నారా లోకేష్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడి భూమాయ

31 Oct, 2020 08:25 IST|Sakshi
మాజీ ఎంపీ నిమ్మలతో రవీంద్ర (మాస్క్‌ వేసుకున్న వ్యక్తి) శంకర్‌ (ఫుల్‌ షర్డు వేసుకున్న వ్యక్తి) 

కుటుంబ సభ్యుల పేరుతో పట్టాలు 

వారసత్వంగా 16 ఎకరాల మెట్ట భూమి 

నిబంధనలకు విరుద్ధంగా 39.52 ఎకరాలకు పట్టాదారు పాసుపుస్తకాలు 

గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు సాగించిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పేదలకు అందాల్సిన ప్రతి సంక్షేమ ఫలాన్నీ అడ్డగోలుగా స్వాహా చేయడమే కాకుండా రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను సైతం రాచమార్గంలో తమ పేరిట పట్టాలు చేయించుకున్నారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ పభుత్వం ఏర్పాటైన తర్వాత టీడీపీ నేతల అక్రమాలు బయటపడుతుండటంతో జనం ముక్కున వేలేసుకుంటున్నారు. 

సాక్షి, పుట్టపర్తి: నారా లోకేష్‌ యువజన ఫౌండేషన్‌ పుట్టపర్తి నియోజకవర్గ అధ్యక్షుడు పల్లపు రవీంద్ర భూ అక్రమాల్లో ఆరితేరిపోయాడు. నియోజకవర్గంలో రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములపై కన్నేసిన ఇతను నిబంధనలను తుంగలో తొక్కి టీడీపీ పాలనలో 39.52 ఎకరాలను స్వాహా చేశాడు. బుక్కపట్నం మండలం రామసాగారానికి చెందిన ఇతను తన సోదరుడు శంకర్, కుటుంబ సభ్యుల పేరిట పట్టాదారు పాసు పుస్తకాలు పొందాడు. 1996 నుంచి టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ ఈ బాగోతం కొనసాగుతూ వచ్చింది.  

అసైన్డ్‌ భూమి అంటే?.. 
భూమిలేని నిరుపేదలకు సాగు చేసుకోవడానికి, ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం మంజూరు చేసిన, కేటాయించిన భూమిని అసైన్డ్‌ అంటారు. ఈ భూమిని వారసత్వంగా అనుభవించాలి. ఇతరులకు అమ్మడం, బదిలీ చేయడం చేయకూడదు. పుట్టపర్తి నియోజకవర్గంలో వేలాది ఎకరాలకు పైగా ఇలాంటి అసైన్డ్‌ భూములు ఉన్నాయి. వ్యవసాయం, ఇంటి స్థలాల కోసం పేదలకు గత ప్రభుత్వాలు వీటిని పంపిణీ చేశాయి. ఈ భూములను సాగు చేసుకొని పేదరికం నుంచి బయట పడాలన్నదే ప్రభుత్వాల లక్ష్యం. ఒకవేళ మొదటిసారి భూ బదలాయింపు జరిగితే తహసీల్దార్‌ ఆ భూమిని స్వాధీనం చేసుకొని సదరు వ్యక్తికే తిరిగి అప్పగించాలి. రెండోసారి కూడా భూమి బదలాయింపు జరిగితే ఆ భూమిని స్వాధీనం చేసుకొని మొదటి వ్యక్తికి ఇవ్వకుండా మరో నిరుపేదకు ఇవ్వాలి. అసైన్డ్‌ భూములు కొనుగోలు చేస్తే చెల్లకపోవడమే కాదు.. కొనడమూ నేరమని కూడా చట్టం చెబుతోంది.    (జేసీ ఆరోగ్యం కాపాడుకో..)

నిబంధనలకు విరుద్ధంగా.. 
రెండున్నర ఎకరాల తరి లేదా ఐదెకరాల మెట్టభూమి కంటే తక్కువ భూమి ఉండి, సంవత్సర ఆదాయం రూ.11వేల కన్నా తక్కువగా ఉన్నవారు మాత్రమే ప్రభుత్వ భూమిని పొందడానికి అర్హులు. ఇలా ఒక్కో కుటుంబానికి ఐదు ఎకరాల వరకు అసైన్డ్‌ భూమికి పట్టా పొందవచ్చు. ఈ నిబంధనలకు విరుద్ధంగా 39.52 ఎకరాల వరకు ప్రభుత్వ భూములకు పల్లపు రవీంద్ర, అతని సోదరుడు శంకర్, వారి కుటుంబ సభ్యులు పట్టాలు పొందారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడ పడితే అక్కడ ఇంటి పేర్లు మార్చి తమ పేరు మీదనే కాక భార్య పేరుపై కూడా పట్టాలు పొందారు. బుక్కపట్నం మండలం మారాల రెవెన్యూ పరిధిలో 19 ఎకరాలకు పైగా, ముదిగుబ్బ మండలం మంగలమడక రెవెన్యూ పరిధిలో మరో 19 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను వీరు అప్పణంగా కాజేశారు. వీరిద్దరూ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, అప్పటి ఎంపీ నిమ్మలకిష్టప్పకు సన్నిహితులు కావడంతో అధికారులు సైతం నోరు మెదపకుండా పట్టాలు రాసిచ్చేశారు.  

►ఎకరాకు గరిష్టంగా రూ.25వేలు చొప్పున 39.52 ఎకరాలకు సుమారు రూ.10 లక్షల వరకు పావలా వడ్డీకే వివిధ బ్యాంక్‌ల ద్వారా రుణం. 
►ఈ రెండేళ్లలో పంట పెట్టుబడి సాయంలో భాగంగా వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద లబ్ధి. 
►కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వైఎస్సార్‌ రైతు భరోసా వర్తిస్తుంది. అయితే రవీంద్ర తన మాయాజాలంతో ఒక్కొక్కరికి రూ.13,500 చొప్పున కుటుంబంలోని నలుగురి పేరుతో ఈ రెండేళ్లలో రూ.1,08,000 స్వాహా చేశాడు. 

ప్రభుత్వాలను మోసగిస్తూ..  
తన పేరు మీదనే కాక తన భార్య కృష్ణవేణి, సోదరుడు శంకర్, అతని భార్య జానకి పేరుతో దాదాపు 38.86 ఎకరాల భూమిని పల్లపు రవీంద్ర రాచమార్గంలోనే స్వాహా చేశాడనే విమర్శలు ఉన్నాయి. ఇతను పట్టాలు పొందిన అసైన్డ్‌ భూములు ఏవీ సాగుకు అనుకూలమైనవి కావు. గుట్టలు, రాళ్లతో కూడిన భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు పొంది, వాటిని అడ్డుగా పెట్టి పంట రుణాలు, ఇన్‌పుట్‌ సబ్సిడీలు, ఇతర వ్యవసాయ సంక్షేమ ఫలాలను దోచేస్తూ వచ్చాడు. ఈ భూముల వివరాలను అడ్డగోలుగా వాడేస్తూ ఆదాయ పన్ను మినహాయింపు పొందడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెట్టాడు. ఇంత కాలం ప్రభుత్వాల కళ్లుగప్పుతూ వచ్చిన పల్లపు రవీంద్ర మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 

ప్రభుత్వ సొమ్ము కాజేసి..  
ప్రభుత్వ సొమ్మును కాజేయడంలో పల్లపు రవీంద్రను మించిన వారు లేరని ఈ ప్రాంత రైతులు అంటున్నారు. పూర్వీకుల నుంచి పల్లపు రవీంద్ర కుటుంబసభ్యులకు 16 ఎకరాల మెట్ట భూమి సంక్రమించింది. ఈ విషయాన్ని దాచిపెట్టి తాను నిరుపేదనంటూ గత పన్నెండేళ్లలో రవీంద్ర, ఆయన సోదరుడు శంకర్, వీరి భార్య పేరుతో 39.52 ఎకరాల అసైన్డ్‌ భూమిని పొందారు. సాగుకు నోచుకోని ఈ భూములపై సబ్సిడీ రుణాలు, పంట రుణాలు, సబ్సిడీ విత్తనాలు, పంటల బీమా పరిహారాలను పొందుతుండటం గమనార్హం. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు