీఎం ఆఫీస్‌

12 Sep, 2021 03:23 IST|Sakshi
అక్బర్‌బాషా కుటుంబ సభ్యులతో కలిసి ఎస్పీ అన్బురాజన్‌కు వినతి పత్రం ఇస్తున్న కడప నగర మేయర్‌ సురేష్‌బాబు

ఆత్మహత్య చేసుకుంటామని ఓ కుటుంబం సెల్ఫీ వీడియో 

వెంటనే స్పందించిన సీఎంవో.. వారికి న్యాయం చేయాలని కడప ఎస్పీ అన్బురాజన్‌కు ఆదేశం 

నిమిషాల వ్యవధిలో చేరుకున్న పోలీసులు.. న్యాయం చేస్తామని హామీ

ఆక్రమణదారులెవరైనా సరే చర్యలు: కడప మేయర్‌ సురేష్‌బాబు

ప్రభుత్వంపై బురద జల్లేందుకే టీడీపీ ఆరోపణలు

దువ్వూరు/కడప అర్బన్‌/చాగలమర్రి: వైఎస్సార్‌ జిల్లా దువ్వూరు మండల పరిధిలోని మాచనపల్లెలోని సర్వే నంబర్‌ 325/1లో ఉన్న 1.50 ఎకరాల భూమి వివాదం చర్చనీయాంశమైంది. ఈ భూమికి సంబంధించి తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని కర్నూలు జిల్లా చాగలమర్రికి చెందిన మిద్దె అక్బర్‌ బాషా శుక్రవారం రాత్రి ఫేస్‌బుక్‌లో తన కుటుంబ సభ్యులతో కలసి సెల్ఫీ వీడియో పెట్టాడు. అందులో.. దువ్వూరు మండలం ఎర్రబల్లె గ్రామానికి చెందిన తన భార్య అఫ్సానాకు తన మేనత్త ఖాసీంబీ 2009లో ఎకరా 50 సెంట్లు దాన విక్రయం కింద ఇచ్చిందని తెలిపారు.

కొంత కాలంగా ఆ భూమి సాగు చేసుకుంటున్నానని, అయితే ఇప్పుడు ఆ భూమిలో కొందరు అక్రమంగా నాట్లు వేస్తున్నారని, తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. వైఎస్సార్‌సీపీ నాయకులు ఇరగంరెడ్డి తిరుపాలరెడ్డి, ఆయన కుమారుడు విశ్వేశ్వరరెడ్డి తన భూమిని ఆక్రమించుకున్నారని.. మైదుకూరు రూరల్‌ సీఐ వెంకట కొండారెడ్డి వారికి మద్దతు తెలుపుతూ ఎన్‌కౌంటర్‌ చేస్తామని తనను బెదిరిస్తున్నాడని చెప్పాడు. తమకు న్యాయం చేయకుంటే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటామని పేర్కొన్నారు.

వెంటనే స్పందించిన పోలీసులు
అక్బర్‌బాషా వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో సీఎంవో వెంటనే స్పందించింది. ఈ వ్యవహారంలో బాధితులకు న్యాయం చేయాలని వైఎస్సార్‌ జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ను ఆదేశించింది. ఆయన వెంటనే ఆళ్లగడ్డ రూరల్‌ సీఐ రాజశేఖర్‌రెడ్డి, దువ్వూరు ఎస్‌ఐ చప్పలరాజులకు సమాచారం ఇచ్చారు. వారు తమ సిబ్బందితో హుటాహుటిన చాగలమర్రిలో ఉన్న మిద్దె అక్బర్‌ బాషా కుటుంబం వద్దకు నిమిషాల వ్యవధిలో చేరుకుని వారికి న్యాయం చేస్తామని తెలిపారు. ఇదే విషయమై శనివారం కడప మేయర్‌ సురేష్‌బాబు అక్బర్‌ కుటుంబంతో కలిసి కడప జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చారు. ఎస్పీని కలిసిన అనంతరం పోలీసు కార్యాలయం ఆవరణలో అక్బర్‌ బాషా మీడియాతో మాట్లాడారు.
జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో విలేకరులతో మాట్లాడుతున్న అక్బర్‌బాషా, ఆయన భార్య అఫ్సానా 

తన భార్యకు దాన విక్రయం కింద ఇచ్చిన భూమి రిజిస్టర్‌ను ఖాసీంబీ 2011 ఆగస్టు 20న రద్దు చేయించి, ఇరగంరెడ్డి తిరుపాల్‌ రెడ్డి కుమారుడు విశ్వేశ్వరరెడ్డి పేరు మీద (డాక్యుమెంట్‌ నంబర్‌ 251/2012) తిరిగి రిజిష్టర్‌ చేయించిందన్నారు. ఈ విషయమై మైదుకూరు సివిల్‌ కోర్టులో దావా వేయగా తమకు తాత్కాలిక ఇంజెక్షన్‌ ఆర్డర్‌ ఇచ్చిందని చెప్పారు. ఈ వ్యాజ్యం కోర్టులో నడుస్తుండగానే.. విశ్వేశ్వరరెడ్డి దువ్వూరు మండలం సంజీవరెడ్డి పల్లెకు చెందిన పెద్ద పుల్లారెడ్డి కుమారుడు వీర లక్ష్మిరెడ్డికి ఆ భూమిని అమ్మి (డాక్యుమెంట్‌ నెంబర్‌ 5/2019) రిజిస్టర్‌ చేయించారన్నారు. ఆపై వారిద్దరూ రాజకీయ పలుకుబడితో తమ కుటుంబాన్ని బెదిరిస్తూ భూమిని సాగు చేయిస్తున్నారని చెప్పారు. ఈ విషయం ఎస్పీకి వివరించామని, వారం రోజుల్లో తమకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ కడప మైనార్టీ నేత ఎస్‌ఎండీ షఫీ, ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు. 

వైఎస్‌ జగన్‌ను అభాసుపాలు చేసేందుకే..
మిద్దె అక్బర్‌ బాషా వైఎస్సార్‌సీపీ కార్యకర్త అని, అతడిని బెదిరించిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరానని కడప నగర మేయర్, వైఎస్సార్‌సీపీ కడప పార్లమెంటరీ అధ్యక్షుడు కె.సురేష్‌బాబు తెలిపారు. ఈ సంఘటనతో సంబంధం ఉన్న వారు వైఎస్సార్‌సీపీ వారైనా చర్యలు తీసుకోవాలని చెప్పానన్నారు. అక్బర్‌బాషా కుటుంబానికి అండగా వుంటామన్నారు. ఎక్కడో ఒక సంఘటన జరిగితే సీఎం వైఎస్‌ జగన్‌  వైఫల్యమని సామాజిక మాధ్యమాల్లో రావడం బాధాకరమన్నారు. సువర్ణ పాలన అందిస్తున్న వైఎస్‌ జగన్‌ను, ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకే కొందరు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. 

ఆ భూమిని 2012లోనే కొన్నాం
ఈ విషయంపై డీసీసీబీ మాజీ చైర్మన్‌ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, విశ్వేశ్వరరెడ్డిలను వివరణ కోరగా ఖాసీంబీ 2012లో తమ వద్దకు వచ్చిందని.. తన కూతురు, అల్లుడు మోసం చేశారని.. రద్దు చేసిన దాన విక్రయ పత్రాలను చూపించిందన్నారు. తమకు ఒక ఎకరాను రూ.6 లక్షలకు అమ్మిందని తెలిపారు. చట్ట ప్రకారం ఆ భూమి తమకే చెందుతుందని పేర్కొన్నారు. కాగా, ఈ సర్వే నంబర్‌లో 13 మంది రైతుల పేర్లు ఉన్నాయని, వాటన్నింటినీ పరిశీలించాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని రెవిన్యూ అధికారులు పేర్కొన్నారు. కాగా, ఈ విషయం తన దృష్టికి రావడంతో దగ్గరలో ఉన్న పోలీసులను 20 నిమిషాల్లో బాధితుడి ఇంటికి పింపి.. న్యాయం చేస్తామని హామీ ఇచ్చి, వారు ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడకుండా ఆపామని వైఎస్సార్‌ జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ చెప్పారు. ఈ విషయమై బాధితులకు న్యాయం చేయాలని సీఎంవో నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. మైదుకూరు రూరల్‌ సీఐ వెంకటకొండారెడ్డిపై వచ్చిన ఆరోపణలపై అదనపు ఎస్పీ (ఆపరేషన్స్‌) దేవప్రసాద్‌ను విచారణాధికారిగా నియమించామని తెలిపారు. విచారణ పూర్తయ్యే వరకు వెంకట కొండారెడ్డిని విధుల నుంచి తప్పిస్తున్నట్టు వెల్లడించారు. 

భూమి వద్దకు వస్తే అల్లుడే చంపుతామంటున్నాడు.. 
అక్బర్‌ అత్త ఖాసింబీ ఆవేదన
కడప రూరల్‌: ఏకాకినైన తనను భూమి వద్దకు వస్తే చంపుతామని అక్బర్‌ బెదిరిస్తున్నాడని వైఎస్సార్‌ జిల్లా దువ్వూరు మండలం యర్రబల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు తద్ది ఖాసింబీ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం కడపలోని వైఎస్సార్‌ మెమోరియల్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆమె విలేకరులతో మాట్లాడారు. తమకు సంతానం లేదని, తన భర్త మరణించినందున ఏకాకిగా ఉంటున్నానని తెలిపారు. గతంలో తాను చాగలమర్రిలోని తన సొంతింటికి వెళ్లినప్పుడు.. కొన్ని రోజులకు తన తమ్ముడి కొడుకు అక్బర్, కోడలు అఫ్సానాలు తనను ఇంటి నుంచి గెంటేశారని ఆరోపించారు. దీంతో జీవనాధారం కోసం అర ఎకరం పొలంలో వ్యవసాయం చేసుకుంటుంటే అక్బర్‌.. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల అండతో భూమి వద్దకు వస్తే చంపుతామని బెదిరించారని పేర్కొన్నారు. తన నుంచి ఒక ఎకరా భూమిని కొలుగోలు చేసిన వారిని కూడా పొలంలోకి దిగనీయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని చెప్పారు. దీంతో తాను ఆత్మ రక్షణ కోసం శుక్రవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని చెప్పారు. వారి నుంచి తన ఆస్తికి, ప్రాణాలకు రక్షణ కల్పించి, న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానికులు జి.ఖాసీం, సమానుల్లా, షరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు