ఇళ్ల స్థలాలు కావాలన్న కుటుంబాలు వెలి

15 Aug, 2020 12:43 IST|Sakshi
ఎస్సీలతో మాట్లాడుతున్న తహసీల్దార్‌ నాగరాజు

బాధితుల ఆందోళన అధికారులకు ఫిర్యాదు

మనుబోలు:  మండలంలోని వెంకన్నపాళెం ఎస్సీ కాలనీలో ప్రభుత్వం అందజేసే ఇళ్ల స్థలాలు కావాలన్నందుకు కొన్ని కుటుంబాలను తోటి సామాజిక వర్గం పెద్దలే వెలివేశారు. గత మూడ్రోజులుగా వారితో కాలనీ వాసులు ఎవరూ మాట్లాడకుండా నియమం విధించారు. దుకాణాల్లో సరుకులు సైతం ఇవ్వకుండా అడ్డుకున్నారు. దీంతో బాధితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ గ్రామ సచివాలయం వద్ద శుక్రవారం ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ కోసం వెంకన్నపాళెంలో ఎస్సీ కాలనీని ఆనుకుని సర్వే నంబర్‌ 131లో ఉన్న రెండెకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు గుర్తించారు.

లేఅవుట్‌ను సైతం సిద్ధం చేశారు. అయితే ఓ ప్రతిపక్ష నాయకుడి అండతో స్థానిక ఎస్సీలు తమకు అక్కడ స్థలాలు వద్దని వ్యతిరేకించడంతో లేఅవుట్‌పై వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక టీడీపీ నాయకుల ప్రోద్బలంతో కొందరు ఇటీవల దౌర్జన్యంగా లేఅవుట్‌లో గుడిసెలు వేశారు. ఈ క్రమంలో మూడ్రోజుల క్రితం తహసీల్దార్‌ నాగరాజు లేఅవుట్‌ విషయమై ఎస్సీలతో చర్చించారు. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఇళ్ల స్థలాలు ఇస్తుంటే రాజకీయ కారణాలతో వ్యతిరేకించడం మంచిది కాదని నచ్చజెప్పడంతో కొందరు స్థలాలు తీసుకునేందుకు సిద్ధపడ్డారు. దీంతో మిగిలిన వారు స్థలాలు తీసుకునేందుకు సిద్ధపడిన 14 ఎస్సీ కుటుంబాలను ద్వేషంతో వెలివేశారు.

బాధితుల్లో నలుగురు గ్రామ వలంటీర్లు కూడా ఉండడం విశేషం. ఎస్సీల వెలి, ఆందోళన విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ నాగరాజు పోలీసులతో కలిసి సచివాలయం వద్దకు చేరుకుని బాధితులతో మాట్లాడారు. ఇళ్ల స్థలాలు కావాలన్నందుకు తోటి కులస్తులే తమను కుల బహిష్కరణ చేశారని బాధితులు తహసీల్దార్‌ వద్ద వాపోయారు. తమతో ఎవరు మాట్లాడినా రూ.10 వేలు జరిమానా వేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వెలేసిన ఎస్సీ సామాజిక వర్గ పెద్దలను తహసీల్దార్‌ పిలిపించి హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన హక్కులు ఉంటాయని, ఇతరులను వెలివేసే హక్కు ఎవరికీ లేదన్నారు. మరోసారి ఇలాంటివి పునరావృతమైతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.  

మరిన్ని వార్తలు