రీ సర్వే కొత్తపుంతలు.. విమానాలతో ఏరియల్‌ సర్వే ద్వారా భూముల కొలత

14 Aug, 2022 03:38 IST|Sakshi
రీ సర్వేకు ఉపయోగిస్తున్న విమానం

దేశంలోనే తొలిసారి.. ప్రయోగాత్మకంగా నంద్యాలలో నిర్వహణ 

ఆ సర్వే చిత్రాలను (ఆర్థో రెక్టిఫైడ్‌ ఇమేజెస్‌) పరీక్షించిన సర్వే ఆఫ్‌ ఇండియా 

కేవలం 5 సెంటీమీటర్ల తేడాతో కొలతలు కచ్చితంగా ఉన్నట్లు నిర్ధారణ

త్వరలో కర్నూలు జిల్లాలో పూర్తి స్థాయి ఏరియల్‌ సర్వే ప్రారంభం 

జెనిసిస్‌ ఇంటర్నేషనల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ కంపెనీకి బాధ్యత

రోజుకు 200 – 300 చదరపు కిలోమీటర్ల మేర సర్వే 

సెప్టెంబర్‌ నుంచి ఉమ్మడి తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాల్లో సర్వేకు ఏర్పాట్లు 

సాక్షి, అమరావతి: వందేళ్ల తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా భూముల రీ సర్వే చేపట్టిన ప్రభుత్వం దాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లేందుకు దేశంలోనే తొలిసారిగా విమానాలను ఉపయోగించనుంది. ఇప్పటికే డ్రోన్లతో ఆధునిక తరహాలో రీ సర్వే చేయిస్తున్న ప్రభుత్వం.. దాన్ని ఇంకా ఆధునికంగా నిర్వహించేందుకు ఏరియల్‌ రీ సర్వేకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం డ్రోన్ల ద్వారా నిర్వహిస్తున్న సర్వేలో 120 మీటర్ల ఎత్తు నుంచి చిత్రాలు (ఓఆర్‌ఐ) తీస్తున్నారు.

అయితే ప్రయోగాత్మకంగా విమానం ద్వారా 1,500 మీటర్ల ఎత్తు నుంచి ఫొటోలు (ఓఆర్‌ఐ) తీయించారు. అవి మంచి నాణ్యతతో ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఎక్కువ పిక్సెల్స్‌తో, ఎక్కువ పరిధిని కవర్‌ చేసే కెమెరాలు ఉపయోగిస్తున్నారు. ఒక రోజులో 200 నుంచి 300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని విమానాల ద్వారా రీ సర్వే నిర్వహించారు. ఈ చిత్రాలు ఎక్కువ వ్యాసార్థంలో ఉంటాయి. ఎక్కువ పరిధిలోని భూమి ఒకే చిత్రంలో అత్యంత నాణ్యతగా రావడం వల్ల రీ సర్వే సులభమవుతుందని అధికారులు చెబుతున్నారు. 

సెప్టెంబర్‌ నుంచి పూర్తి స్థాయి ఏరియల్‌ సర్వే 
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 13,953 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏరియల్‌ సర్వే నిర్వహించడానికి సర్వే సెటిల్మెంట్, భూమి రికార్డుల శాఖ టెండర్లు పిలిచింది. ఎల్‌1గా నిలిచిన ముంబైకి చెందిన జెనిసిస్‌ ఇంటర్నేషనల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ కంపెనీకి ఏరియల్‌ సర్వే బాధ్యత అప్పగించారు. ఈ సంస్థే నంద్యాలలో ప్రయోగాత్మకంగా ఏరియల్‌ సర్వే చేపట్టింది. వాటిని హైదరాబాద్‌ సర్వే ఆఫ్‌ ఇండియా కార్యాలయంలో పరీక్షించి అనుకున్న దానికంటే ఎక్కువ కచ్చితత్వంతో ఉన్నట్లు నిర్ధారించారు.

ఐదు సెంటీ మీటర్ల తేడాతో కొలతలు కచ్చితంగా ఉన్నట్లు తేలింది. దీంతో సెప్టెంబర్‌ నుంచి ఈ సంస్థ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పూర్తి స్థాయి ఏరియల్‌ సర్వే మొదలు పెట్టనుంది. తనకు అప్పగించిన 13,953 చదరపు కిలోమీటర్లను రెండు విమానాలతో ఏరియల్‌ సర్వే ద్వారా కొలవనుంది. రోజుకు 200 – 300 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కొలవడానికి ఈ సంస్థ ఒప్పందం చేసుకుంది. అంటే 3 నెలల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా మొత్తంలో ఏరియల్‌ సర్వే పూర్తి చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఏరియల్‌ సర్వేకు సన్నాహాలు చేస్తున్నారు. అనంతరం అవసరాన్ని బట్టి మిగిలిన జిల్లాల్లో ఏరియల్‌ సర్వే కొనసాగించనున్నారు.

గొలుసు నుంచి విమానం వరకు.. 
► భూముల సర్వేను పాత కాలంలో చైన్‌ (గొలుసు), టేపులతో నిర్వహించే వారు. 1900 నుంచి బ్రిటీష్‌ హయాంలో ఈ విధానంలోనే సర్వే జరిగింది. చాలా కాలం ఈ విధానంలోనే భూములను కొలిచేవారు.
► టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఈటీఎస్‌ (ఎలక్ట్రానిక్‌ టోటల్‌ స్టేషన్‌) విధానంలో జియో కో – ఆర్డినేట్స్‌ ద్వారా భూముల కొలత ప్రారంభమైంది. శాటిలైట్లు వచ్చాక డీజీపీఎస్‌ (డిఫరెన్షియల్‌ గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌) ద్వారా భూముల కొలత నిర్వహిస్తున్నారు. 
► శాటిలైట్లను మరింతగా వినియోగించుకునే క్రమంలో జీఎన్‌ఎస్‌ఎస్‌ (గ్లోబల్‌ నేవిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్స్‌) రోవర్స్‌ అందుబాటులోకి రావడంతో వాటి ద్వారా భూముల సర్వే నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత మరింత ఆధునికంగా సీఓఆర్‌ఎస్‌ (కంటిన్యుయస్‌లీ ఆపరేటింగ్‌ రిఫరెన్స్‌ స్టేషన్‌) నెట్‌వర్క్‌ ద్వారా జీఎన్‌ఎస్‌ఎస్‌ రోవర్లతో సర్వే చేస్తున్నారు. ప్రస్తుతం డ్రోన్లు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో వాటితో సర్వే చేయడం ప్రారంభించారు. 

తొలిసారి విమానాలతో..
► గతంలో మైనింగ్, జాతీయ రహదారుల కోసం కొన్ని రాష్ట్రాల్లో విమానాల ద్వారా ఏరియల్‌ సర్వే చేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగు అడుగులు ముందుకు వేసి దేశంలోనే తొలిసారిగా ఏకంగా విమానాలతో ఏరియల్‌ సర్వే ద్వారా భూముల కొలిచే పద్ధతికి శ్రీకారం చుట్టింది. తద్వారా భూములను కొలిచే విధానాల్లో కొత్త చరిత్రకు నాంది పలికింది. 
► ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకం కింద చేస్తున్న రీ సర్వేలో ఈటీఎస్‌ నుంచి విమానాల వరకు అన్నింటినీ వినియోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఆధునిక విధానాలతో ముందుకు వెళుతోంది. 

ఏరియల్‌ సర్వేతో మంచి ఫలితం
ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఏరియల్‌ సర్వేలో మంచి ఫలితం వచ్చింది. కొలతలు కచ్చితంగా ఉన్నట్లు సర్వే ఆఫ్‌ ఇండియా నిర్ధారించింది. వర్షాలు తగ్గాక, పూర్తి స్థాయిలో ఏరియల్‌ సర్వే నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రీ సర్వే విజయవంతంగా సాగుతోంది. డ్రోన్ల ద్వారా ఇప్పటికే వేగంగా సర్వే నిర్వహిస్తున్నాం. విమానాలతో సర్వే చేయడం ద్వారా ఇంకా వేగంగా సర్వే చేసే అవకాశం ఉంటుంది. అందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రభుత్వం నిర్దేశించిన గడువు లోపు రీ సర్వే పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాం.  
– సిద్ధార్థ జైన్, కమిషనర్, సర్వే సెటిల్మెంట్, భూమి రికార్డుల శాఖ 

మరిన్ని వార్తలు